ETV Bharat / entertainment

మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఆ వార్తల్లో నిజం లేదట

author img

By

Published : Dec 20, 2022, 10:41 PM IST

బాలీవుడ్‌ ప్రాజెక్టుల నుంచి సమంత వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె ప్రతినిధులు తెలిపారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

SAMANTHA HEALTH
SAMANTHA HEALTH

వరుస అవకాశాలతో తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగారు సమంత. 'ఫ్యామిలీమ్యాన్‌2' వెబ్‌సిరీస్‌ సక్సెస్‌తో పలు బాలీవుడ్‌ ఆఫర్లు కూడా వచ్చాయి. అంతా బాగుందనుకునే సమయంలో మయోసైటిస్‌ అనే ఆటోఇమ్యూనీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు సామ్‌ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కాదు, ఇప్పటికే ఆమె అంగీకరించిన సినిమాలపైనా సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా కొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్టుల నుంచి ఆమె వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సమంత ప్రతినిధి స్పష్టత ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

''సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె 'ఖుషి' షూటింగ్‌లో పాల్గొంటారు. అది పూర్తయిన వెంటనే ఇప్పటికే ఆమె ఓకే చేసిన బాలీవుడ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. జనవరి నుంచి సమంత ఒక హిందీ మూవీ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదు. బహుశా ఆ సినిమా షూటింగ్‌ మరో ఆర్నెల్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే నుంచి ఆమె హిందీ మూవీ చిత్రీకరణలో పాల్గొనవచ్చు'' అని సమంత ప్రతినిధి వివరించారు. సినిమా షూటింగ్‌ కోసం దర్శక-నిర్మాతలను నెలల పాటు వేచి చూసేలా చూడటం మంచి విషయం కాదని ఈ సందర్భంగా వివరించారు.

''ఎంతో కష్టంతో కూడుకున్న సినిమా షూటింగ్‌ కోసం ఒకరిని వేచి ఉండేలా చేయడం భావ్యం కాదు. ఎందుకంటే ఎంతోమంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒకవేళ వేచి చూడటం సాధ్యం కాకపోతే, వారి షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ చేసుకోమని ఇప్పటికే స్పష్టత ఇచ్చాం. ఇప్పటివరకూ సమంత సైన్‌ చేసిన ఏ ప్రాజెక్ట్‌ నుంచీ వెళ్లిపోలేదు. అలాగే కొత్త ప్రాజెక్టులను సైతం ఒప్పుకోలేదు. సమంత తర్వాతి సినిమాల విషయంలో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు'' అని సమంత ప్రతినిధులు వివరణ ఇచ్చారు.

ఇటీవల సమంత నటించిన 'యశోద' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరోవైపు గుణశేఖర్‌ దర్శకత్వంలో ఆమె నటించిన 'శాకుంతలం' చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ దేవరకొండతో కలిసి చేస్తున్న 'ఖుషి' చిత్రీకరణలో ఉండగానే సమంత మయోసైటిస్‌తో బాధపడ్డారు. దీంతో సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి, చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.