ETV Bharat / entertainment

నవరస నటనా సార్వభౌముడు కైకాల.. సినీ ప్రస్థానమిలా..

author img

By

Published : Dec 23, 2022, 9:33 AM IST

Updated : Dec 23, 2022, 11:58 AM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 60 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన ప్రముఖ నటుడు కైకాల సత్యన్నారాయణ. శుక్రవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ ప్రస్థానానికి సంబంధించిన విశేషాలివీ..

kaikala satyanarayana biography
కైకాల సత్యన్నారాయణ

Kaikala Satyanarayana: గంభీరమైన వాచకంతో, నవరస భరితమైన నటనతో అబ్బురపరిచే అభినయంతో హావభావాలను పలికిస్తూ, నటనకు కొత్త భాష్యం చెప్పిన నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటుడాయన. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 700లకు పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించి మెప్పించారు.

నాటకరంగంతో కెరీర్‌ను ప్రారంభించి..
సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించారు. గుడ్లవల్లేరులో హైస్కూల్‌, విజయవాడ, గుడివాడలలో కాలేజీ విద్యనభ్యసించారు. నాటకాల మీద అభిరుచి పెరిగి, ఎప్పటికైనా మంచి నటుడిగా ఎదగాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి 'పల్లె పడుచు' 'బంగారు సంకెళ్లు', 'ప్రేమ లీలలు', 'కులం లేని పిల్ల', 'ఎవరు దొంగ' వంటి నాటకాల్లో అటు విలన్‌గా, ఇటు హీరోగా మెప్పించారు. 1955 నాటికే డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. దీంతో రాజమహేంద్రవరంలో సత్యనారాయణ కుటుంబానికి కలప వ్యాపారం ఉండటంతో కొంతకాలం అక్కడ ఉన్నారు. స్నేహితుడు కె.ఎల్‌.ధర్‌ సలహా మేరకు సినిమాల్లో ప్రయత్నాలు చేసేందుకు మద్రాసు వెళ్లారు.

యుముడి వేషంలో కైకాల సత్యన్నారాయణ

తొలి అడుగులు అలా..
తొలుత ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో సహాయ కళా దర్శకుడిగా జీవితం ప్రారంభించారు. 'కొడుకులు-కోడళ్లు' అనే సినిమా కోసం దర్శక-నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌.. సత్యనారాయణకు స్క్రీన్‌ టెస్టులు చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ప్రారంభం కాలేదు. అయితే సత్యనారాయణ పట్టు వదలని విక్రమార్కుడిలా తన సినిమా ప్రయత్నాలు కొనసాగించారు. బి.ఎ.సుబ్బారావు సూచన మేరకు ప్రముఖ దర్శక-నిర్మాత కె.వి.రెడ్డిని కలిశారు. ఆయన కూడా మేకప్‌ టెస్టు, వాయిస్‌ టెస్ట్‌, స్క్రీన్‌ టెస్ట్‌లన్నీ చేసి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అలా 'దొంగరాముడు'లో ఆయనకు దక్కాల్సిన పాత్ర ఆర్‌.నాగేశ్వరరావుకు దక్కింది. నటనపై సత్యనారాయణకు ఉన్న మక్కువను చూసి చివరకు దేవదాసు నిర్మాత డి.ఎల్‌. నారాయణ 'సిపాయి కూతురు' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజయం దక్కించుకోలేదు. అయితే, మూడు సంవత్సరాల కాంట్రాక్టు మీద నెలకు రూ.300లకు సత్యనారాయణ పనిచేయడంతో మరో సంస్థలో పనిచేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు అవకాశాలు లేకపోవడంతో కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూపుగా నటించారు. 1960లో ఎన్టీఆర్‌ చొరవతోనే 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి'లో అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత సత్యనారాయణ టాలెంట్‌ గుర్తించిన విఠలాచార్య 'కనకదుర్గ పూజా మహిమ'లో సేనాధిపతి పాత్ర ఇచ్చారు. ఇది సత్యనారాయణ కెరీర్‌ను నిలబెట్టింది. అప్పుడే నాగేశ్వరమ్మను ఆయన వివాహం చేసుకున్నారు. చిన్నా, పెద్ద పాత్రలతో సంబంధం లేకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సత్యనారాయణ అందిపుచ్చుకున్నారు.

