ETV Bharat / business

మెటా ఉద్యోగులకు షాక్​.. మరో 10,000 మంది లేఆఫ్​!

author img

By

Published : Apr 19, 2023, 4:16 PM IST

Updated : Apr 19, 2023, 4:33 PM IST

Meta Layoffs 2023 : టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. గతేడాది నవంబరులో 11 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా.. తాజాగా మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 వేల మంది ఉద్యోగులను తీసేసిన డిస్నీ.. ఇప్పుడు మరో విడతలో వేలాది ఉద్యోగులను తొలగించనుంది.

meta layoffs 2023
meta layoffs 2023

Meta Layoffs 2023 : ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యయ నియంత్రణలో భాగంగా దాదాపు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని మెటా నిర్ణయించినట్లు సమాచారం.

మెటా పరిధిలో ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వర్చువల్‌ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్‌.. ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మేనేజర్లకు అంతర్గతంగా మెటా సమాచారం పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చిలోనే సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ దీనిపై సంకేతాలిచ్చారు. అన్ని విభాగాల్లో సిబ్బంది కూర్పును పునఃసమీక్షించి కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా లేఆఫ్‌లకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. మే నెలలో మరికొంత మందిని కూడా మెటా తీసివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతేడాది నవంబరులోనే కంపెనీ సిబ్బందిలో 13 శాతానికి సమానమైన 11,000 మందిని మెటా తొలగించింది. అలాగే కొత్త నియామకాలనూ నిలిపివేసింది. తాజాగా మేనేజర్లకు పంపిన సమాచారంలో కంపెనీలోని ఉద్యోగుల బృందాలన్నింటినీ పునఃనిర్మించనున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్‌ తెలిపారు. లేఆఫ్‌ల తర్వాత కొంతమంది కొత్త ప్రాజెక్టులపై పనిచేయాల్సి రావొచ్చని స్పష్టం చేశారు.

డిస్నీ సైతం..
అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వాల్ట్‌ డిస్నీ సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను వచ్చే వారం తొలగించనుంది. టీవీ, ఫిల్మ్‌, థీమ్‌ పార్క్‌, కార్పొరేట్‌ విభాగాల్లో ఈ కోతలు ఉండబోతున్నాయి. ఏప్రిల్‌ 24 నాటికి తొలగింపుల సమాచారం ఉద్యోగులకు అందుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 వేలమంది ఉద్యోగులను డిస్నీ సంస్థ తీసివేసింది. ఇప్పుడు మరో విడతలో వేలాది ఉద్యోగులను తొలగించనుంది.

యాక్సెంచర్ లేఆఫ్స్​..
ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 వేల మందిని విధుల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వార్షిక ఆదాయ వృద్ధిరేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించిన్నట్లు పేర్కొంది.

ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం సాంకేతిక పరమైన పెట్టుబడుల నియంత్రణలో భాగంగానే ఈ తొలగింపులను చేపట్టినట్లు యాక్సెంచర్​ ప్రకటించింది. తద్వారా ఈ భారీ తొలగింపులతో సంస్థ వార్షిక ఆదాయ వృద్ధి, లాభాల అంచనాలు కూడా తగ్గనున్నాయని తెలిపింది. యాక్సెంచర్ తీసుకున్న ఈ నిర్ణయంతో కంపెనీలోని నగదు రహిత కార్యాకలాపాల ఉద్యోగులపై ప్రభావం పడనుందని రాయిటర్స్​ నివేదించింది. కాగా, తాజాగా ప్రకటించిన 19 వేల ఉద్యోగుల తొలగింపు కారణంగా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని రాయిటర్స్​ పేర్కొంది. అయితే స్థానిక కరెన్సీ లెక్కల ప్రకారం కంపెనీ వార్షిక రాబడి వృద్ధి గతంలో 8 నుంచి 11 శాతంగా ఉండేదని.. తాజా ఉద్వాసనలతో అది 8 నుంచి 10 శాతంగా ఉండబోతోందని రాయిటర్స్​ అంచనా వేసింది. ఈ పూర్తి కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Apr 19, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.