ETV Bharat / city

Turmeric: మాటల్లోనే ‘మద్దతు’.. తక్కువకే అమ్ముకుంటున్న రైతులు

author img

By

Published : Jun 5, 2022, 8:11 AM IST

Turmeric: నెలన్నరగా పసుపు ధర పతనమవుతోంది. అయినా మార్క్‌ఫెడ్‌ ఎక్కడా కొనుగోలు ప్రారంభించలేదు. వ్యాపారులేమో ధరలకు ఇష్టారాజ్యంగా కోత పెడుతున్నారు. రోజువారీ ధరల్ని సీఎం యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తూ.. మద్దతు ధర కంటే తగ్గితే వెంటనే కొనుగోలు చేయిస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో అమలవడం లేదని పసుపు రైతులు ఆవేదన చెందుతున్నారు.

turmeric farmers problems
పసుపు రైతుల ఇబ్బందులు

రైతుల శ్రేయస్సు కోసం ‘సీఎం యాప్‌ (కంటిన్యువస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌ - వ్యవసాయ ఉత్పత్తుల నిరంతర ధరల పర్యవేక్షణ) అందుబాటులోకి తెచ్చాం. ఎవరికైనా రైతు భరోసా కేంద్రాల్లో ప్రకటించినట్లు గిట్టుబాటు ధరలు దక్కకుంటే... అక్కడి వ్యవసాయ సహాయకుడు వెంటనే సీఎం యాప్‌లో నమోదు చేస్తారు. మార్కెటింగ్‌ శాఖ, సంయుక్త కలెక్టర్‌ జోక్యం చేసుకుని ఆయనకు తోడుగా నిల్చుంటారు. ప్రభుత్వమే కనీస గిట్టుబాటు ధరకు రైతు నుంచి పంట ఉత్పత్తిని కొనే గొప్ప వ్యవస్థను తెచ్చాం.’ అని సీఎం జగన్‌ వ్యవసాయ సమీక్షల్లో తరచూ చెప్పే మాట ఇది.

జరుగుతోంది ఇదీ.. నెలన్నరగా పసుపు ధర పతనమవుతోంది. అయినా మార్క్‌ఫెడ్‌ ఎక్కడా కొనుగోలు ప్రారంభించలేదు. వ్యాపారులేమో ధరలకు ఇష్టారాజ్యంగా కోత పెడుతున్నారు. రైతులకు డబ్బు అవసరం కావడంతో వచ్చినకాడికే అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ధర లేని సంగతి ఆర్‌బీకేల సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు తెలియదా? తెలిసినా మద్దతు ధర ఇచ్చి కొనడం లేదా? సంబంధిత సమాచారాన్ని సీఎం యాప్‌ చెప్పడం లేదా?

పసుపు ధర దారుణంగా పడిపోయింది. రెండు నెలల కిందట క్వింటాల్‌ రూ.7,400 ఉన్న మార్కెట్‌ ధర... ఇప్పుడు రూ.5,500కి చేరింది. రోజువారీ ధరల్ని సీఎం యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తూ.. మద్దతు ధర కంటే తగ్గితే వెంటనే కొనుగోలు చేయిస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో అమలవడం లేదు. కేంద్రం మద్దతు ధరలు ఇవ్వని పంటలకు తామే ప్రకటించి కొనుగోలు చేయిస్తున్నామంటూ చెబుతున్న రాష్ట్రం... పసుపు పంటకు రూ.6,850 చొప్పున మద్దతు ప్రకటించి మూడేళ్లవుతున్నా రూపాయి పెంచలేదు.

మార్కెట్‌ మాయాజాలంతో రైతులు నష్టపోతున్నా రంగంలోకి దిగడంలేదు. దీంతో చేసేది లేక వారు తక్కువకే అమ్మేస్తున్నారు. ఇప్పటికే 50% పైగా అమ్మకాలు పూర్తయినా మార్క్‌ఫెడ్‌ స్పందించడం లేదు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని, దానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పినా, దాని ప్రయోజనాలు కనపడట్లేదని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

భారీగా పెట్టుబడి.. వర్షాలతో పడిపోయిన దిగుబడి.. అధిక పెట్టుబడి అవసరమైన పంటల్లో పసుపు ఒకటి. గుంటూరు, కడప, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఈ సాగు అధికం. రాష్ట్రంలో 2021-22 ఖరీఫ్‌లో 50 వేల ఎకరాల్లో వేశారు. 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలతో పలుచోట్ల నేలలోనే కుళ్లిపోయింది. ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు ఆశిస్తే.. 20 క్వింటాళ్ల లోపే వస్తోంది. పెట్టుబడి ఎకరాకు రూ.1.70 లక్షల వరకు పెట్టగా... ప్రస్తుత ధరల (క్వింటాల్‌ రూ.5,600) ప్రకారం రైతులకు వచ్చేది రూ.1.12 లక్షలు మాత్రమే. అంటే ఎకరాకు రూ.58 వేలు నష్టపోతున్నారు.

నెల కిందటే చెప్పినా.. దుగ్గిరాల, కడప మార్కెట్లలో పసుపు అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. రెండు నెలలుగా కొమ్ము ధరలో రూ.1,250 తగ్గుదల నమోదైంది. కాయ ధరా బాగా తగ్గింది. ‘పసుపు దున్నేటప్పుడే ధర తగ్గడం మొదలైంది. మద్దతు ధర కంటే తక్కువగా ఉందని అప్పుడే రైతు భరోసా కేంద్రంలో చెప్పాం. ఇప్పుడు క్వింటాల్‌ రూ.5,600 చొప్పునే అడుగుతున్నారు. అయినా ఆర్‌బీకేలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. తక్కువకు అమ్మితే నష్టం వస్తుంది. మద్దతు ధరకే అమ్ముకుంటే కొంతలో కొంతైనా దాన్ని తగ్గించుకోవచ్చు’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మునగపాడు రైతులు ఆశపడుతున్నారు.

క్వింటాల్‌కు రూ.10వేలు ఉంటేనే.. భారీవర్షాలు, వరదలతో ఏటికేడు దిగుబడులు తగ్గిపోతున్నాయి. డీఏపీ సహా.. అన్ని రకాల ఎరువులు ఈ మూడేళ్లలో 50% పైనే పెరిగాయి. డీజిల్‌, పెట్రోలు రేట్లు సరేసరి. పురుగు, తెగుళ్ల మందుల పిచికారీ వ్యయమూ పెరిగింది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని క్వింటాల్‌కు రూ.10వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వం తక్షణమే మద్దతు ధర పెంచి.. కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

మొదలైన ఖరీఫ్‌... అప్పులోళ్ల ఒత్తిడి.. ఇప్పటికే ఖరీఫ్‌ వచ్చేసింది. అప్పులు తీర్చాలన్నా, కొత్త పంటకు పెట్టుబడి సమకూర్చుకోవాలన్నా నగదు అవసరం. దీంతో వ్యాపారులు అడిగిన ధరకే కొందరు రైతులు పంటను అమ్మేస్తున్నారు. మరికొందరు ఇళ్లకు, శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు. శీతల గిడ్డంగిలో ఏడాదికి క్వింటాల్‌కు రూ.120 చొప్పున తీసుకుంటారు. పసుపు మార్కెట్లోకి రావడం మొదలు పెట్టినప్పుడే మద్దతు ధరకు కొనడం ప్రారంభిస్తే ప్రయోజనం కలిగేదని కడప జిల్లా రైతులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.