ETV Bharat / business

గూగుల్ CEO పిచాయ్​కు 1,850 కోట్లు.. ఉద్యోగుల కంటే 800 రెట్లు ఎక్కువ!

author img

By

Published : Apr 22, 2023, 5:20 PM IST

Updated : Apr 22, 2023, 5:50 PM IST

గూగుల్​ సీఈఓ భారత సంతతి వ్యక్తి గూగుల్ పిచాయ్​ ఏకంగా 1,850 కోట్ల పారితోషికాన్ని పొందారు. గూగుల్‌లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ. దీంతో సుందర్ పిచాయ్​కు ఇంత మొత్తం ఎలా వచ్చిందో? ఇప్పుడు తెలుసుకుందాం.

sundar pichai salary
sundar pichai salary

వ్యయ నియంత్రణ అంటూ ఉద్యోగులకు భారీగా కోతపెడుతున్న గూగుల్‌.. CEO సుందర్‌ పిచాయ్‌కు మాత్రం 2022 సంవత్సరానికి 1,850 కోట్ల పారితోషికం ఇచ్చింది. గూగుల్‌లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ. పారితోషికంలో 218 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్స్‌ కూడా ఉన్నాయి. మూడేళ్ల కాలానికి ఆయన ఈ మొత్తం అందుకున్నారు. మూడేళ్ల నుంచి సీఈవో పిచాయ్‌ స్థిరంగా 2 మిలియన్‌ డాలర్ల వార్షిక వేతనం అందుకుంటున్నట్లు గూగుల్‌ తెలిపింది.

అయితే, ఆర్థికమాంద్యం భయాలతో గూగుల్‌లో పెద్దసంఖ్యలో లేఆఫ్‌లు చేపడుతున్న వేళ.. సీఈవో పిచాయ్‌కు మాత్రం భారీగా పారితోషికం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. అయితే సుందర్ పిచాయ్ కాంపన్సేషన్ కింద ఈ భారీ మొత్తాన్ని రానున్న ఆరు నెలల కాలంలో పొందబోతున్నారు. 2019లో కూడా సుందర్ పిచాయ్ ఇలాగే భారీ మొత్తాన్ని అందుకున్నారు. ఈ మేరకు గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ ఈ భారీ మొత్తాన్ని సుందర్ పిచాయ్​కు ఆరు నెలలు చెల్లించింది.

గూగుల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. కాస్ట్ కటింగ్ లో భాగంగానే 12వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయంతో చాలామంది గూగుల్ ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. లండన్ లోని గూగుల్ కార్యాలయం ముందు ఉద్యోగులు నిరసనకు కూడా దిగారు.

'ఏఐతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా'
గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ ఇటీవల ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాంటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే.. ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉంచాలని తెలిపారు. కృత్రిమ మేధ దుష్ప్రభావాలను తలచుకొని.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని పిచాయ్‌ అన్నారు. ఏఐతో అసత్య సమాచారాన్నీ రూపొందించే వీలుందని.. వాటివల్లే జరిగే అనర్థాలకు మన దగ్గర సమాధానాలు లేవని పిచాయ్ పేర్కొన్నారు.
కృత్రిమ మేధను ప్రయోజనకర మార్గంలో వినియోగించడంపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఏఐని సురక్షితంగా ఉంచడం అనేది ఏదో ఒక కంపెనీ నిర్ణయించకూడదని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలన్నీ కలిసి వీటిపై ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. సమాజంలో దీని కోసం చట్టాలు రావాలని అన్నారు. అణ్వాయుధాల కార్యాచరణ మాదిరిగానే ఇది కూడా ఉండాలని సూచించారు.
సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయని.. కొత్త సాంకేతికతను తీసుకువచ్చేందుకు కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయని పిచాయ్ తెలిపారు. ఏఐ వల్ల సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓ సమాజంగా మనం వీటికి అలవాటుపడాలని.. ఏఐ ద్వారా ప్రభావం ఎదుర్కొనే ఉద్యోగుల్లో అకౌంటెంట్లు, రైటర్లు, ఆర్కిటెక్ట్​లు అధికంగా ఉండొచ్చన్నారు. ప్రతి కంపెనీ, ప్రతి ప్రొడక్ట్​పై ఈ ప్రభావం ఉంటుంది అని పిచాయ్ అంచనా వేశారు.

Last Updated :Apr 22, 2023, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.