ETV Bharat / city

KRMB Report: పాలమూరు - రంగారెడ్డి పనులపై ఎన్జీటీకి కేఆర్​ఎంబీ నివేదిక.. ఏపీ సర్కార్‌ అభ్యంతరం..!

author img

By

Published : Apr 9, 2022, 7:32 AM IST

KRMB Report: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల విషయంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు నివేదికను ఏపీ సర్కార్‌ తప్పుపట్టింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల అనంతరం తెలంగాణ ప్రభుత్వం సేఫ్టీ పనులను మాత్రమే కొనసాగించిందని... కేఆర్​ఎంబీ నివేదిక ఇచ్చింది. చేసిన పనులు సేఫ్టీ కోసం కాదన్న ఏపీ.. ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను శిక్షించాలని ఎన్జీటీని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

KRMB report to NGT on Palamuru-Rangareddy project works
పాలమూరు-రంగారెడ్డి పనులపై ఎన్జీటీకి కేఆర్​ఎంబీ నివేదిక.. ఏపీ సర్కార్‌ అభ్యంతరం

KRMB Report: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పరిశీలనకు సంబంధించి ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన కేఆర్​ఎంబీ బృందం నివేదిక సమర్పించింది. పనులు ఆపాలంటూ ఎన్జీటీ 2021 అక్టోబర్ 29న ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత జరిగిన పనులపై నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టులోని 18 ప్యాకేజీల వారీగా అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన పనుల వివరాలను పొందుపర్చింది. గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి ఇంజినీర్లు అందించిన వివరాలు, పరిశీలన ఆధారంగా కమిటీ సభ్యులు నివేదిక సిద్ధం చేశారు. ప్రతి ప్యాకేజీలోని పనులకు సంబంధించి తమ పరిశీలనలను పొందుపరిచారు.

తాము పర్యటించిన సమయంలో ఎలాంటి పనులు జరగలేదని.. అప్రోచ్ కాల్వలు, సొరంగాలు, పంప్‌హౌస్‌లు, జలాశయాల నిర్మాణ పనులను.. వివిధ దశల్లో నిలిపివేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఐదు, 12 ప్యాకేజీలు మినహా మిగతా అన్ని ప్యాకేజీల్లోనూ.. సేఫ్టీ పనులను మాత్రమే చేపట్టారని తెలిపారు. 5, 12 ప్యాకేజీల్లో చేపట్టిన ఆర్​సీసీ, కాంక్రీటు పనులు మాత్రం సేఫ్టీ పనులో, కాదో.. తాము అంచనాకు రాలేకపోయామని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు 26 పేజీల నివేదికను జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు అందించింది.

కేఆర్​ఎంబీ నివేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక నేపథ్యంలో ఎన్జీటీలో ఏపీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పక్షపాతం లేకుండా పనుల తనిఖీ, నివేదిక ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేసి ఉండాల్సిందని.. సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి గతంలోనే సాదాసీదా నివేదిక ఇచ్చారని అభ్యంతరం తెలిపింది. మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లకుండా అక్టోబర్ 29 తర్వాత రికార్డులు, చెల్లింపులను పరిశీలించకుండా కేవలం తెలంగాణకు చెందిన క్షేత్రస్థాయి ఇంజినీర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే నివేదిక రూపొందించారని తెలిపింది.

సేఫ్టీ పనులంటే అక్కడ పనిచేసే కార్మికులు, సమీప ప్రజల రక్షణ కోసం మాత్రమే పరిగణించాలి తప్ప.. ట్రైబ్యునల్, విభజనచట్టం అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు పనుల భద్రత కాదని వ్యాఖ్యానించింది. ప్రజలకు ఇబ్బందులు లేనప్పుడు సేఫ్టీ పేరిట ఇతర పనులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. కిలోమీటర్ల మేర రివిట్‌మెంట్, ఆర్​సీసీ, కాంక్రీటు పనులు సేఫ్టీకి సంబంధించినవి కావని వివరించింది. వీటన్నింటి నేపథ్యంలో తమ మధ్యంతర పిటిషన్‌ను స్వీకరించాలని... ఎన్జీటీని కోరిన ఏపీ సర్కార్‌.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘనకు బాధ్యులైన అధికారులను శిక్షించాలని కోరింది.

ఇదీ చదవండి: ఏపీ వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.