ETV Bharat / bharat

'పది' పరీక్షలకు లీకుల బెడద.. వాట్సాప్‌లో ఇవాళ హిందీ పేపర్ ప్రత్యక్షం

author img

By

Published : Apr 4, 2023, 11:41 AM IST

Updated : Apr 4, 2023, 2:52 PM IST

SSC Hindi paper leak in Telangana
SSC Hindi paper leak in Telangana

11:26 April 04

మరో లీక్.. వాట్సాప్‌లో పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ ప్రత్యక్షం

SSC Hindi paper leak in Telangana : తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ఉద్యోగులే ఈ పేపర్లు లీక్ చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది మరవకముందే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన రోజే తెలుగు క్వశ్చన్ పేపర్ లీకయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

10th Hindi paper leak in Telangana 2023 : తెలుగు పేపర్ లీకే ఘటన మరవకముందే మరో క్వశ్చన్ పేపర్ లీకయింది. ఇవాళ పదో తరగతి విద్యార్థులు హిందీ పరీక్ష రాస్తున్న విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన క్షణాల్లోనే పదో తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో హిందీ ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైనట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరంలో పదో తరగతి హిందీ పేపర్ లీక్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో హిందీ పేపర్‌కు సంబంధించిన ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.

పేపర్ లీక్‌పై మంత్రి ఆరా.. వాట్సాప్‌లో హిందీ ప్రశ్నపత్రం విద్యాశాఖ మంత్రి వైరల్‌పై ఆరా తీశారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదని వరంగల్‌, హనుమకొండ డీఈఓలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని వివరించారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని డీఈవోలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి వరుసగా రెండో రోజు క్వశ్చన్ పేపర్ లీక్ కావడం పట్ల ఇటు విద్యార్థులు.. అటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటే.. ఇలా పేపర్ లీక్ అవ్వడం వల్ల నష్టపోతారని వాపోతున్నారు. ఇలాంటి ఘటనల వల్ల పరీక్షలు రద్దు చేస్తే అది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజీపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉప్పల్ కేంద్రం నుంచి పేపర్ బయటకు వెళ్లిందన్న ఆరోపణలతో ఆ కేంద్రానికి సీఐ, తహశీల్దార్ వెళ్లారు. అక్కడి సిబ్బందిని విచారించారు. తమ కేంద్రం నుంచి పేపర్ బయటకు వెళ్లలేదని సిబ్బంది అధికారులకు తెలిపినట్లు సమాచారం. మరోవైపు క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌ గ్రూపుల్లోకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనపై సీపీకి ఫిర్యాదు చేయాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో డీఈవో వాసంతి సీపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం హిందీ పేపర్ లీకేజీ ఘటనపై సీపికి ఫిర్యాదు చేశారు. 'వాట్సాప్‌లో ఉన్న ప్రశ్నపత్రం, ఇవాళ జరిగిన పరీక్షతో సరిపోలింది. ప్రశ్నాపత్రం ఎక్కడ్నుంచి బయటకు వెళ్లిందనేది నిర్ధరణ కాలేదు. పరీక్ష హాలులోకి ఇన్విజిలేటర్లు మినహా ఎవరికి ప్రవేశం ఉండదు. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం ఘటనపై వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేశాం.' అని డీఈవో వాసంతి తెలిపారు.

హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో వైరల్ అయిన ఘటనపై ఫిర్యాదు అందుకున్న వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. క్వశ్చన్ పేపర్ ఎక్కడ్నుంచి బయటకు వెళ్లిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇతర జిల్లాల వాట్సాప్‌లోనూ వైరల్‌ అయ్యిందని స్పష్టం చేశారు. ఇది ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు కాదని.. పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్‌ బయటికి వెళ్తే లీకేజ్‌ అంటామని చెప్పారు. ఈ ఘటనలో మాత్రం పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌లో కనిపించిందని వివరించారు. పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న లోటుపాట్లపై దృష్టి పెడతామన్న సీపీ.. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా చర్యలు చేపడతామని వివరించారు.

మరోవైపు ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకోవడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకని పదోతరగతి పరీక్షలను నిర్వహించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. అందరూ బాధ్యతగా పని చేయాలని.. కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దన్న మంత్రి.. గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం వీడాలని హితవు పలికారు.

మరోవైపు పదో తరగతి పరీక్షలకు సంబంధించి వరుసగా రెండో రోజు కూడా పేపర్ లీక్ కావడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది కేసీఆర్ ప్రభుత్వమా.. లేక లీకుల సర్కారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో రైతులు, నిరుద్యోగులే కాదు.. విద్యార్థుల ఆత్మహత్యలు కూడా తప్పడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనను పక్కదారి పట్టించడం కోసం ఇప్పుడు పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకులకు కేసీఆర్ సర్కార్ తెరతీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పదోతరగతి పరీక్షలు మొదలైన మొదటి రోజే వాట్సాప్‌లో తెలుగు పేపర్ లీకైన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా తాండూరులో బయోలజీ టీచర్ బందెప్ప ఈ పనికి పూనుకున్నారనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. బందెప్ప తన మొబైల్ నుంచి మరో టీచర్‌కు పంపడమే గాక.. ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలతోపాటు పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ గోపాల్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి శివకుమార్‌ని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. బందెప్ప, సమ్మప్పపై క్రిమినల్‌ చర్యలుంటాయని స్పష్టం చేశారు.

Last Updated :Apr 4, 2023, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.