ETV Bharat / international

అమెరికాలో 'బియ్యం' వ్యాపారులకు కాసుల వర్షం.. భారీగా ఆర్డర్లు.. బాస్మతికి ఫుల్​ డిమాండ్!

author img

By

Published : Jul 27, 2023, 7:08 AM IST

US Rice Shortage : బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించటం వల్ల అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఆకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌.. బియ్యం టోకు వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించటం పట్ల ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణంపై చెడు ప్రభావం చూపటం వల్ల ప్రతీకార చర్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

rice shortage
rice shortage

US Rice Shortage : దేశీయంగా బియ్యం సరఫరా పెంచి.. చిల్లరధరలను అదుపు చేసేందుకు బాస్మతీయేతర బియ్యం ఎగమతులపై భారత్‌ విధించిన నిషేధం కారణంగా అమెరికాలో బియ్యానికి రెక్కలు వచ్చాయి. ధరలు పెరుగుతాయన్న భయంతో బియ్యంకోసం ఎన్‌ఆర్‌ఐలు దుకాణాల ముందు బారులు తీరుతుండటం వల్ల కొనుగోళ్లపై పరిమితి విధించారు. బియ్యం కోసం ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇళ్లకు తిరిగి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని వినియోగదారులు అంటున్నారు.బియ్యం ధరలు సాధారణం కంటే 3 రెట్లు పెరిగినట్లు ఎన్‌ఆర్‌ఐలు చెబుతున్నారు.

వ్యాపారులకు భారీగా ఆర్డర్లు..
India Rice Export Ban : భారత్‌ విధించిన నిషేధం ప్రభావం.. అమెరికాలో పెద్ద మొత్తంలో బియ్యం సరఫరా చేసే వ్యాపారులపై స్పష్టంగా కనిపిస్తోంది. వాషింగ్టన్‌, మేరీలాండ్‌, వర్జినియాలో వందలకొద్దీ రిటైల్‌ స్టోర్స్‌, రెస్టారెంట్లకు బియ్యం సరఫరా చేసే మేరిలాండ్‌లోని బియ్యం కంపెనీకి పొరుగు రాష్ట్రాలైన న్యూజెర్సీ సహా ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు పెరిగాయి. భారత్‌ నిషేధం విధించిందన్న వార్తలతో బియ్యానికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగినట్లు బాల్టిమోర్‌కు చెందిన బియ్యం టోకు వ్యాపారి ఒకరు తెలిపారు. సోనామసూరి బియ్యం కోసం భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు చెప్పారు.

బాస్మతినే ఎక్కువగా..
India Rice Export Ban Usa : వారాంతాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత వారం నుంచి వీలైనంత ఎక్కువ మొత్తంలో బియ్యం కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐలు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తమ వద్ద భారత్‌కు చెందిన అనేకరకాల బియ్యం ఉన్నప్పటికీ ఎక్కువగా ప్రీమియం గ్రేడ్‌ బాస్మతి బియ్యాన్నే కొనుగోలు చేస్తున్నట్లు అమెరికాలోని టోకు వ్యాపారి ఒకరు తెలిపారు. భారత్‌ నిషేధం విధించిన ఎగుమతుల జాబితాలో బాస్మతి బియ్యం లేదని.. అయినప్పటికీ బాస్మతి బియ్యంతోపాటు ఇతర రకాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన వ్యాపారులు చెబుతున్నారు.

దాదాపు రెట్టింపు ధరలే..
US Rice Prices : అమెరికాలో బియ్యం కోసం జనం ఎగబడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంతో పెద్దపెద్ద బియ్యం కంపెనీలన్నీ ధరలను పెంచేశాయి. ప్రస్తుత పరిస్థితులు తమలాంటి ఎందరో టోకు వ్యాపారులకు కాసులవర్షం కురుస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించిన తర్వాత అమెరికాలో ధరలు దాదాపు రెట్టింపు అయినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం నిషేధాన్ని ఇతర రకాలకు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదని భావిస్తున్న రెస్టారెంట్‌ యాజమాన్యాలు.. ఇప్పటి నుంచి బాస్మతి బియ్యం కొనుగోళ్లు పెంచినట్లు తెలుస్తోంది.

ఐఎంఎఫ్​ ఆందోళన..
Indian Rice IMF : మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత తీవ్రం కాగా.. తాజాగా బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన నిషేధంతో పరిస్థితులు మరింత జటిలంగా మారే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించటం పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ద్రవ్యోల్బణంపై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతున్నట్లు ఐఎంఎఫ్​ ప్రధాన ఆర్థికవేత్త పియర్ ఒలివర్ గౌరించస్ తెలిపారు. భారత్‌ తీసుకున్న నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా ఆహారధరలపై తీవ్ర ప్రభావం చూపటమే కాకుండా ప్రతీకార చర్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల బియ్యం ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధం తొలగించాలని కోరనున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.