ETV Bharat / crime

రాత్రికి కలగంటాడు.. ఉదయాన్నే దొంగతనం చేస్తాడు..! ఇది ఓ దొంగ స్టైల్..!!

author img

By

Published : Apr 2, 2022, 2:20 PM IST

Updated : Apr 2, 2022, 7:51 PM IST

guntur thief steal money and gold
రాత్రికి కలగంటాడు.. ఉదయాన్నే దొంగతనం చేస్తాడు

Variety thief arrested: రాత్రికి కలగంటాడు ఉదయాన్నే దొంగతనానికి బయల్దేరుతాడు.. చోరీ చేసిన సొమ్మును దొరికిపోతాననే భయంతో భద్రంగా దాచుకుంటాడు. దాదాపు 43 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ ఘరానా దొంగ స్టైల్‌ ఇది. అతని పాపం పండింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని వనస్థలిపురం పోలీసులకు చిక్కాడు.

Variety thief arrested: దొంగతనాలు చేయడానికి.. పథకం పన్ని దాన్ని పక్కాగా అమలుపరుస్తుంటారు దుండగులు. కానీ, ఓ దొంగ మాత్రం రాత్రిళ్లు కలలు కని.. ఉదయాన్నే దొంగతనానికి పాల్పడతాడు. ఇదేదో సినిమా కథలా ఉందనుకుంటే మనం పొరపడినట్లే. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ రీతిలో దొంగతనాలకు పాల్పడుతూ.. చివరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని వనస్థలిపురం పోలీసులకు చిక్కాడు.

హైదరాబాద్ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గాంధీనగర్ కు చెందిన ముచ్చు అంబేడ్కర్(50), అలియాస్ రాజు, అలియాస్ కందుల రాజేంద్రప్రసాద్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. 1989 నుంచి హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోనూ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. 1991లో లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 21 కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేసినా, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. గత పదేళ్లుగా నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు.

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎక్కువ దొంగతనాలను చేశాడు. నిందితుడిపై మొత్తం 43 కేసులు ఉండగా, ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 21 కేసులు నమోదయ్యాయని, అతన్ని వనస్థలిపురంలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడికి గుంటూరులో మూడంతస్తుల భవనం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలు ఎక్కడా విక్రయించకుండా ఇంట్లోనే దాచుకునే వాడని సీపీ వెల్లడించారు. ఎక్కడ దొంగతనం చేయాలో ముందు రోజు కల వస్తుందని, ఆ తర్వాత చోరీకి పాల్పడతానంటూ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే, నిందితుడు చోరీ చేసిన బంగారు ఆభరణాలు చూసిన బాధితులు.. తమ ఆభరణాలను సులభంగా గుర్తిస్తున్నారు. వాటిని చెక్కు చెదరకుండా సదరు దొంగ భద్రపరిచాడు. నిందితుడి వద్ద నుంచి రూ.1.30కోట్ల విలువైన 2కిలోల బంగారం, పది కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ.18వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రైవేటు బస్సులో 10 కిలోల బంగారం, 5.06 కోట్ల నగదు.. సీజ్ చేసిన పోలీసులు

Last Updated :Apr 2, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.