ETV Bharat / city

భారత్ బంద్ పిలుపు​.. రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం

author img

By

Published : Jun 20, 2022, 6:47 PM IST

Bharat bandh
Bharat bandh

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు. ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కేంద్రం తీసుకువచ్చిన "అగ్నిపథ్" పథకానికి నిరసనగా.. ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజా సంఘాలు సోమవారం భారత్ బంద్​కు పిలుపునిచ్చాయి. దీంతో.. రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బ్యాంకులు, పోస్టాఫీసులు.. వంటి కార్యాలయాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

విజయవాడలో: అగ్నిపథ్​కు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం వారిని లోపలికి అనుమతించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

పల్నాడు జిల్లాలో: అగ్నిపథ్​ నిరసనల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా.. పల్నాడు జిల్లాలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. నరసరావుపేట రైల్వే స్టేషన్​ను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు. పహారా కాస్తున్న సిబ్బందికి సూచనలు చేశారు.

ఏలూరు జిల్లాలో: జిల్లావ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఏలూరు నగరం పరిధిలో బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, అదనపు ఎస్పీ అడ్మిన్ కే చక్రవర్తి పలు ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి.. పోలీసులకు సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా బంద్ పేరుతో హింసాత్మక కార్యకాలపాలకు పాల్పడితే.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కర్నూలులో ధర్నా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని.. కర్నూలులో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ పథకం నిరుద్యోగుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్మీకి ఎంపికైన 31 మందిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి.. వారి భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.