ETV Bharat / bharat

Avinash reddy : కఠిన చర్యలొద్దంటూ ఆదేశాలివ్వలేం.. తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి స్పష్టీకరణ

author img

By

Published : Apr 29, 2023, 6:45 AM IST

Avinash reddy
టీఎస్​ హైకోర్టు

16:00 April 28

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలుపై విచారణ జూన్‌ 5కి వాయిదా

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలుపై విచారణ జూన్‌ 5కి వాయిదా

Avinash reddy : వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. సెలవులు ఉన్నందున పిటిషన్‌పై తేల్చలేమన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్​ విచారణను జూన్ 5కి వాయిదా వేశారు. సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నందున.. కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులోనైనా విచారణ జరపాలని అవినాష్‌ రెడ్డి తరపు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని కోరగా.. ఇప్పటికిప్పుడు హడావిడి నిర్ణయాలు తీసుకోలేమన్నారు.

విచారణలో రోజుకో మలుపు: కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కోర్టుల్లో విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ముందస్తు బెయిల్‌ కోసం అవినాష్‌ రెడ్డి గత నెల 29నే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. మరుసటి రోజు వెనక్కి తీసుకున్నారు. ఈనెల 17న వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడంతో మరుసటి రోజున వైఎస్ అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వద్ద లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి పిటిషన్​ను జస్టిస్ కె.సురేందర్‌కు ప్రధాన న్యాయమూర్తి కేటాయించారు. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ ఈనెల 18న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పు పట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈనెల 24న వాటిని కొట్టివేసింది. అయితే తమ ఉత్తర్వులతో ప్రభావితం కాకుండా పూర్తిస్థాయి విచారణ చేపట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తేల్చాలని హైకోర్టుకు తెలిపింది.

హైకోర్టుకు వచ్చిన వివేకా కూతురు, అల్లుడు: ఈనెల 25న తెలంగాణ హైకోర్టు విచారణ జాబితాలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ చివరలో ఉండటంతో.. త్వరగా విచారణ జరపాలని న్యాయవాదులు హైకోర్టును కోరారు. అయితే అప్పటికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి అందకపోవంతో మరుసటి రోజు పరిశీలిస్తామని న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ తెలిపారు. ఈనెల 26న అవినాష్ పిటిషన్ విచారణ జాబితాలో లేకపోవడంతో ఆయన తరఫు న్యాయవాదులు మళ్లీ న్యాయమూర్తిని కోరారు. మరుసటి రోజు మధ్యాహ్నం మూడున్నరకు వింటామని జడ్జి తెలిపారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం మూడున్నరకు అవినాష్ రెడ్డి, సునీత తరఫున న్యాయవాదుల వాదనలు జరిగాయి. కోర్టు సమయం ముగియడంతో మిగతా వాదనలు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు వింటామని హైకోర్టు తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు న్యాయవాదులందరితో పాటు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టుకు వచ్చారు.

తదుపరి విచారణ జూన్ 5కి వాయిదా: అవినాష్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ తెలిపారు. సమయం సరిపోదని.. ఒకవేళ వాదనలు ముగిసినా.. ఉత్తర్వులు వెల్లడించలేమన్నారు. శని, ఆదివారం సాధారణ సెలవులు.. మే 1 నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు.. మళ్లీ జూన్ 3,4శని, ఆదివారాలు కాబట్టి.. జూన్ 5న విచారణ జరుపుతామన్నారు. అయితే సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉంది కాబట్టి.. మే 4న వేసవి సెలవుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని.. అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. పిటిషన్‌పై విచారణను తనకు సీజే అప్పగించినందున.. తనకు తాను మరో కోర్టుకు బదిలీ చేయలేనని న్యాయమూర్తి తెలిపారు. అత్యవసరం అనుకుంటే ప్రధాన న్యాయమూర్తినే కోరాలని సూచిస్తూ.. పిటిషన్‌ను జూన్ 5కి వాయిదా వేశారు. కనీసం రెండు వారాలైనా కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించాలని అవినాష్ తరఫు న్యాయవాదులు కోరారు. మధ్యంతర ఉత్తర్వులను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసినందున …..అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సీబీఐ దర్యాప్తు చట్టపరంగా కొనసాగుతుందన్నారు.

ఇప్పటికిప్పుడు హడావిడి నిర్ణయాలు తీసుకోలేమన్న తెలంగాణ సీజే: అవినాష్‌ రెడ్డి తరపు న్యాయవాదులు వెంటనే ప్రధాన న్యాయమూర్తిని కలిసి పరిస్థితి వివరించారు. అరెస్టు చేసే అవకాశం ఉన్నందున వేసవి సెలవుల కోర్టులోనైనా విచారణ జరపాలన్నారు. ఇప్పటికిప్పుడు హడావిడిగా నిర్ణయాలు తీసుకోలేమని.. ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినందున.. తమపై ఒత్తిడి చేయవద్దని కోరారు. వేసవి సెలవుల ప్రత్యేక కోర్టునే కోరాలని సూచించారు. అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు మళ్లీ జస్టిస్ సురేందర్‌ను ఆశ్రయించి.. జూన్ 5కి వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని అత్యవసరంగా ఇవ్వాలని కోరారు. ఆదేశాల ప్రతిని ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.


ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.