ETV Bharat / international

రష్యాను వీడిన పుతిన్ గురువు కూతురు.. అదే కారణమా?

author img

By

Published : Oct 28, 2022, 6:53 AM IST

ఉక్రెయిన్‌పై పుతిన్‌ చేస్తోన్న యుద్ధంపై రష్యన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిర్బంధ సైనిక సమీకరణతోపాటు నిరసనకారులను అధికారులు లక్ష్యంగా చేసుకుంటుండడం వల్ల ఎంతో మంది రష్యన్లు సొంత దేశాన్ని వీడుతున్నారు. ఈ క్రమంలో పుతిన్‌ ఒకప్పటి బాస్‌ కుమార్తె.. ప్రముఖ జర్నలిస్ట్‌ కూడా రష్యాను వీడి బాల్టిక్‌ దేశానికి వెళ్లిపోయారు.

russia ukraine war
ఉక్రెయిన్ రష్యా యుద్ధం

ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేపడుతోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిర్బంధ సైనిక సమీకరణకు భయపడి ఇప్పటికే లక్షల మంది రష్యన్లు దేశాన్ని వీడగా.. పుతిన్‌ లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో క్రెమ్లిన్‌ వ్యతిరేక నిరసనకారులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్‌ రాజకీయ గురువు అనటోలి సొబ్‌చాక్‌ కుమార్తె, ప్రముఖ జర్నలిస్ట్‌ సెనియా సొబ్‌చాక్‌ రష్యాను వీడారు. ఓ కేసుకు సంబంధించి ఆమె సహోద్యోగిని నిర్బంధించడంతోపాటు తన ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేపట్టిన తరుణంలో లిథువేనియాకు వెళ్లిపోయారు.

రష్యాలో ప్రముఖ జర్నలిస్టుగా పేరుగాంచిన సెనియా సొబ్‌చాక్‌ (40).. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న సైనిక చర్యను మొదటినుంచీ తప్పుపడుతున్నారు. ఇదే విషయంపై పుతిన్‌ను ఆమె పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రశ్నించారు. 2012లో అధ్యక్ష ఎన్నికల ముందు జరిగిన క్రెమ్లిన్‌ వ్యతిరేక నిరసనల్లోనూ సెనియా పాలుపంచుకున్నారు. 2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన ఆమె.. సుమారు 2శాతం ఓట్లను సాధించారు. అనంతరం విపక్ష నేతలతో జరిగిన సమావేశంలో పుతిన్‌తోనూ భేటీ అయ్యారు.

అయితే, ఓ కేసుకు సంబంధించి సెనియా పనిచేస్తోన్న మీడియా సంస్థ డైరెక్టర్‌ను పోలీసులు ఇటీవల నిర్బంధించారు. అనంతరం ఆమె నివాసంపైనా పోలీసులు సోదాలు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా ఆమెను అరెస్టు చేసేందుకు వారెంట్‌ కూడా పోలీసులు వద్ద ఉన్నట్లు రష్యా మీడియా ఏజెన్సీ వెల్లడించింది. అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించిన ఆమె.. తమ మీడియా సంస్థపై కక్ష్యపూరితంగానే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ బాల్టిక్‌ దేశమైన లిథువేనియాకు వెళ్లిపోయారు.

సెనియా సొబ్‌చాక్‌ తండ్రి అనటోలి సొబ్‌చాక్‌. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ మాజీ మేయర్‌. ప్రజాస్వామ్య సంస్కరణవాది. అయితే, సొబ్‌చాక్‌ను రాజకీయ గురువుగా పేర్కొనే పుతిన్‌.. ఆయన ప్రభావం తనపై ఎంతో ఉందని తరచుగా చెప్పేవారు. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత చాలా కాలంపాటు ఆయనతో కలిసి పనిచేసినట్లు గుర్తుచేసుకునేవారు. అంతేకాదు సెనియా చిన్నతనంలో రెండు కుటుంబాలు తరచుగా విహార యాత్రలకు వెళ్లేవని సమాచారం.

పుతిన్​తో ప్రముఖ జర్నలిస్ట్‌ సెనియా సొబ్‌చాక్‌


ఇవీ చదవండి: అణుభయాల వేళ.. రష్యాకు వెళ్లనున్న భారత విదేశాంగ మంత్రి

బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్‌కు మోదీ తొలిసారి ఫోన్‌.. ఆ అంశాలపై కీలక చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.