ETV Bharat / bharat

జస్టిస్‌ ఖాన్విల్కర్‌ కష్టపడేతత్వానికి మారుపేరు: సీజేఐ

author img

By

Published : Jul 30, 2022, 4:29 AM IST

కష్టపడేతత్వానికి మారుపేరు జస్టిస్‌ ఏ.ఎం.ఖాన్విల్కర్‌ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశంసించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా మూడో స్థానంలో ఉన్న జస్టిస్‌ ఖాన్విల్కర్‌ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

జస్టిస్‌ ఖాన్విల్కర్‌ కష్టపడేతత్వానికి మారుపేరు
జస్టిస్‌ ఖాన్విల్కర్‌ కష్టపడేతత్వానికి మారుపేరు

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా మూడో స్థానంలో ఉన్న జస్టిస్‌ ఖాన్విల్కర్‌ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. కష్టపడేతత్వానికి జస్టిస్‌ ఏ.ఎం.ఖాన్విల్కర్‌ మారుపేరు అని కొనియాడారు.

"జస్టిస్‌ ఖాన్విల్కర్‌ 187కి పైగా తీర్పులు రాశారు. 8,446 కేసులను విచారించారు. 'స్వప్న అలీ త్రిపాఠీ వర్సెస్‌ సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా' కేసులో ఆయన ఇచ్చిన మెజార్టీ తీర్పు సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షప్రసారం చేయడానికి మార్గం సుగమం చేసింది. 'పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా' కేసులో.. పోటీచేసే అభ్యర్థులంతా తప్పనిసరిగా నేరచరిత్రను వెలువరించాలని ఆయన ఇచ్చిన తీర్పు రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి బీజం వేసింది. పార్లమెంటరీ స్థాయీసంఘం ఇచ్చిన జ్యుడిషియల్‌ నోటీసును పరిగణనలోకి తీసుకోవచ్చంటూ 'కల్పన మెహతా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా' కేసులో తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు. వీటితో పాటు ఆయన ఎన్నో ముఖ్యమైన తీర్పులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా ఆయన మాకు అండగా నిలిచారు. నేను, జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ ఖాన్విల్కర్‌తో కలిసి ఏడాదిలో 250 మంది న్యాయమూర్తుల నియామక ప్రక్రియను పూర్తిచేశాం" అని సీజేఐ పేర్కొన్నారు.

యుక్తవయసులో పరుగుల వీరుడైన జస్టిస్‌ ఖాన్విల్కర్‌ ముంబయి నుంచి అలియాబాగ్‌ వరకు 100 కిలోమీటర్లు పరుగెత్తుకొచ్చారని గుర్తుచేశారు. పదవీవిరమణ తర్వాత కూడా ఆయన తన శారీరక దారుఢ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నామన్నారు. జస్టిస్‌ ఖాన్విల్కర్‌ మాట్లాడుతూ తన పనితీరును ప్రశంసించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తికి మంచి నిఘా సమాచారం ఉందని, ఆయన చెప్పిన విషయాలు తనను ఆశ్చర్యానికి గురిచేసేవని అన్నారు. తనతో పనిచేసిన వారందరి నుంచి స్ఫూర్తి తీసుకొని ముందడుగు వేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

1957 జులైలో మహారాష్ట్రలోని పుణేలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్‌ ఖాన్విల్కర్‌ ముంబయిలో లా చదివి అక్కడే న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించారు. 1984లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2002లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013 ఏప్రిల్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను పనిచేశారు. 2016 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పదవీ విరమణతో 34 మంది ఉండాల్సిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.