ETV Bharat / city

Embryo Transfer Technology: పశువులకూ సరోగసి.. ఎక్కడో తెలుసా?

author img

By

Published : Oct 29, 2021, 2:22 PM IST

ఇంత వరకూ మానవుల్లోనే సరోగసి పద్ధతిలో గర్భాన్ని దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం చూస్తున్నాం.. కానీ పశువుల్లో కూడా అద్దెగర్భం ద్వారా జాతి ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు లాం పరిశోధన కేంద్రంలో ఈ ప్రయోగం అమలు చేస్తుండగా .. ప్రకాశం జిల్లా చదలవాడ పశు క్షేత్రంలో ఉన్న ఒంగోలు ఆవులకు పిండాన్ని పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. సహజసిద్ధంగా పశువుల కలయిక కష్టంగా ఉండే ఆవులను గుర్తించి, వాటిలో అభివృద్ధి చేసిన పిండాన్ని పంపించి, దూడలకు జన్మనిచ్చే విధంగా (Embryo Transfer Technology) ఏర్పాట్లు చేస్తున్నారు.

Embryo Transfer Technology
పశువులకు సరోగసి

పశువులకు సరోగసి

సహజ కలయిక వల్లగానీ, కృత్తిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా గానీ ఆవులు చూడికట్టే విధానం ఉంటుంది. తద్వారా ఒక్కో ఆవు తన జీవిత కాలంలో 9 నుంచి 15 దూడల వరకూ జన్మనిస్తుంది. పశువుల సంఖ్య పెంచాలనే ఉద్దేశ్యంతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. గుంటూరులో ఉన్న లాం పరిశోధనా కేంద్రంలో పశువుల్లో అద్దెగర్భం విధానాన్ని అమలు చేస్తూ తగిన ఫలితాలు సాధిస్తున్నారు.

అంతరించిపోతున్న ఒంగోలు, పుంగనూరు వంటి జాతుల పశువుల సంతతిని పెంచేందుకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. నాణ్యమైన పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి, పిండాన్ని అభివృద్ధి చేస్తారు. దీన్ని పశువుల గర్భంలోకి ఎక్కించి దూడలకు జన్మనిస్తారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువుల గణాలను పెంచేందుకు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఒక్కో ఆవు నుంచి దాదాపు 50 దూడల వరకూ ఉత్పత్తి చేయవచ్చు. అయితే అత్యధికంగా 15 దూడలకు జన్మనిచ్చిన తరువాత సహజ సిద్ధమైన కలయిక వల్లగానీ, కృత్రిమ గర్భోత్పత్తి వల్ల గానీ ఆవులు గర్భం దాల్చడం కష్టమవుతుంది.

సహజంగా గాయాల పాలయినా, వయసు మళ్ళినా ఆవులకు చూడి నిలవదు. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ ద్వారా ఇలాంటి ఆవుల ద్వారా కూడా దూడలకు జన్మనివ్వవచ్చు. ఒంగోలు రకానికి చెందిన మేలి జాతి పశువుల వీర్యాన్ని సేకరించి, ప్రయోగశాలలో అండంను ఫలదీకరించి, పిండంగా మారిన తరువాత దాన్ని చూడి వచ్చిన వారం రోజులు తర్వాత ఈ ఆవుల గర్భంలోకి కృత్రిమ పద్ధతి ద్వారా ప్రవేశపెడతారు. ఇలా ప్రవేశింపజేసిన తొమ్మిది నెలల తరువాత ఆవు దూడకు జన్మనిస్తుంది.. ఇలా దాదాపు ఒక ఆవు నుంచి తన జీవిత కాలంలో 50 వరకూ దూడలకు జన్మనివ్వవచ్చు.

అయితే ఏ జాతి పశువులకు చెందిన అండం ప్రవేశ పెడితే అదే జాతి దూడ పుడుతుంది. తల్లి లక్షణాలు మాత్రం రావు. గుంటూరు లాం పరిశోధనా కేంద్రంలో ఫలదీకరించిన 20 పిండాలను చదలవాడ ఒంగోలు పశు ఉత్పత్తి క్షేత్రానికి తీసుకువచ్చి, ఒంగోలు ఆవుల గర్భంలో ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 10 ఒంగోలు , 10 గిర్‌ జాతులకు సంబంధించినవి ఉన్నాయి.

" అంతరించిపోతున్న ఒంగోలు, పుంగనూరు వంటి జాతుల పశువుల సంతతిని పెంచేందుకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. నాణ్యమైన పశువుల నుంచి సేకరించిన వీర్యాన్ని ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ ద్వారా ల్యాబ్ లో పిండాన్ని అభివృద్ధి చేస్తాం. ఆవుల గర్భంలోకి కృత్రిమ పద్ధతి ద్వారా ప్రవేశపెడతాం. ఏ జాతి పశువులకు చెందిన అండం ప్రవేశ పెడితే అదే జాతి దూడ పుడుతుంది. " - డా. విజయకుమార్‌ రెడ్డి, పశువైద్యాధికారి, చదలవాడ

ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ విధానాన్ని ఒంగోలు జాతి పశువులను అభివృధ్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో ప్రయత్నంగా అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి : పత్తి పంటకు పరిశ్రమ తోడైతేనే భవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.