ETV Bharat / business

భారత వృద్ధిరేటుపై ఫిచ్​, ఫిక్కీ భిన్న అంచనాలు

author img

By

Published : Oct 8, 2021, 7:04 AM IST

మన దేశ వృద్ధిరేటు అంచనాలను అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ 10 శాతం నుంచి  8.7 శాతానికి తగ్గిస్తే, దేశ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య ఫిక్కీ మాత్రం 9 శాతం నుంచి 9.1 శాతానికి పెంచింది. ఆయా సంస్థల ప్రకారం..

fitch
fitch

ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2021-22) వృద్ధిరేటు అంచనాలను గత జూన్‌ నాటి 10 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గించింది. అంతకు ముందు 12.8 శాతం వృద్ధి లభిస్తుందనీ సంస్థ పేర్కొనడం గమనార్హం. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి ప్రభావంతో ఆర్థిక రికవరీలో వేగం తగ్గడం వల్లే వృద్ధి అంచనాలను మరోసారి తగ్గించినట్లు సంస్థ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) వృద్ధి రేటు అంచనాలను మాత్రం 8.5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. 2020-21లో దేశ జీడీపీ 7.3 శాతం మేర క్షీణించిన సంగతి తెలిసిందే. 2019-20లో 4 శాతం వృద్ధిరేటు నమోదైంది.

  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
  • ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ 9.5 శాతానికి, మూడీస్‌ 9.3 శాతానికి భారత్‌ వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి. 2021 క్యాలెండర్‌ ఏడాదిలో 9.6 శాతం వృద్ధి నమోదు కావొచ్చని మూడీస్‌ అంచనా వేసింది.
  • ప్రపంచ బ్యాంక్‌ గత జూన్‌లో దేశ జీడీపీ వృద్ధి అంచనాలను 10.1 శాతం నుంచి 8.3 శాతానికి తగ్గించింది. ఇక్రా 9 శాతం వృద్ధి అంచనాలను వెలువరించింది. బార్‌క్లేస్‌ గత మేలో 9.2 శాతం వృద్ధిని అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధిరేటు 9.1 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది. గత జులైలో సంస్థ అంచనా 9 శాతం కాగా, ఇప్పుడు స్వల్పంగా పెంచింది. కరోనా మలి దశ అనంతరం ఆర్థిక రికవరీ స్థిరంగా కొనసాగేలా కనిపిస్తుండడం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత పండుగ సీజను ఈ ధోరణికి ఊతంగా నిలుస్తుందని ఫిక్కీ తన 'ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ సర్వే'లో వెల్లడించింది. రుతుపవన వర్షాలు బాగున్నందున ఖరీఫ్‌ సాగు పెరిగి వ్యవసాయ రంగంపై అంచనాలను పెంచేలా చేసిందని వివరించింది.

సెప్టెంబరు 2021న నిర్వహించిన ఈ సర్వేలో పరిశ్రమ, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పలువురు ఆర్థికవేత్తలు పాల్గొన్నారని తెలిపింది. రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలతో పాటు పండుగ సీజనుతో ఆర్థిక రికవరీ ఎలా ఉంది, గిరాకీ పరిస్థితులు ఎలా విస్తరించాయో తేలిపోతుందని పేర్కొంది. దీపావళి పండుగ సమయంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడితే కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో రిజర్వు బ్యాంకు ఫిబ్రవరి 2022లో తన 'సర్దుబాటు' ధోరణి నుంచి 'తటస్థ' ధోరణికి మారే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. రేట్ల పెంపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రమే సాధ్యం కావొచ్చని చెబుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.