ETV Bharat / international

లంక మహిళల దుస్థితి.. అన్నం, మందుల కోసం శరీరాన్ని అమ్ముకుంటూ..!

author img

By

Published : Jul 20, 2022, 5:45 PM IST

Srilanka Women: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ద్వీపదేశం శ్రీలంకలో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా జౌళి పరిశ్రమ కొనుగోళ్లు లేక వెలవెలబోయింది. దీంతో ఈ రంగంలో పనిచేసే వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోతామన్న భయంతో ఇతర రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కానీ ఎక్కడా.. ఉపాధి లభించక వేశ్యల్లా మారి ఆహారం, ఔషధాలకు డబ్బుల్లేక తమ దేహాలను తాకట్టుపెడుతున్నారు.

sri lanka women changed as sex workers
sri lanka women changed as sex workers

Srilanka Crisis: చేయడానికి ఉద్యోగం లేదు.. తినడానికి తిండి లేదు.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏది కొనాలన్నా ధరల మోత.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దుర్భర పరిస్థితులివే. ఇలాంటి నిస్సహాయ స్థితిలో లంక మహిళలు పొట్టకూటి కోసం సెక్స్‌ వర్కర్లుగా మారుతున్నారు. పిల్లల కడుపు నింపేందుకు తమ శరీరాలను అమ్ముకుంటున్నారు. ఆహారం, ఔషధాలకు డబ్బుల్లేక తమ దేహాలను తాకట్టుపెడుతున్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో అనేక రంగాలు కుదేలయ్యాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ముఖ్యంగా జౌళి పరిశ్రమ కొనుగోళ్లు లేక వెలవెలబోయింది. దీంతో ఈ రంగంలో పనిచేసే వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోతామన్న భయంతో ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఇతర రంగాల్లో ఉద్యోగాలు లేక వేశ్యల్లా మారుతున్నారు.

"ఆర్థిక సంక్షోభం కారణంగా మా ఉద్యోగాలు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు సంపాదించేందుకు సెక్స్‌ వర్కే ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది. మామూలుగా మేం టెక్స్‌టైల్‌ రంగంలో నెలకు రూ.28వేల నుంచి రూ.35వేల వరకు జీతం తీసుకునేవాళ్లం. ఇప్పుడు సెక్స్‌ వర్క్‌ చేస్తే నెలకు రూ. 15వేలు మాత్రమే వస్తున్నాయి. అయినా కుటుంబాన్ని పోషించాలంటే డబ్బు కావాలి. అందుకే ఈ పని చేస్తున్నాం. నేను చేసేది తప్పే కావొచ్చు. కానీ వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయి"

-- వేశ్యగా మారిన ఓ మహిళ ఆవేదన

30శాతం పెరిగిన సెక్స్‌ వర్కర్లు..
శ్రీలంక మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సెక్స్‌ వర్కర్లుగా మారుతున్న మహిళల సంఖ్య 30 శాతం పెరిగిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొలంబో ఇండస్ట్రియల్‌ జోన్‌కు సమీపంలో ఈ తాత్కాలిక సెక్స్‌ వర్కర్లు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగారు. ఈ వేశ్యాగృహాలకు పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

డబ్బుకు బదులు దుకాణాదారులతో..
ఇంధనం, ఆహార, ఔషధాల కొరత మహిళలను ఈ తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టేసింది. పిల్లలు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉన్న మహిళలు ఎక్కువగా ఈ వృత్తిలోకి మారుతున్నారు. ఆహారం, మందులకు డబ్బుల్లేక స్థానిక దుకాణదారులకు బలవంతంగా తమ శరీరాలను అప్పగించి వాటిని కొనుక్కునే పరిస్థితికి దిగజారడం బాధాకరం.

ఇవీ చదవండి: సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?

గే వివాహాలకు చట్టబద్ధత.. కీలక బిల్లుకు దిగువ సభ ఓకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.