ETV Bharat / bharat

రాష్ట్రంలో పెట్టుబడులకు అపరిమిత అవకాశాలు.. ఏపీ సీఎం జగన్

author img

By

Published : Mar 3, 2023, 1:29 PM IST

Global Investors Summit : విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని సీఎం జగన్ వెల్లడించారు. 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అపార అవకాశాలు, అంతకు మించిన మానవ వనరులు ఉన్నట్లు మంత్రులు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

Global Investors Summit : విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. అడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో సదస్సు నిర్వహిస్తుండగా.. పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో రిలయన్స్‌ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సైయంట్‌ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ తదితర ప్రముఖులు ఉన్నారు.

పెట్టుబడి దారుల సదస్సు సందర్భంగా ఏపీలో పారిశ్రామిక వనరులపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆయా రంగాల్లో అందుబాటులో ఉన్న వనరులు, రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై డాక్యుమెంటరీ ప్రదర్శించింది.

పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం.. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, అందుకు విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక వేత్తల సదస్సు వేదిక కానుందని సీఎం జగన్ అన్నారు. 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని, 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు కుదుర్చుకున్నట్లు సీఎం వెల్లడించారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని, రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని, 6 పోర్టులకు తోడు అదనంగా మరో 4 పోర్టులు రాబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు.. పరిశ్రమల స్థాపనకు ఏపీలో భౌగోళికంగా అనుకూల వాతావరణం ఉందన్నారు.

సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవకాశాలు అపారం అని చెప్పారు. పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ముందుందని తెలిపారు.

సత్వర అనుమతులు.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులు అందజేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అపార ఖనిజ సంపద, పెట్టుబడులకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సీఎం జగన్‌ నాయకత్వంలో అంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ జగన్‌ పాలన సాగుతోందని చెప్పుకొచ్చారు.

సహజ వనరులు అనేకం.. అర్థిక శాఖ మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం ముందుందని తెలిపారు. పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయని, ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవ లేదని చెప్పారు.

ప్రభుత్వ సహకారం.. అపోలో ఆస్పత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వ కృషి అభినందనీయమని, ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. అపోలో కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని తెలిపారు. ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోందని శ్రీసిమెంట్‌ ఛైర్మన్‌ హరిమోహన్‌ బంగుర్‌ అన్నారు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో చాలామందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం.. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్‌ జిందాల్‌ అన్నారు. జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని చెప్తూ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో ఉపాధి కల్పిస్తున్నామన్నారు.

మానవ వనరులు అపారం.. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదని జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉందని, కనెక్టివిటీ బాగా పెరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ విజన్‌ అద్భుతం అని కొనియాడుతూ ఏపీ ప్రగతిలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందన్నారు. సైయంట్‌ అధినేత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖలో సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయమని, విద్యారంగంలో ఏపీ కృషి అమోఘమని అభినందించారు. మనబడి, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు.

నైపుణ్య శిక్షణతో మరింత అభివృద్ధి... భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ ఏపీలో మానవ వనరులు అపారమని, నైపుణ్య శిక్షణతో మెరుగైన అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. జీనోమ్‌ వ్యాలీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.