ETV Bharat / entertainment

నాగార్జునే స్ఫూర్తి.. సైకిల్​ చైన్​తో భయపెట్టేవాడిని: స్టార్ హీరో

author img

By

Published : Jul 26, 2022, 5:31 PM IST

Kicha Sudeep Vikranth Rona: 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' లాంటి చిత్రాల పోస్టర్లను తమ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గర్వంగా పెట్టుకున్నామని, ఆ జాబితాలో కిచ్చా సుదీప్​ నటించిన 'విక్రాంత్‌ రోణ' త్వరలో చేరుతుందన్నారు ప్రముఖ నటుడు నాగార్జున. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, ఆయన మాట్లాడారు. ఇక సుదీప్​ మాట్లాడుతూ.. నాగ్​పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

nagarjuna kicha sudeep
నాగార్జున కిచ్చా సుదీప్

Kicha Sudeep Vikranth Rona: నాగార్జున నటించిన శివ సినిమా స్ఫూర్తితో సైకిల్​ చైన్లను తీసుకుని బ్యాగ్స్‌లో పెట్టుకుని తిరిగేవాడినని అన్నారు హీరో కిచ్చా సుదీప్​. తాను థియేటర్​లో చూసిన తొలి చిత్రం కూడా అదేనని చెప్పారు. ఆయన నటించిన తాజా మూవీ 'విక్రాంత్‌ రోణ'. అనుప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జునను ఉద్దేశించి ఆయన ఈ విధంగా మాట్లాడారు.

ఒక్క ఫోన్‌ కాల్‌తో వచ్చారు.. "టెలివిజన్‌లో నేను చూసిన తొలి తెలుగు సినిమా 'రాముడు- భీముడు'. థియేటర్‌లో చూసిన తొలి తెలుగు చిత్రం 'శివ'. నేను ఈ సినిమాని 2 రోజుల్లో 3 షోలు చూశా. సైకిల్‌ చైన్‌తో ఎవరినైనా కొట్టొచ్చని ఈ చిత్రం చూసేంత వరకూ ఎవరికీ తెలియదు. ఆ స్ఫూర్తితో నా స్నేహితులతో కలిసి సైకిల్‌ షాప్‌కు వెళ్లి, అక్కడున్న చైన్లు తీసుకుని బ్యాగ్స్‌లో పెట్టుకునేవాడ్ని. ఇతరులను సరదాగా భయపెట్టేందుకు అలా చేసేవాడ్ని. అలాంటిది ఆ సినిమా హీరో నాగార్జున సర్‌ పక్కన నేను నిల్చోవడం సంతోషంగా ఉంది. ఆయన్ను నేరుగా కలవకపోయినా ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఆహ్వానించగానే ఈ వేడుకకు వచ్చారు. థ్యాంక్స్‌ నాగార్జున సర్‌. 'విక్రాంత్‌ రోణ' సినిమా చిత్రీకరణ సుమారు 70 శాతం హైదరాబాద్‌లోనే సాగింది. ఇందులో ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్‌ చేశాం. 'ఈగ', 'బాహుబలి', 'సైరా'.. ఇలా తెలుగు సినిమాల్లో నేను ఏ చిన్న పాత్ర పోషించినా నన్ను మీరు ఆదరించారు" అని సుదీప్‌ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

నాగార్జున మాట్లాడుతూ.. "సుదీప్‌ కన్నడ అబ్బాయి కాదు. మన తెలుగువాడే. తానెప్పుడూ ఇక్కడే ఉంటాడు (హైదరాబాద్‌). భారతీయ సినీ ప్రేక్షకులందరికీ సుదీప్‌ తెలుసు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి, మెప్పించాడు. ఇప్పుడు 'విక్రాంత్‌ రోణ'తో ఒకేసారి అన్ని భాషల వారిని పలకరించబోతున్నాడు. 'ఫేవరెట్‌ ఫిల్మ్‌ను ఇక్కడ చిత్రీకరించారు' అని గర్వంగా ఫీలవుతూ ఆయా చిత్రాలకు సంబంధించి పెద్ద పెద్ద పోస్టర్లను అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెడుతుంటాం. ఈ క్రమంలో ఇటీవల.. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాల పోస్టర్లు పెట్టాం. ట్రైలర్‌ చూసినప్పుడే 'విక్రాంత్‌ రోణ' కూడా ఆ జాబితాలో చేరుతుందనిపించింది. ఇతర చిత్ర పరిశ్రమల ప్రేక్షకుల గురించి నాకు తెలియదుగానీ సినిమా నచ్చితే చాలు తెలుగు ప్రేక్షకులు దాన్ని ఓ స్థాయిలో నిలబెడతారు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వాలి" అని నాగార్జున ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: బాలయ్య క్రేజ్​.. బామ్మా మాజాకా​​.. విజిల్స్​, డ్యాన్స్​లతో ​రోడ్డుపై రచ్చ రచ్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.