ఐరాస వేదికగా పాక్ ప్రధాని కుయుక్తులు.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్

author img

By

Published : Sep 24, 2022, 11:21 AM IST

un pakistan india

అంతర్జాతీయ వేదికపై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్​కు... భారత్‌ దీటుగా సమాధానం చెప్పింది. ఐక్యరాజ్యస‌మితి స‌ర్వస‌భ్య స‌మావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ చేసిన వ్యాఖ్యల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. తప్పుడు ఆరోపణలను చేసేందుకు ఐరాసను వేదికగా చేసుకోవడం తగదని హితవు పలికింది. స్వదేశంలో ఉన్న స‌మ‌స్యలను పక్కదారి ప‌ట్టించేందుకు పాక్‌ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.

ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్​కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది . పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రసంగం అనంతరం భారత్‌ ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుని దాయాది దేశం కుయుక్తులను ఎండగట్టింది. అంతర్జాతీయ వేదికపై తప్పుడు ఆరోపణలు చేయడం పాక్‌కు... సాధారణం అయిపోయిందని ఐరాసలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి మిజిటో వినిటో ఎద్దేవా చేశారు. క‌శ్మీర్‌పై పాక్ ప్రధాని షెహ‌బాజ్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారని.. పాక్ సీమాంత‌ర ఉగ్రవాదానికి పాల్పడుతుందని విమర్శించారు. దావూద్ ఇబ్రహీం గురించి ప్రస్తావించిన వినిటో... శాంతి కావాల‌ని ఆశిస్తున్న దేశం ఎన్నటికీ 1993 బాంబు పేలుళ్ల నిందితుల‌కు ఆశ్రయాన్ని ఇవ్వద‌ని ఎద్దేవా చేశారు. పాక్‌తో భార‌త్ స్నేహ‌పూర్వక సంబంధాల్ని కోరుతోందని... ఉగ్రవాదం, ద్వేషం, హింస వ‌ద్దని హితవు పలికారు. స్వదేశంలో మైనార్టీల‌ను ప‌ట్టించుకోని పాకిస్థాన్‌.. ప్రపంచ మైనార్టీల ర‌క్షణ గురించి మాట్లాడ‌డం విడ్డూర‌మ‌న్నారు.

"భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్థాన్​ ప్రధాని ఈ సభ వేదికను ఎంచుకోవడం విచారకరం. పాక్‌ ప్రధాని తన దేశంలో నెలకొన్న అకృత్యాలను మరుగున పడేసేందుకు భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తన పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పుకునే దేశం... సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ప్రోత్సహించదు. భయంకరమైన ముంబయి ఉగ్రవాద దాడికి పాల్పడ్డ వారికి ఆశ్రయం కల్పించదు. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని తప్పించుకునేందుకే పాక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. పాక్‌ నుంచి సీమాంతర ఉగ్రవాదం ఆగిపోయినప్పుడు, అక్కడి ప్రభుత్వాలు పారదర్శకంగా కృషి చేసినప్పుడే ఉపఖండంలో శాంతి, రక్షణ విజ్ఞప్తులన్నీ సాకారం అవుతాయి. పాక్‌ ప్రజలు, మైనారిటీలు హింసించబడనప్పుడు మాత్రమే అది జరుగుతుంది."
-మిజిటో వినిటో, కార్యదర్శి, ఐరాసలో భారత శాశ్వత బృందం

అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకే పాక్‌ ప్రధాని... అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారని భారత్‌ విమర్శించింది. శాంతి, భద్రత, పురోగతిని మాత్రమే తాము కోరుకుంటున్నామని, సీమాంతర ఉగ్రవాదం ఆగిపోయినప్పుడే అది కచ్చితంగా జరుగుతుందని భారత్‌ తెలిపింది. పాకిస్థాన్‌తో ఉగ్ర, హింస రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్‌ కాంక్షిస్తోందని పేర్కొంది. ఇప్పటికే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాకిస్థాన్​ను... భారత్ పలుమార్లు హెచ్చరించింది. ముందు అంతర్గత సమస్యలు... దేశంలోని మైనార్టీల హక్కులను పరిరక్షించి... తర్వాత ప్రపంచ మైనార్టీల గురించి మాట్లాడాలని పాక్‌కు హితవు పలికింది. భారత్‌ ఎన్నిసార్లు హెచ్చరించినా పాక్ బుద్ధి మాత్రం మారడం లేదు.

యూఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన పాక్‌ ప్రధాని షరీఫ్... ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత్... ఏకపక్షంగా కశ్మీర్​కు ప్రత్యేక హోదాను తీసివేసిందని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. కశ్మీర్ వివాదానికి న్యాయపరమైన, శాశ్వతమైన పరిష్కారం కోసం భారత్ తో సహా పొరుగు దేశాలన్నింటితో కలిసి పని చేసేందుకు యత్నిస్తున్నామని ప్రగల్భాలు పలికారు. రెండు దేశాలు ఆయుధాలు కలిగి ఉన్నాయన్న పాక్ ప్రధాని ... సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదన్నారు. దీనికి దీటుగా బదులిచ్చిన భారత్‌... జమ్మూకశ్మీర్‌ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామే అనే విషయాన్ని ఐరాస వేదికగా పాక్‌కు మరోసారి స్పష్టంగా చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.