వీడియోకాన్ కేసు.. జైలు నుంచి చందా కొచ్చర్​ దంపతులు విడుదల

author img

By

Published : Jan 10, 2023, 1:24 PM IST

CHANDA KOCHHAR RELEASE from jail
CHANDA KOCHHAR RELEASE from jail ()

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్‌ దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు. బాంబే హైకోర్టు సోమవారం బెయిలు మంజూరు చేసింది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల మంజూరు వ్యవహారంలో 23 డిసెంబరు 2022న కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్టు చేసింది.

జ్యుడిషియల్​ కస్టడీలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్​ కొచ్చర్ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. ఈ మేరకు తమను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సోమవారం బాంబే హైకోర్టు వారికి మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. వారి అరెస్టు అక్రమమే అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
చందా కొచ్చర్​ బైకుల్లా మహిళా జైలు నుంచి, ఆమె భర్త ఆర్థర్​ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు.

వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై 23 డిసెంబరు 2022న కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్టు చేసింది. 2012లో మంజూరు చేసిన రుణాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ దంపతులపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు బ్యాంకు సీఈఓ హోదాలో ఉన్న రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏ(నాన్​ పర్ఫామింగ్​ అస్సెట్స్)గా మారిందని, ఇందులో ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది.

వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణంలో కోట్లాది రూపాయలను దీపక్‌ కొచ్చర్‌ నిర్వహించే న్యూపవర్‌లో వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు పేర్కొంది. ఈ కేసులో చందా కొచ్చర్‌ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌తో పాటు వీడియోకాన్‌ గ్రూపునకు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌, సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.