Ambani vs Elon Musk : భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తీసుకొచ్చేందుకు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో ఆసియా సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నుంచి ఆయనకు తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Modi Meets Elon Musk : ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత భారత్‌లో స్టార్‌లింక్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు మస్క్ ప్రకటించారు. ఇంటర్నెట్ లేని లేదా అధిక వేగం సేవలకు దూరంగా ఉన్న గ్రామాలకు ఈ సేవలకు అద్భుతంగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను పొందడం గురించి మస్క్ మాట్లాడలేదు. ఇక్కడే ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురవుతోంది.
స్టార్‌లింక్ వాదన ఇదీ:
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు వేలం నిర్వహించరాదని స్టార్‌లింక్ లాబీయింగ్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా లైసెన్సులు కేటాయిస్తున్న విధానాన్నే అనుసరించాలని కోరుతోంది. స్పెక్ట్రమ్ అనేది సహజ వనరు అని.. దీన్ని కంపెనీలు పంచుకోవాల్సిన అవసరం ఉందని స్టార్‌లింక్ చెబుతోంది. వేలం వల్ల భౌగోళికమైన ఆంక్షలు వస్తాయని, ఫలితంగా ఖర్చులు పెరుగుతాయని స్టార్‌లింక్ వాదిస్తోంది. టాటాలు, సునీల్ భారతీ మిత్తల్ వన్‌వెబ్, అమెజాన్ కూపెర్ ప్రాజెక్ట్, ఎల్ అండ్ టీ కూడా ఇదే మార్గాన్ని కోరుతున్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. శాటిలైట్ స్పెక్ట్రమ్‌కు వేలం నిర్వహించాలని పట్టుబడుతోంది.
రిలయన్స్ ఏమంటోందంటే:
Ambani Starlink Satellite Services : విదేశీ శాటిలైట్ సేవల ప్రొవైడర్లు వాయిస్, డేటా సేవలు అందించొచ్చని, దేశీయ టెలికాం సంస్థలతో పోటీపడతాయని, అందుకే వేలం ఉండాల్సిన అవసరం ఉందని రిలయన్స్ తెలిపింది. విదేశీ కంపెనీల డిమాండ్‌లకు అంగీకరించకుండా వేలం నిర్వహించమని భారత ప్రభుత్వంపై రిలయన్స్ ఒత్తిడి తీసుకురావొచ్చని అంటున్నారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలను తీసుకొచ్చేందుకు 2021లో మస్క్ ప్రయత్నించినప్పటికీ.. సఫలికృతం కాలేదు. ఇప్పుడు టెస్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా మస్క్ చర్చలు జరుపుతున్నారు.
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో విదేశీ కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొగ్గుచూపడం లేదు. వొడాఫోన్ ఐడియా కూడా వేలానికే మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం టెలికాం విభాగం జియోకు 44 కోట్ల చందాదారులు ఉన్నారు. 80 లక్షల వైర్డ్ బ్రాడ్‌బ్యాంక్ కనెక్షన్‌లతో 25 శాతం మార్కెట్ వాటా కూడా ఉంది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాంక్‌లో సైతం గుత్తాధిపత్యం చెలాయించాలని జియో భావిస్తోంది.
శాటిలైట్ స్పెక్ట్రమ్‌పై పరిశ్రమ వర్గాలు, ఇతరులతో సంప్రదింపులు జరగ్గా 64 కంపెనీలు తమ స్పందన తెలియజేశాయి. 48 సంస్థలు నేరుగా లైసెన్సులు ఇవ్వాలని.. 12 సంస్థలు వేలం నిర్వహించాలని కోరాయి. మిగతా సంస్థలు తటస్థ వైఖరితో ఉన్నట్లు కోన్ అడ్వైజరీ తెలిపింది. స్టార్‌లింక్ వంటి సంస్థలకు నేరుగా అనుమతి ఇస్తే.. అమెజాన్ మాదిరిగా దూసుకెళ్తాయని, భారత సంస్థలు వెనకబడిపోతాయని రిలయన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
'భారత స్పేస్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు (ఎస్‌ఎస్) స్పెక్ట్రమ్‌పై నిర్ణయం చాలా కీలకం. 2010 నుంచి మొబైల్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తున్నారు. దీంతో మొత్తంగా ప్రభుత్వ ఖజానాకు 77 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6 లక్షల కోట్లు) వచ్చాయి. ప్రస్తుతం పలు సంస్థ ఎస్‌ఎస్‌పై చాలా ఆసక్తిగా ఉన్నాయి' అని బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.