ETV Bharat / city

రుషికొండపై 9.88 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు

author img

By

Published : Apr 16, 2022, 4:04 AM IST

rushikonda
rushikonda

రుషికొండపై 9.88 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు, భవిష్యత్తు విస్తరణకు 51.12 ఎకరాలకు కేంద్రం సీఆర్‌జెడ్‌ అనుమతులిచ్చింది. ఆ ప్రాంతంలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులో కట్టడాల ఎత్తు 9 మీటర్లకు మించకూడదని నిబంధన విధించింది. భవనాలు జీ ప్లస్‌ వన్‌గా మాత్రమే ఉండాలని కేంద్ర అటవీశాఖ స్పష్టం చేసింది.

విశాఖపట్నంలోని రుషికొండపై ఉన్న మొత్తం 61 ఎకరాల్లో ప్రస్తుతం 9.88 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు చేపడతామని.. మిగతా 51.12 ఎకరాల్ని భవిష్యత్తు విస్తరణ అవసరాల కోసం కేటాయించామని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సీఆర్‌జెడ్‌ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర అటవీ శాఖ పలు నిబంధనలతో అనుమతిచ్చింది. 2021 మే 19న అనుమతులిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్య ప్రాంత సరిహద్దుకు.. ఈ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు స్థలం సరిహద్దు 1.93 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, సీఆర్‌జెడ్‌-2 పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులో కట్టడాల ఎత్తు 9 మీటర్లకు మించకూడదని నిబంధన విధించింది. కేంద్ర అటవీశాఖ విధించిన కీలక నిబంధనలివీ..

* భవనాలు జీ ప్లస్‌ వన్‌గా మాత్రమే ఉండాలి.
* హై టైడ్‌ లెవల్‌ (హెచ్‌టీఎల్‌)కు కనీసం 200 మీటర్ల దూరంలో ‘నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌’కు వెలుపలే నిర్మాణాలు చేపట్టాలి.
* నిర్మాణ స్థలంలో 139 చెట్లు కూల్చాల్సి ఉంటుందని ఏపీ అటవీశాఖ గుర్తించింది. ఏపీ వాల్టా చట్టం ప్రకారం ఖాళీ స్థలంలో అంతకు రెండింతలు (278) మొక్కలు నాటాలి.
* ప్రాజెక్టులో నిర్మాణాల కోసం భూగర్భజలాన్ని తోడరాదు. నిర్మాణ పనులతో వచ్చే వ్యర్థాలు, బురద, చెత్త వంటివి అనుమతించిన ప్రదేశాల్లో మాత్రమే పారబోయాలి. వాటి వల్ల స్థానికులపైన ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకూడదు.
* వ్యర్థజలాల్ని శుద్ధి చేయకుండా సముద్రంలోకి, ఇతర నీటివనరుల్లోకి పంపించరాదు. శుద్ధి చేసిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగించాలి.
* ఏపీటీడీసీ అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తులో పేర్కొన్న డేటాలో వాస్తవ సమాచారం దాచిపెట్టినట్లు లేదా తప్పుడు సమాచారం సమర్పించినట్లు తేలినా, నిర్దేశిత నిబంధనలు పాటించకపోయినా అనుమతి ఉపసంహరించుకుంటాం. ప్రాజెక్టులో ఏ మాత్రం మార్పులున్నా.. కొత్తగా అనుమతి తీసుకోవాలి.

ఆర్నెల్లకోసారి నివేదిక ఇవ్వాలి
నిర్మాణ సమయంలో తవ్వకాల ద్వారా వచ్చిన వాటిని.. నీటివనరుల్లో లేదా పక్కన ఉండే ప్రదేశాల్లో పడేయరాదు. నిర్మాణం పూర్తయిన తర్వాత.. ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని అంతకు ముందున్నట్లుగానే రీస్టోర్‌ చేయాలి.
* ఈ నిబంధనల అమలు ఎలా ఉందో ఆరు నెలలకోసారి కేంద్ర అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలి.
* నిర్దేశిత నిబంధనలు అమలు తీరు తదితర వివరాల్ని ఏపీటీడీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర అటవీశాఖకు పంపించాలి.
* సీఆర్‌జెడ్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో శాశ్వత లేబర్‌ క్యాంపు, యంత్రాలు, నిర్మాణ సామగ్రి వంటివి అనుమతించకూడదు.

ఇదీ ప్రాజెక్టు స్వరూపం
కొత్తగా 9.88 ఎకరాల విస్తీర్ణంలో విజయనగర, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, ఈస్ట్రన్‌ గంగా అనే పేర్లతో ఏడు బ్లాకుల నిర్మాణం. ఈ పర్యాటక ప్రాజెక్టులో భాగంగా 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రిసార్ట్స్‌ నిర్మించనున్నారు. మొత్తం రూ.240 కోట్లతో 2022 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. స్థలాన్ని సిద్ధం చేసేందుకు, రోడ్ల నిర్మాణానికి రూ.92 కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.148 కోట్ల వ్యయం.
* ప్రైవేటు లగ్జరీ విల్లాలు, బీచ్‌ ఫేసింగ్‌ సూట్‌లు, మాస్టర్‌ సూట్‌లు, గెస్ట్‌ సూట్‌లు, డైనింగ్‌ స్పేస్‌, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌, బాంకెట్‌ హాల్‌ తదితరాలు నిర్మిస్తారు.
* ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 500 మందికి, నిర్మాణం పూర్తయ్యాక 100 మందికి ఉపాధి లభిస్తుంది.

ఇదీ చదవండి: Lokesh: 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.