గృహ నిర్బంధం వార్తలకు చెక్​.. బహిరంగ కార్యక్రమంలో కనిపించిన జిన్​పింగ్

author img

By

Published : Sep 27, 2022, 7:45 PM IST

China president Xi Jinping

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గృహ నిర్బంధం వార్తలకు చెక్‌ పడింది. ఉజ్బెకిస్తాన్‌లో పర్యటన తర్వాత ఆయన తొలిసారిగా బీజింగ్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలను చైనా మీడియా ప్రసారం చేసింది. దీంతో చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, జిన్‌పింగ్‌ను అరెస్టు చేశారని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలకు పూర్తిగా తెరపడింది.

చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధం చేశారని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేనప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సాగింది. ఆయన వరుసగా మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తుండడం వల్ల, మధ్య ఆసియా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనపై కుట్ర జరిగిందనేది ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలను చైనాలో ఉన్న వివిధ దేశాలకు చెందిన విలేకరులు ఇదివరకే ఖండించారు. బీజింగ్‌లో అలాంటి సూచనలు ఏమీ కనిపించడం లేదని స్పష్టం చేశారు. చైనాలో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జిన్‌పింగ్‌ క్వారంటైన్‌లో ఉండి ఉంటారని తెలిపారు.

ఈ క్రమంలో ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత జిన్‌పింగ్‌ తొలిసారి బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌కు ఆయన విచ్ఛేశారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ను నిర్బంధించారన్న వార్తలకు పూర్తిగా తెరపడింది. ఈ నెలలో మధ్య ఆసియా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత, జిన్‌పింగ్‌ బయట కనిపించడం ఇదే మొదటిసారి.

మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన అధ్యక్షుడు జిన్ పింగ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుని ముచ్చటగా మూడోసారి చైనా పగ్గాలు అందుకునే దిశగా సాగుతున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో జరిగే అతి కీలకమైన సీపీసీ సమావేశాలకు జిన్ పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2,300 మంది ప్రతినిధులు ఎన్నికైనట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఫలితంగా జిన్ పింగ్ మూడోసారి చైనా అధికారపగ్గాలు చేపట్టేందుకు ఆ సీపీసీ సమావేశాల్లోనే ఆమోదం లభించనుందని విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఇవీ చదవండి: 'ఊరికే చెప్పడం లేదు.. అణుబాంబు వేసి తీరుతాం!'.. రష్యా హెచ్చరిక

షింజో అబేకు ఘనంగా వీడ్కోలు.. మోదీ, సహా వందకుపైగా దేశాల ప్రతినిధులు హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.