ETV Bharat / entertainment

'అందుకే 'విరాటపర్వం' కథను ఎంచుకున్నా'

author img

By

Published : Jun 9, 2022, 6:44 AM IST

Updated : Jun 9, 2022, 7:30 AM IST

Rana Virataparvam movie: 'విరాటపర్వం' ఓ గొప్ప ప్రేమకథ. కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అని అన్నారు దర్శకుడు వేణు ఊడుగుల. రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను తెలిపారు వేణు ఊడుగుల. ఆ సంగతులివీ..

Rana Virataparvam movie
రానా సాయిపల్లవి విరాటపర్వం

Rana Virataparvam movie: "విరాటపర్వం ఓ గొప్ప ప్రేమకథ. కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా. 'విక్రమ్‌', 'మేజర్‌' సినిమాలతో బాక్సాఫీస్‌ వాతావరణం కాస్త సెట్‌ అయింది. ఇప్పుడు మా చిత్రంతో అది మరింత మెరుగవుతుందని భావిస్తున్నా" అన్నారు వేణు ఊడుగుల. 'నీదీ నాది ఒకే కథ' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడాయన. రెండో ప్రయత్నంగా 'విరాటపర్వం' తెరకెక్కించారు. రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో ముచ్చటించారు వేణు ఊడుగుల.

ప్రచార చిత్రాలు చూస్తుంటే ప్రేమకు, నక్సలిజానికి ముడిపెట్టినట్లు అర్థమవుతోంది. ఇదెలా సాధ్యమైంది?

"ఈ చిత్రానికి.. 'రెవెల్యూషన్‌ ఈజ్‌ యాన్‌ యాక్ట్‌ ఆఫ్ట్‌ లవ్‌' అని క్యాప్షన్‌ ఇచ్చాం. అంటే.. విప్లవం అనేది ప్రేమైక చర్య అని అర్థం. ఆ మాటని చాలా విస్తృతంగా అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేదే కాదు. ఒక సమూహానికి వ్యక్తికి మధ్య ఉండే ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే ఒక సమూహంలోకి వెళ్లాలని అనుకుంటారు. అలా జీవితాల్ని త్యాగం చేయాలనుకుంటారు. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం. 1992 నేపథ్యంలో సాగుతుంది. అప్పటి దేశ, రాష్ట్ర రాజకీయాలను, పోరాటాలను చూపిస్తూనే.. వాటి మధ్య జరిగే ఓ అందమైన ప్రేమకథను దీంట్లో చూపించనున్నాం".

మీకు లెఫ్ట్ నేపథ్యం ఏమైనా ఉందా?

"ఒక రాజకీయ, సంక్లిష్టమైన వాతావరణంలో పెరిగా. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేశాయి. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల సహజంగానే కొంత ప్రోగ్రసీవ్‌ ఐడియాలజీ ఉంటుంది. అంతేకానీ లెఫ్ట్​, రైట్‌ అని కాదు".

రెండో సినిమాకే ఇంత బరువైన కథ ఎంచుకోవడానికి కారణమేంటి?

"నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు.. నేనెలాంటి సినిమాలు తీయాలనే విజన్‌ని ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమానే 'విరాటపర్వం'. బరువైన కథ చెప్పాలని గానీ.. క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. నా టెంపర్మెంటే నా సినిమా. ఈ కథ చెప్పాలనుకున్నా.. చెప్ఫా అంతే".

ఇప్పుడు లెఫ్ట్ భావజాలం బాగా తగ్గిపోయింది. ఈతరానికి దానిపై సరైన అవగాహన లేదు. ఇలాంటి సందర్భంలో ఈ కథని అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పగలనని అనుకున్నారు?

"లెప్ట్‌, రైట్‌ అనేది అప్రస్తుతం. నేపథ్యాన్ని పక్కకు పెడితే.. కథలో ఉన్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. ఒక దొంగల కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఓ ప్రేమకథ చెబితే తప్పకుండా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఇక్కడ నేపథ్యానికి సంబంధం లేదు. 'విరాటపర్వం'లోనూ ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 90ల్లోని రాజకీయ సందర్భాన్ని.. ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రంలో వెన్నెల అనే ఒక అమ్మాయి ప్రేమ కథ ఉంది. నక్సల్‌ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇదే. ఈ చిత్ర ముగింపు ప్రేక్షకుడిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందని కచ్చితంగా చెప్పగలను".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది వెన్నెల కథ అంటున్నారు. రానా లాంటి హీరోని ఈ కథ కోసం ఎలా ఒప్పించారు?

"ఈ కథ రానా ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు.. ఆయన గొప్పదనమే. నేను సురేష్‌బాబుకు ఈ కథ చెప్పాను. ఆయన 'రానాకి లైన్‌ నచ్చింది చేస్తావా?' అనడిగారు. తర్వాత రానాకు వెళ్లి కథ వినిపించా. విన్న వెంటనే చేస్తానన్నారు. ఈ కథని ఆయనెందుకు చేస్తానన్నారో కాసేపు అర్థం కాలేదు. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారనే గొప్ప మనసుతో ఈ చిత్రం చేశారు".

భవిష్యత్తులో ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నారు?

"అర్థవంతమైన.. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే సినిమాలు చేయాలనేది నా తపన. ఇప్పుడు అలాంటి కథలే రాశాను. 'విరాటపర్వం' విడుదలయ్యాకే తర్వాతి చిత్రంపై దృష్టి పెడతా. ‘ఆహా’ కోసం మైదానం నవలతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నాం. దానికి నేను షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నా. చలం రాసిన నవలకు మనదైన వ్యాఖ్యానంతో ఉంటుంది".

వెన్నెల పాత్రకు ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? కథ వినగానే సాయిపల్లవి స్పందన ఏంటి?

"సరళ అనే ఒక అమ్మాయి జీవితాధారంగా వెన్నెల పాత్రను తీర్చిదిద్దుకున్నా. అలాగని ఇది బయోపిక్‌ కాదు. ఒక సంఘటన ఆధారంగానే స్క్రిప్ట్‌ రాసుకున్నా. ఇది సినిమా కాబట్టి.. దీంట్లో కొంత ఫిక్షన్‌ ఉంటుంది. ట్రైలర్‌లో సాయిపల్లవి బ్యాగ్‌ పట్టుకొని జమ్మిగుంట అనే ఊరు నుంచి నడిచొస్తుంటుంది కదా. అది మా పక్క ఊరే. నేను ఈ కథ రాస్తున్నప్పుడు అదే ఇమేజ్‌లో సాయి పల్లవి కలలోకి వస్తుండేది. అప్పటి వరకు నేను ఆమెను కలిసింది లేదు. కానీ, ఆ వెన్నెల పాత్రలో ఆమే కనిపిస్తుండేది. నేను ఈ కథని ఆమెకు పది నిమిషాలే చెప్పాను. ఆమె వెంటనే ఓకే చేసేశారు. తను అనే కాదు సురేష్‌బాబు సహా మిగిలిన నటీనటులంతా సింగిల్‌ సిట్టింగ్‌లోనే కథని ఓకే చేశారు. మహాభారతంలో విరాటపర్వం అనేది అండర్‌ గ్రౌండ్‌ స్టోరీ. అందులో ఉన్న కుట్రలు, రాజకీయ ఫిలాసఫీ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతాయని ఆ టైటిల్‌ పెట్టాం".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అప్పుడు ఓ సాధారణ డ్రైవర్​.. ఇప్పుడు కామెడీ స్టార్​.. కానీ ఆ ఇబ్బందులతో..

Last Updated : Jun 9, 2022, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.