ETV Bharat / city

KRMB-GRMB: పూర్తిస్థాయి సమావేశానికి నదీ యాజమాన్య బోర్డులు సిద్ధం

author img

By

Published : Apr 10, 2022, 9:15 AM IST

krishna river management board
పూర్తిస్థాయి సమావేశానికి నదీ యాజమాన్య బోర్డులు సిద్ధం

KRMB-GRMB: గెజిట్ నోటిఫికేషన్ సవరణ నేపథ్యంలో నదీ యాజమాన్య బోర్డులు పూర్తి స్థాయి సమావేశానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెల మూడు లేదా చివరి వారాల్లో భేటీ నిర్వహించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ భావిస్తున్నాయి. బోర్డు సమావేశాల కోసం ఎజెండాను సిద్ధం చేసే పనిలో అధికారులు పడ్డారు. ప్రాజెక్టుల అనుమతులు, డీపీఆర్​లు, విద్యుదుత్పత్తి సహా బోర్డుల నిర్వహణ ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

KRMB-GRMB: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు త్వరలోనే పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల సవరణలు చేసింది. ప్రాజెక్టుల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలు రెండు బోర్డులకు 200 కోట్ల రూపాయల చొప్పున 60 రోజుల్లో డిపాజిట్ చేయాలని అప్పట్లో గెజిట్​లో పేర్కొన్నారు. ఆ గడువు 2021 సెప్టెంబర్ 15తో ముగిసినప్పటికీ రెండు రాష్ట్రాలు నిధులు ఇవ్వలేదు. ఇటీవల ఆ గడువును ఏడాది కాలానికి అంటే 2022 జూలై 15వ తేదీకి పొడిగించారు. అటు అనుమతుల్లేని ప్రాజెక్టులకు అప్పట్లో ఇచ్చిన ఆర్నెళ్ల గడువును కూడా ఏడాదికి పొడిగించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అనుమతుల్లేని ప్రాజెక్టుల్లో కొన్నింటి డీపీఆర్​లను రెండు రాష్ట్రాలు ఆయా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తిశాఖకు సమర్పించాయి. వాటి పరిశీలనా ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కేంద్ర తాజా సవరణతో సదరు ప్రాజెక్టులకు అనుమతులు తీసుకునే గడువు జూలై 15వ తేదీ వరకు ఉంది.

గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా గతంలోనే విస్తృత కసరత్తు చేశారు. ఉపసంఘాలను ఏర్పాటు చేశారు. కానీ, ఏ ప్రాజెక్టునూ రెండు రాష్ట్రాలు బోర్డులకు స్వాధీనం చేయలేదు. తాజా సవరణల నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించేందుకు మరోమారు పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు భావిస్తున్నాయి. బోర్డు సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీలో చర్చించాల్సి ఉంది. ప్రాజెక్టుల అనుమతులు, ఇప్పటికే సమర్పించిన డీపీఆర్​ల పరిశీలన తదితరాలు ఉన్నాయి. తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.

అనుమతుల్లేకుండా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులను ఆపివేయాలని తెలంగాణ కూడా కేఆర్​ఎంబీకి ఫిర్యాదులు చేసింది. రెండు రాష్ట్రాలు పరస్పరం పలు ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో బోర్డు సమావేశాల్లో ఫిర్యాదులు కూడా చర్చకు రానున్నాయి. టెలిమెట్రీల ఏర్పాటు, ఆర్డీఎస్ పనుల ఆధునీకరణ సహా ఇతర అంశాలు కూడా కేఆర్​ఎంబీకి సమావేశం జరిగితే ప్రస్తావనకు వస్తుంది. ఈ నెల మూడో వారం లేదా నెలాఖర్లో పూర్తి స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని రెండు బోర్డులు భావిస్తున్నాయి. ఈ దిశగా రెండు రాష్ట్రాల నుంచి ఆసక్తి తెలుసుకున్నట్లు సమాచారం. బోర్డు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల ఎజెండా కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.