ETV Bharat / city

MGNREGS FOUNDS: ఉపాధి హామీ పనుల్లో.. విచ్చలవిడిగా నిధుల స్వాహా !

author img

By

Published : Oct 19, 2021, 4:23 AM IST

fraud in MGNREGS scheme
fraud in MGNREGS scheme

ఉపాధి హామీ పనుల్లో విచ్చలవిడిగా నిధుల స్వాహా జరుగుతోంది. కూలీలతో సమన్వయం చేసుకుని, పెద్దఎత్తున నిధులు మింగేస్తున్నారు. రెండు, మూడేళ్లుగా వివిధ జిల్లాల్లో జరిగిన ఉపాధి పనులపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు విచారిస్తుండగా... విస్తుపోయే విషయాలు(fraud in mgnregs funds) వెలుగుచూస్తున్నాయి.

నరేగాలో నిధుల స్వాహాకు సిబ్బంది కొత్త మార్గాలు(fraud in mgnregs funds) సృష్టించారు. పనులకు రాని వాళ్లను, జాబ్‌ కార్డులు కలిగి ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని, మృతులను ఆధారంగా చేసుకొని అక్రమాలకు తెర లేపారు. కూలీలతో సమన్వయం చేసుకుని, యథేచ్ఛగా నిధులను స్వాహా చేస్తున్నారు. వీరి మధ్య ఎప్పుడైనా స్పర్థలు తలెత్తినప్పుడు మాత్రమే అక్రమాలు బహిర్గతం అవుతున్నాయి. గత రెండు, మూడేళ్లుగా వివిధ జిల్లాల్లో జరిగిన ఉపాధి పనులపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు విచారిస్తుండగా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.

ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నా.. ఆగని అవినీతి
కూలీలకు వేతనాల చెల్లింపుల్లో అవకతవకలను నిరోధించేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నా అక్రమాలు ఆగడం లేదు. పథకం ప్రారంభమయ్యాక చాలా ఏళ్లపాటు తపాలా కార్యాలయాల్లో కూలీల వేలిముద్రలు తీసుకుని చెల్లించారు. ఇందులో అవకతవకలను జరగడంతో 2017లో జాతీయ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం తీసుకొచ్చారు. అప్పటి నుంచి వేతనాలు కూలీల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమవుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది కొత్త అక్ర‘మార్గాలు’ ఎన్నుకున్నారు. పనులకు రానివారితో ‘నాకింత... నీకింత’ తరహాలో ఒప్పందం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మస్టర్ల ప్రకారం కూలీల బ్యాంకు ఖాతాలకు జమవుతున్న వేతనాలను పంచుకుంటున్నారు. మృతులకు సంబంధించిన ఏటీఎం కార్డులతో డబ్బులను డ్రా చేస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలతోపాటు చాలా జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా అధికారులు భారీ లక్ష్యాలను నిర్దేశించడంతోనూ
క్షేత్రస్థాయి సిబ్బంది కొన్నిచోట్ల అవకతవకలకు పాల్పడుతున్నారు. మస్టర్లను తమకు ఇష్టం వచ్చినట్లు నింపేస్తున్నారు. ఒక జిల్లాలో పీడీ పైనా ఆరోపణలు రావడంతో విచారించి ఇటీవల బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

దేశంలోనే ‘గరిష్ఠం’తో మొదలైన అనుమానం
ఈ ఏడాది దేశంలోని ఏ రాష్ట్రమూ వినియోగించుకోలేనన్ని పని దినాలను ఏపీలో ఉపయోగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 21.27 కోట్లకుపైగా పని దినాలు నమోదయ్యాయి. దీంతో కేంద్ర అధికారులు వాస్తవాలను తెలుసుకోడానికి ఇటీవల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు. వీరు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు తమ నివేదికలో ఏమిచ్చారనేది ఇంకా వెల్లడికాలేదు.

ఇవీ ఉదాహరణలు

  • విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండకు చెందిన పలువురు స్థానిక జీడి పిక్కల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌, జులైలో వీరిలో కొందరు 15 నుôచి 23 రోజులపాటు జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) పనులు చేసినట్లు మస్టర్లు చెబుతున్నాయి. ఫ్యాక్టరీకి వెళ్లిన రోజుల్లోనూ వీరు ఉపాధి పనులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేశారని అధికారులు గుర్తించారు.
  • ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రేగుమానుపల్లి పంచాయతీ పరిధిలో రెండేళ్ల క్రితం మరణించిన ఒక మహిళ ఉపాధి పనికి హాజరైనట్లుగా మస్టర్‌ వేసి, రూ.2,949 చెల్లించారు. సుంకేసుల పంచాయతీలోనూ మరో మృతురాలు పని చేసినట్లు చూపించారు. తంగిరాలపల్లిలో సైతం చనిపోయిన మహిళ పేరిట చెల్లింపులు జరిగాయి.
  • శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మేఘవరానికి చెందిన రాజు, స్వామి, నరసింహులు విదేశాలకు వలస వెళ్లారు. వీరు కూడా ఉపాధి పనులకు హాజరైనట్లు సిబ్బంది మస్టర్లు వేశారు. ఒక్కొక్కరికి రూ.2,900 చొప్పున చెల్లించేశారు. ఇదే మండలంలోని జగన్నాథపురానికి చెందిన జగన్నాథ్‌, రామారావు, ఈశ్వరరావు రెండేళ్ల క్రితం మృతి చెందినా... ఉపాధి పనులకు హాజరైనట్లుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

CM Jagan review on power: థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.