ETV Bharat / business

క్రెడిట్​ కార్డ్​తో నష్టం కాదు లాభమే! ఈ సింపుల్​ ట్రిక్స్​ పాటిస్తే చాలు!!

author img

By

Published : Jul 14, 2022, 4:57 PM IST

Credit Cards Tricks: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్​ కార్డుల వినియోగం బాగా పెరిగింది. కానీ చాలా మంది యూజర్లు.. క్రెడిట్ కార్డు​ వాడితే తమ తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతాయనుకుంటారు. కానీ అది నిజం కాదు!.. క్రెడిట్​ కార్డును సరిగా వాడితే సంపదను సృష్టించుకునే అవకాశం ఉంది. కొన్ని ట్రిక్స్​ ఉపయోగిస్తే సుమారు ప్రతినెలా మీ ఖర్చుల్లో 5 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. మరి ఆ ట్రిక్స్​ తెలియాలంటే ఈ కథనం చదివేయండి..

Slug credit cards
Slug credit cards

Credit Cards Tricks: చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగించడం వల్ల తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతుంటాయననుకొంటారు. నిజానికి పొదుపును పెంచుకోవడానికి ఇవి సరైన మార్గాన్ని చూపిస్తాయి. ఆ పొదుపును సరిగా మదుపు చేస్తే పెద్ద మొత్తంలో సంపదను సృష్టించుకునే అవకాశం ఉంది.

క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ప్రతినెలా మీ ఖర్చుల్లో 5 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏటా షాపింగ్‌, యుటిలిటీ బిల్స్‌, భోజనం, విహారయాత్రలు, నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, ప్రయాణాలు, ఇంధనం.. ఇలా అన్నింటిపై రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారనుకుందాం. ఒకవేళ క్రెడిట్‌ కార్డును సరిగా వాడుకోగలిగితే ఇందులో రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అంటే, నెలకు రూ.2,500 పొదుపులోకి మళ్లించొచ్చు. ఇదే పొదుపును సిప్‌లో వేస్తే వచ్చే ప్రతిఫలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలా ప్రారంభించండి..
క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇంత మొత్తం ఆదా చేయడం అంటే తొలుత మీకు కొంత నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, మీ ఖర్చులు, వాటిపై లభించిన రాయితీలు లేదా ప్రయోజనాలను గనక రాసిపెట్టుకోగలిగితే క్రెడిట్‌ కార్డు ప్రయోజనం ఎలాంటిదో అర్థమవుతుంది. నెలాఖరున మీ ఖర్చులు, లభించిన రాయితీలను రాసిపెట్టుకోండి. అలా కొన్ని నెలల పాటు దీన్ని కొనసాగిస్తే మీరు చేస్తున్న ఆదాపై మీకు ఓ స్పష్టత వస్తుంది. కార్డు స్టేట్‌మెంట్లను తరచూ పరిశీలించడం కూడా మీకు ఉపయోగపడుతుంది. ప్రతి లావాదేవీని పరిశీలించి అందులో మీకు లభించిన ప్రయోజనాన్ని గుర్తించి దాన్ని ఆదా చేసిన ఖాతాలో రాసుకోండి.

ఆదా చేసుకునే మార్గాలు..

  • రాయితీలు: క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5% నుంచి 20% రాయితీ లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ తమ క్రెడిట్‌ కార్డుతో అమెజాన్‌ సూపర్‌ వాల్యూ డేస్‌ సమయంలో నిత్యావసర సరకుల్ని కొనుగోలు చేస్తే 10 శాతం వరకు రాయితీనిస్తోంది.
  • రివార్డు పాయింట్లు: ఉదాహరణకు ప్రతి రూ.100 ఖర్చుపై కొన్ని కార్డులో 1 రివార్డు పాయింట్‌ లభిస్తుంది. ఇలా భారీ ఎత్తున పాయింట్లు పోగైన తర్వాత వాటిని రాయితీగానో, లేక నగదు రూపంలోకి మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
  • క్యాష్‌బ్యాక్స్‌: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు వస్తుంటాయి. అమెజాన్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుతో కలిసి క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది.

ఏఏ ఖర్చులపై ఎలా ఆదా..?
నిత్యావసర సరకులు, మెడిసిన్స్‌, దుస్తులు, భోజనం, సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రయాణాలు, టికెట్‌ బుకింగ్‌లపై మనం ఎక్కువగా ఖర్చు చేస్తుంటాం. మరి ఈ ఖర్చులకు క్రెడిట్‌ ఉపయోగిస్తే ఎలా ఆదా చేయొచ్చో పరిశీలిద్దాం..