అవార్డ్​ పొందుతున్న కైకాల

విలన్‌ పాత్రలే కాదు, విభిన్న పాత్రలకూ సత్యనారాయణ కేరాఫ్‌ అడ్రస్‌..
'కనక దుర్గ పూజా మహిమ' తర్వాత కొంతకాలం గ్యాప్‌ వచ్చినా, 1962 నుంచి వరుస అవకాశాలు తలుపుతట్టాయి. 'స్వర్ణగౌరి'లో శివుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత 'మదన కామరాజు కథ'లో ధర్మపాలుడిగా, 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో కర్ణుడిగా, 'నర్తనశాల'లో దుశ్శాసనునిగా నటించారు. విఠలాచార్య 'అగ్గి పిడుగు'లో రాజనాల ఆంతరంగికునిగా, 'జిస్‌ దేశ్‌ మే గంగా బెహతీ హై'లో ప్రాణ్‌ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. 'శ్రీకృష్ణావతారం', 'కురుక్షేత్రం'లో సుయోధనుడిగా, 'దాన వీర శూరకర్ణ'లో భీమునిగా, 'సీతా కల్యాణం'లో రావణాసురుడిగా, అసమాన నటన ప్రదర్శించారు. వరుస పాత్రలతో సత్యనారాయణ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక చిత్రాల్లో నటనతో వెండితెరపై చెరగని ముద్రవేశారు. 'ప్రేమనగర్‌'లో కేశవ వర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. 'అడవి రాముడు', 'వేటగాడు' సినిమాల్లో విభిన్నమైన విలన్‌ పాత్రలు పోషించి మెప్పించారు.

ఎస్వీఆర్‌ తర్వాత ఏకైక నటుడు సత్యనారాయణ
ఎస్వీ రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీరమైన పాత్రలు ఎక్కువగా సత్యనారాయణను వరించాయి. అటు పౌరాణికం, ఇటు జానపదం, సాంఘిక చిత్రాల్లో బలమైన పాత్రలు దక్కాయి. 'గూండా', 'గ్యాంగ్‌ లీడర్‌', 'సమర సింహారెడ్డి' వంటి సినిమాల్లో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున ఇలా ఆనాటి యువ హీరోలకు ప్రతినాయకుడు అంటే సత్యనారాయణ. రావుగోపాలరావుతో కలిసి విలన్‌గా తెరను పంచుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరపై చెరగని ముద్రవేశారు. తండ్రిగా, తాతగా, ఇంటి పెద్దగా ఇలా ఒక్కటేమిటి సత్యనారాయణ పోషించని పాత్ర అంటూ లేదు.

కైకాలకు అభినందనలు తెలుపుతున్న చిరంజీవి

నిర్మాతగానూ సత్యనారాయణ ముద్ర
రమా ఫిలిమ్స్‌ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన సత్యనారాయణ 'గజదొంగ', 'ఇద్దరు దొంగలు', 'కొదమ సింహం', 'బంగారు కుటుంబం', 'ముద్దుల మొగుడు' వంటి చిత్రాలను తీశారు. కొన్ని చిత్రాలకు చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించారు. సత్యనారాయణ తన కెరీర్‌లో చిన్నా, పెద్దా వేషాలు కలిపి 800లకు పైగా పాత్రలు పోషించారు. దాదాపు 200మంది దర్శకులతో పనిచేశారు. అభిమానులు, కళా సంస్థలు సత్యనారాయణ నటనను మెచ్చి ఎన్నో బిరుదులు ఇచ్చాయి. 'కళా ప్రపూర్ణ', నవరస నటనా సార్వభౌమ' ఇలా ఎన్నో అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక సత్యనారాయణ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తెలుగుదేశం తరపున 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Last Updated : Dec 23, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.