ETV Bharat / state

న్యాయవాదుల ఇంట్లో చట్టం బందీ.. విజయనగరం మహిళ కేసులో మరో ట్విస్ట్..!

author img

By

Published : Mar 3, 2023, 11:06 AM IST

Updated : Mar 3, 2023, 5:26 PM IST

Women's House Arrest : న్యాయవాది అనే అహం.. అతడిలో సైకోను మేల్కొల్పింది. అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యను 11ఏళ్ల పాటు బాహ్యప్రపంచానికి దూరం చేసింది. ఎట్టకేలకు పోలీసుల రంగ ప్రవేశంతో బాధిత మహిళ చీకటి నుంచి వెలుగులోకి రావడం విదితమే. విజయనగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా.. అదే కుటుంబానికి సంబంధించి మరో దారుణ ఉదంతం వెలుగుచూసింది.

Etv Bharat
Etv Bharat

Women's House Arrest : విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాదులు గోదావరి మధుసూదన్, దుర్గాప్రసాద్ వరుసగా రచ్చకెక్కారు. తొలుత సుప్రియ తల్లిదండ్రులు ఆ న్యాయవాదుల ఇంటిపై పోలీసుల సహకారంతో తమ కూతురుకు విముక్తి కల్పించగా.. మరుసటి రోజు ఆ ఇంటి చిన్న కోడలు పుష్పలత సైతం తనకు జరిగిన అన్యాయంపై తండ్రితో కలిసి ఆ ఇంటి తలుపు తట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.

శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు విజయనగరంలోని గోదావరి మధుసూదన్ తో 2008 సంవత్సరంలో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కాగా, మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి తో పాటు తన తమ్ముడు మాటలు విని భార్యకు తీరని ద్రోహం తలపెట్టాడు. బయట ప్రపంచానికి దూరం చేస్తూ 11 సంవత్సరాలు పాటు ఇంటికే పరిమితం చేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు బతిమాలినా తన వృత్తిని అడ్డం పెట్టుకొని బెదిరించాడు. తమ కూతురును చూసే అవకాశం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు కంట తడిపెట్టని రోజులేదు. తమ కుమార్తె ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆలోచనలతోనే కాలం గడుపుతున్నారు.

11ఏళ్లుగా మనోవేదన.. దాదాపు 11 సంవత్సరాల పాటు నిత్యం మనోవేదన అనుభవించారు. ఈ నేపథ్యాన.. సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు విజయనగరం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కూతురును చూపించాలంటు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్లగా.. ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు ఉందా అని ప్రశ్నించాడు. న్యాయస్థానం అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకువచ్చి ఇంటిని తనిఖీ చేయగా.. . సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో బిక్కు బిక్కుమంటూ కనిపించింది. చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కూర్చున్న ఆమెను బయటకు తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచారు.

2009లో చివరి సారిగా... సుప్రియ చివరిసారిగా 2009లో ప్రసవానికి పుట్టింటికి వెళ్లింది. కుమార్తె పుట్టాక తిరిగి అత్తారింటికి వచ్చేసింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. ఫోన్లో కూడా మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టిన విషయాన్నీ సుప్రియ తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. తమ కూతురును చూసేందుకు తల్లిదండ్రులు వచ్చినా ఇంట్లోకి రానివ్వలేదు. అలా 11 ఏళ్లు గడుస్తున్నా కుమార్తె ఎలా ఉందో తెలియక.. ఆమం తండ్రి జనార్దన్‌ మంచం పట్టారు.

జడ్జి గారితో మాట్లాడాను. నా పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లాలనుకుంటున్నాను. కొన్నాళ్లు అక్కడ సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఇంటి నుంచి బయటకు రావడానికి ఇలా చేశాను.. చివరకు విజయం సాధించాను. - సుప్రియ, విజయనగరం

గోదావరి మధుసూదన్ గృహ నిర్బంధం నుంచి సుప్రియ బయటకు వచ్చిన 24 గంటల్లో అదే కుటుంబానికి చెందిన మరో బాధితురాలు మీడియా ముందుకొచ్చింది. తనకు కూడా జరిగిన అన్యాయంపై ఆందోళనకు దిగింది. ఆమె మధుసూదన్ సోదరుడు దుర్గాప్రసాద్ భార్య కావడం గమనార్హం. బాధితురాలు పుష్పలత విశాఖలో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తనకు ఇద్దరు కుమారులు కాగా, ఓ కుమారుడిని తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని విచారం వ్యక్తం చేసింది. పలుమార్లు ఇంటి చుట్టూ తిరిగిన స్పందించలేదని., కోర్టుని ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని మీడియా ఎదుట వాపోయింది. తన తోటి కోడలు సుప్రియకు విముక్తి లభించిందన్న సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకుని వచ్చానని చెప్పింది. తనకు పోలీసులు న్యాయం చేయాలని పుష్పలత, ఆమె తండ్రి అప్పలనాయుడు కోరారు.

మా తోటి కోడలు న్యూస్ చూసి వచ్చాను. నా పెద్ద కొడుకును కూడా వాళ్ల దగ్గరే ఉంచుకున్నారు. వాడిని చూసి ఆరు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా మాకు చూపించి, మాతో పంపిస్తే ఆలనా పాలన చూసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. పుష్పలత, బాధితురాలు

న్యాయవాదుల ఇంట్లో చట్టం బందీ

ఇవీ చదవండి :

etv play button
Last Updated :Mar 3, 2023, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.