ETV Bharat / bharat

సెట్ ​టాప్ బాక్స్ లేకుండానే ఫ్రీగా 200 ఛానల్స్.. కేంద్రం కొత్త ప్లాన్!

author img

By

Published : Feb 15, 2023, 12:45 PM IST

దేశంలో టీవీల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. టీవీల్లో పలు ఛానల్స్ చూడాలంటే తప్పనిసరిగా సెట్​ టాప్ బాక్స్​ను కొనుగోలు చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించే పలు ఛానల్స్ చూడాలన్నా సెట్​టాప్ బాక్స్ ఉండాల్సిందే. సెట్​ టాప్ బాక్స్ కొనడం అనేది వినియోగదారులకు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సెట్​ టాప్ బాక్స్ అవసరం లేకుండా ఉచితంగా టీవీ ఛానల్స్ చూసే అవకాశాన్ని కల్పించడానికి అడుగులు వేస్తోంది.

free channels from govt
free channels from govt

మారుతున్న జీవన విధానంలో ప్రతి ఇంటికి కనీసం ఒక టీవీ తప్పనిసరిగా మారిపోయింది. టీవీలో నచ్చిన ఛానల్స్ చూడాలంటే సెట్​ టాప్ బాక్సును కొనాల్సిందే. ఇలా సెట్​ టాప్ బాక్స్ పెట్టుకున్న తర్వాతే ఉచిత ఛానల్స్ తో పాటు డబ్బు చెల్లించి చూసే ఛానల్స్ టీవీలో వస్తాయి. అయితే కేంద్రం ఉచితంగా ప్రసారం చేసే ఛానెల్స్ చూడాలన్నా సెట్​ టాప్ బాక్స్ తప్పనిసరి అవడం, దీని వల్ల వినియోగదారులకు ఆర్థిక భారం అవుతుండటంతో కేంద్రం కీలక అడుగులు వేస్తోంది.

200 ఛానల్స్​ను ఉచితంగా చూడటం ఎలా?
200లకు పైగా ఉచిత ఛానల్స్ (ఫ్రీ టు ఎయిర్)ను సెట్​ టాప్ బాక్స్ లేకుండా చూసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు విడిగా సెట్​ టాప్ బాక్స్ కొనే స్థానంలో టీవీల్లోనే శాటిలైట్ ట్యూనర్లను అమర్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం బిల్డ్ ఇన్ శాటిలైట్ ట్యూనర్లను టీవీల్లో అమర్చేలా టీవీ తయారీదారులకు బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఆదేశాలు జారీ చేయాలని గత ఏడాది డిసెంబర్​లో సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​కు.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేఖ రాశారు.

సెట్​ టాప్ బాక్స్ ఖర్చును తగ్గించడం కోసం టీవీల్లో శాటిలైట్ ట్యూనర్లు రానుండగా.. వినియోగదారులకు యాంటెనాను ఇస్తారు. ఈ యాంటెనాను ఇంటి పైకప్పు మీద లేదంటే గోడ మీద లేదా మరోచోట ఉంచి సిగ్నల్స్ అందేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 200 ఛానల్స్​ను ఉచితంగా చూసే అవకాశం లభించనుంది. ఎన్టీవో (న్యూ టారిఫ్ ఆర్డర్) 3.0 కారణంగా డీటీహెచ్ బిల్లులు పెరగడం వల్ల వినియోగదారులు ఓటీటీ (ఓవర్ ది టాప్)కి అలవాటు పడుతున్నారు. కొత్త టీవీలలో చాలా యాప్స్ ప్రీలోడెడ్​గా వస్తుండటం వల్ల వినియోగదారులు ఓటీటీ కంటెంట్​ను చాలా సులభంగా పొందడానికి అవకాశం కలిగింది. దీనికి తోడు బిల్డ్ ఇన్ శాటిలైట్ ట్యూనర్ సాయంతో ఉచితంగా 200 ఛానల్స్​ను వినియోగదారులకు అందించాలని కేంద్రం అడుగులు వేస్తోంది. మరోవైపు, దూరదర్శన్ ఇప్పటికే తన ఉచిత ఛానళ్లను అనలాగ్ ప్రసారం నుండి డిజిటల్ శాటిలైట్ ప్రసారంగా మార్చడానికి కృషి చేస్తోంది. కాగా భారతదేశంలో 2015 నుండి ