ETV Bharat / bharat

హిమాచల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్విందర్ సుఖు

author img

By

Published : Dec 11, 2022, 2:01 PM IST

Updated : Dec 11, 2022, 5:50 PM IST

హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాచల్‌లో తొలిసారి ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకువచ్చిన కాంగ్రెస్.. దాన్ని ముఖేశ్ అగ్నిహోత్రికి కట్టబెట్టింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. భారీగా ప్రజలు తరలివచ్చారు.

sukhvinder-singh-sukhu oath taking
sukhvinder-singh-sukhu oath taking

దేశంలో క్రమంగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ మరో రాష్ట్రంలో పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల వెలువడిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన హస్తం పార్టీ.. ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచింది. హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖుతో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన 58 ఏళ్ల సుఖ్విందర్ సింగ్ సుఖు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

సాధారణ బస్సు డ్రైవర్‌ కుమారుని స్థాయి నుంచి వచ్చిన సుఖు.. ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉపముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో మొట్టమొదటి ఉపముఖ్యమంత్రిగా నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని తెలిపారు. మొత్తం 10 హామీలు ఇచ్చామని.. పారదర్శక, నిజాయితీ పాలనను అందిస్తామని పేర్కొన్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు పాత ఫించను విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

శిమ్లాలోని రిడ్జ్‌ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు పట్టాభిషేకం చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. మెుత్తం 12 మందితో కూడిన మంత్రివర్గంలో కేవలం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణం చేశారు. సీఎం రేసులో ఉండి చివరి వరకు ప్రయత్నించిన మండి ఎంపీ ప్రతిభా సింగ్ కొత్త ముఖ్యమంత్రికి సహకరిస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated :Dec 11, 2022, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.