ETV Bharat / international

లంక అధ్యక్ష భవనంలో 1000 కళాఖండాలు మాయం!

author img

By

Published : Jul 24, 2022, 5:05 AM IST

Srilanka President Office Artefacts: ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని, ప్రధాని నివాసాన్ని ఇటీవల ఆక్రమించుకున్నప్పుడు దాదాపు వెయ్యికిపైగా కళాఖండాలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు. వీటిలో పలు పురాతన వస్తువులూ ఉన్నట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధ్యక్ష భవనంలో ఉన్న చారిత్రక ప్రాధాన్య వస్తువుల గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవని చెప్పారు.

Srilanka President Office Artefacts
Srilanka President Office Artefacts

Srilanka President Office Artefacts: శ్రీలంక అధ్యక్ష భవనంతోపాటు ప్రధానమంత్రి వ్యక్తిగత నివాసం నుంచి ఇటీవల దాదాపు వెయ్యికిపైగా విలువైన కళాఖండాలు మాయమయ్యాయి. స్థానిక పోలీసులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో అత్యంత పురాతన, అరుదైన వస్తువులు ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభం నిర్వహణలో వైఫల్యాన్ని నిరసిస్తూ.. జులై 9న లక్షల సంఖ్యలో నిరసనకారులు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతోపాటు మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేనివాసాల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. అనంతరం అక్కడే కొన్ని రోజులు తిష్ఠ వేశారు. వాటిని పిక్నిక్‌ స్పాట్‌లుగా మార్చేశారు.

ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనంతోపాటు ప్రధాని నివాసం నుంచి అరుదైన కళాఖండాలతోసహా వెయ్యికిపైగా విలువైన వస్తువులు మాయమయ్యాయని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అధ్యక్ష భవనంలోని పురాతన వస్తువులు, కళాఖండాల గురించి శ్రీలంక పురావస్తుశాఖ వద్ద రికార్డులు లేకపోవడం.. అధికారులకు సమస్యగా మారినట్లు తెలిపింది. వెయ్యికిపైగా వస్తువులు పోయినట్లు పోలీసులు అంచనా వేసినప్పటికీ.. ఈ సంఖ్యపై ఒక స్పష్టతకు రావడం కష్టమేనని పురావస్తుశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.

ఇదిలా ఉండగా.. నిరసనకారులు శాంతియుతంగా తమ ప్రదర్శనలను చేపట్టే హక్కును గౌరవిస్తానని, అయితే అధ్యక్ష భవనం, ప్రధాని నివాసం మాదిరి మరో ప్రభుత్వ భవనాన్ని ఆక్రమించడాన్ని తాను అనుమతించబోనని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తాజాగా స్పష్టం చేశారు. ప్రజాసదుపాయాలను ముట్టడించడం, పార్లమెంటును అడ్డుకోవడం వంటి చర్యలను నిరోధించేందుకుగానూ సాయుధ బలగాలు, పోలీసులకు అన్ని అధికారాలు ఇచ్చినట్లు చెప్పారు. పార్లమెంటు కార్యకలాపాలతోపాటు ప్రజాప్రతినిధుల విధులను అడ్డుకోవద్దని నిరసనకారులకు సూచించారు. మరోవైపు.. అధ్యక్ష కార్యాలయం ఎదుట పోలీసులు, సైనికులు పహారా కాస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను వారు ఖాళీ చేయించారు.

ఇవీ చదవండి: లంకలో దయనీయ పరిస్థితులు.. క్యూలైన్లలోనే కుప్పకూలుతున్న ప్రజలు!

బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరో.. లిజ్​ ట్రస్​కు పెరిగిన మద్దతు.. మరి రిషి సునాక్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.