ETV Bharat / bharat

అరుణాచల్​లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు.. భారత్​ ఫైర్

author img

By

Published : Apr 4, 2023, 11:59 AM IST

Updated : Apr 4, 2023, 2:11 PM IST

china arunachal pradesh dispute
china arunachal pradesh dispute

చైనా దుర్నీతి మరోసారి బయటపడింది. అరుణాచల్‌ ప్రదేశ్​లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది.తమవి కాని ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న డ్రాగన్‌.. ఇప్పటికే అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు 2 సార్లు పేర్లు పెట్టింది. మళ్లీ మూడోసారి కూడా అలాంటి దుశ్చర్యకు దిగింది. అయితే చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. అరుణాచల్‌ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని గట్టిగా తేల్చిచెప్పింది.

సరిహద్దుల్లో చైనా కుటిలనీతి మరోసారి బయటపడింది. రష్యా విదేశాంగ విధానం విడుదల తర్వాత భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ప్రకటిస్తూనే కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది బీజింగ్. అరుణాచల్‌ ప్రదేశ్‌ను జంగ్నాన్‌గా పిలుస్తున్న చైనా.. అక్కడి 11 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది. అందులో రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులు ఉన్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ-20 సమావేశం నిర్వహించిన వారం రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఆ సమావేశానికి చైనా ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. స్టేట్‌ కౌన్సిల్‌, చైనా కేబినెట్‌ జారీ చేసిన భౌగోళిక పేర్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

మరికొన్ని రోజుల్లో భారత్‌లో జరగనున్న SCO సదస్సుకు చైనా రక్షణ మంత్రి హాజరు కానున్నారు. జులైలో జరగనున్న SCO సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనా దుందుడుకు చర్యలు చర్చనీయాంశంగా మారాయి. చైనా చర్యలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులేమీ మారవని స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడటం చైనాకు కొత్త కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేసింది.

'చైనా ఇలా పేర్లు మార్చడం మొదటి సారి కాదు.. ఇలాంటి చర్యలను తిరస్కరిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారత్​లో అంతర్భాగం. దేశంతో అరుణాచల్​ ప్రదేశ్​కు విడదీయరాని బంధం ఉంది. తమ భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులేమీ మారవు' అని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు.

కాంగ్రెస్​ విమర్శలు..
అరుణాచల్​ప్రదేశ్​లోని 11 ప్రాంతాలకు చైనా పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. చైనాపై ప్రధాని మౌనం ఫలితంగా డ్రాగన్​ ఇలా వ్యవహరిస్తోందని విమర్శించింది. చైనాకు ప్రధాని మోదీ క్లీన్‌చిట్‌ ఇవ్వడం వల్లే భారత్​ ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

'ఇప్పటివరకు చైనా మూడు సార్లు అరుణాచల్​​లోని పలు ప్రాంతాలకు పేర్లు మార్చే ధైర్యం చేసింది. 2017లో 6, 2021లో 15 ప్రదేశాలకు పేర్లు మార్చింది. ఇప్పుడు మూడోసారి 11 ప్రదేశాలకు పేర్లు మార్చింది. అరుణాచల్​ ప్రదేశ్ ఎప్పటికీ​ భారత్​లో అంతర్భాగమే. ' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

2017లో జరిగిన ఢోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా తొలిసారి అరుణాచల్‌ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు నామకరణం చేసింది. ఆ తర్వాత 2021లో ఏకంగా 15 ప్రాంతాలకు తమ పేర్లు పెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 11 ప్రాంతాలకు చైనా పౌరవ్యవహారాల శాఖ పేర్లు పెట్టింది.

రష్యా విదేశాంగ విధానం..
అంతకుముందు.. రష్యా రూపొందించిన సరికొత్త విదేశీ విధానంపై చైనా సానుకూలంగా స్పందించింది. చైనా, రష్యా, భారత్‌ ఎదుగుతున్న ప్రధాన శక్తులని తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము సిద్ధమేనని డ్రాగన్ ప్రకటించింది.
సరికొత్త విదేశీ విధానంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇటీవల సంతకం చేశారు. భారత్​, చైనాతో స్నేహాన్ని పటిష్ఠం చేసుకోవడం తమకు దౌత్యపరమైన ప్రాధాన్యాంశమని పుతిన్ అన్నారు. యూరేసియా ప్రాంతంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తామని, అలాగే ప్రత్యర్థి దేశాలు, కూటములు చేపట్టే 'విధ్వంసకర చర్యల'ను నిరోధిస్తామని వివరించారు.

Last Updated :Apr 4, 2023, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.