ETV Bharat / international

ప్రధాని రేసులో వెనుకంజ.. అంగీకరించిన రిషి.. 'అయినా తగ్గేదేలే!'

author img

By

Published : Jul 24, 2022, 3:56 PM IST

Rishi Sunak PM chances: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారు. తుదిపోరులో సైతం గెలిస్తే బ్రిటన్‌ను పాలించే తొలి భారత మూలలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ఓ సర్వే సంచలన విషయాలు బయట పెట్టింది. ఎంపీల ఓట్లు సాధించడంలో రిషి సునాక్‌ అగ్రస్థానం సొంతం చేసుకున్నా.. కీలకమైన కన్జర్వేటివ్‌ సభ్యుల ఓట్లు పొందడంలో వెనకబడి ఉన్నట్లు ప్రకటించింది. రేసులో వెనకంజలో ఉన్నట్లు స్వయంగా అంగీకరించిన రిషి సునాక్‌.. తుదిపోరులో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.

RISHI SUNAK uk
Rishi Sunak PM chances

UK PM race 2022: బ్రిటన్‌ ప్రధాని రేసులో దూసుకెళ్లిన భారత సంతతి వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌.. అనూహ్యంగా వెనకబడినట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్‌ ఎంపీల మద్దతుతో తుది పోరులో నిలిచిన రిషికి.. ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఆశించిన మేర మద్దతు లభించటం లేదని సమాచారం. ఈ విషయాన్ని రిషి సునాక్‌ సైతం ధ్రువీకరించారు. తాజాగా బ్రిటన్‌లోని గ్రాంథాం నగరంలో ప్రసగించిన సునాక్‌ తాను వెనకబడి ఉన్నాననడంలో.. ఎలాంటి సందేహాం లేదని స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నారన్నారు. కానీ, పార్టీ సభ్యులు కొందరు ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నారని రిషి తెలిపారు. వారు తాను చెప్పేది వినేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

UK PM election 2022: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సైతం రిషి సునాక్‌ను కాకుండా ఇంకెవరినైనా ప్రధాని పీఠం ఎక్కించాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధన సంస్థ యూగవ్‌ నిర్వహించిన సర్వే సైతం సునాక్‌కు వ్యతిరేకంగా వచ్చింది. మొత్తం 730 మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులను సర్వే చేయగా.. వారిలో 62% మంది ట్రస్‌ను బలపరిచారు. రిషికి 38% మంది మద్దతిచ్చారు. సభ్యుల్లో మహిళలు-పురుషులు, అన్ని వయోవర్గాల వారు, బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసినవారిలో అత్యధికులు ట్రస్‌నే సమర్థించినట్లు యూగవ్‌ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని పీఠాన్ని రిషి అధిరోహిస్తారా అన్న ప్రశ్నంపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Rishi Sunak UK PM: కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు పాల్గొన్న వివిధ దశల ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు రిషి సునాక్‌కు అండగా నిలిచారు. కానీ ఈసారి జరిగే తుదిపోరులో లక్షా 60వేల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు బ్రిటన్‌ ప్రధానిని ఎన్నుకోనున్నారు. వీరిలో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహిస్తారు. ఈ నేపథ్యంలో ఎంత మంది సభ్యుల మద్దతు రిషి కూడగడితే ఆయన విజయవకాశాలు అంత మెరుగుకానున్నాయి. దాన్ని బట్టే రిషి ప్రధాని అవుతారా లేదా అన్నది తేలనుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ మెుదటివారం వరకు 12 విడతలుగా తుదిపోరు జరగనుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.