  • మెడిసిన్స్‌: డాక్టర్లు సిఫార్సు చేసిన మందులపై టాటా 1ఎంజీ, నెట్‌మెడ్స్‌ వంటి ఆన్‌లైన్ ఫార్మసీలు, అపోలో, మెడ్‌ప్లస్ వంటి ఆఫ్‌లైన్‌ ఫార్మసీలు 25 శాతం వరకు ప్రత్యక్ష రాయితీనిస్తున్నాయి. టాటా 1ఎంజీ ప్రతి నెలా తొలి వారంలో పేడే సేల్‌ పేరిట ఔషధాల ధరలపై 20 శాతం వరకు ఆదా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
  • నిత్యావసరాలు: ప్రతినెలా తొలివారంలో చేసే నిత్యావసరాల కొనుగోళ్లపై అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ స్టోర్లు, స్టార్ బజార్‌, రిలయన్స్ స్మార్ట్‌ వంటి ఆఫ్‌లైన్ స్టోర్లు ఎంఆర్‌పీ ధరలపై రాయితీనిస్తుంటాయి. ఇదే సమయంలో బ్యాంకులు సైతం క్రెడిట్‌ కార్డుపై 20 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఉదాహరణకు బిగ్‌బాస్కెట్‌ ప్రతి నెలా తొలి వారంలో చేసే నిత్యావసరాల కొనుగోళ్లపై 10 శాతం రాయితీనిస్తోంది. సూపర్‌ వాల్యూ డేస్‌ సమయంలో అమెజాన్ నిత్యావసరాలపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా మరికొన్ని ఇతర క్రెడిట్‌ కార్డులపై అదనంగా మరో 10 శాతం ఆదా చేసుకోవచ్చు. కొన్నిసార్లు అమెజాన్.. అమెజాన్‌ పే బ్యాలెన్స్ రూపంలో క్యాష్‌బ్యాక్‌ కూడా ఆఫర్‌ చేస్తుంటుంది.
  • హోంఫుడ్‌ డెలివరీ: ఇంటికే ఆహారం తెచ్చి ఇచ్చే జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌లను ఉపయోగించుకుంటే ప్రత్యేకంగా రాయితీలు పొందొచ్చు. క్రెడిట్‌ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తుంటారు.
  • రెస్టారెంట్లు: వారాంతాల్లో చాలా మంది బయట భోజనం చేసేందుకు ఇష్టపడుతుంటారు. డైన్ఔట్‌, ఈజీడైనర్‌ వంటి వాటిలో సభ్యత్వం తీసుకొంటే భోజనాలపై చేసే ఖర్చు 50 శాతం వరకు తగ్గించుకునే వెసులుబాటు ఉంది. దీనికి క్రెడిట్‌ కార్డులు అందజేసే ఆఫర్లను వినియోగించుకుంటే మరింత ఆదా అవుతుంది.
  • కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు: కొన్ని సంస్థలు, బ్యాంకులు కలిసి ఈ కార్డులను అందజేస్తుంటాయి. ఉదాహరణకు అమెజాన్‌-ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఓ ప్రత్యేక క్రెడిట్‌ కార్డుని అందిస్తోంది. దీనివల్ల అమెజాన్‌లో చేసే షాపింగ్‌పై ప్రత్యేక రాయితీ లభిస్తుంది. అలాగే బీపీసీఎల్‌, ఎస్‌బీఐ కలిసి బీపీసీఎల్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుని అందిస్తున్నాయి. దీంతో ఇంధన కొనుగోళ్లపై ప్రత్యేక రాయితీ లభిస్తుంది.

ఇలా సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లు, హోటల్‌ బుకింగ్‌, ఫ్యాషన్‌ కొనుగోళ్లు, గృహోపకరణాల షాపింగ్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వంటి వాటిపై కూడా క్రెడిట్‌ కార్డు ఆఫర్లు, రాయితీలు పొందొచ్చు. వాటిపై ఉండే ప్రత్యేక ఆఫర్లకు క్రెడిట్‌ కార్డును కూడా జత చేసుకుంటే మరింత అదనపు ప్రయోజనం పొందొచ్చు.

ఈ ఆఫర్లన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకొని ప్రతినెలా రూ.2,500 వరకు ఆదా చేశారనుకుందాం. దాన్ని మీరు చేసే రూ.2,500 సిప్‌కు జత చేసి ప్రతినెలా రూ.5,000 గనక మదుపు చేయగలిగితే 30 ఏళ్లలో 12 శాతం రాబడి లెక్కన రూ.కోటికి పైగా సంపదను సృష్టించుకోవచ్చు. ఉదాహరణకు.. రాము, సోము అనే ఇద్దరు వ్యక్తులు ప్రతి నెలా సిప్‌ చేస్తున్నారనుకుందాం..

Slug credit cards
.

పెట్టుబడిలో రూ.2,500 వ్యత్యాసం వల్ల ఇరువురి సంపదలో ఎంత తేడా ఉందో స్పష్టంగా గమనించొచ్చు.

క్రెడిట్‌ కార్డు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దాన్ని సరిగా ఉపయోగించుకోగలిగితే అనేక ప్రయోజనాలను పొందొచ్చు. కానీ, అనవసర ఖర్చులకు వాడితే మాత్రం రుణ ఊబిలో చిక్కుకుంటారు. క్రెడిట్‌ కార్డుని ఉపయోగించేవాళ్లు రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి.. అవసరాన్ని బట్టే ఖర్చు చేయాలి. రెండు.. ప్రతినెలా సకాలంలో క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించాలి.

ఇవీ చదవండి: క్రెడిట్ కార్డులు ఎన్నైనా ఉండొచ్చా? ఎక్కువ ఉంటే ఇబ్బందా?

Credit card: క్రెడిట్‌ కార్డు.. ఐదు హెచ్చరికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.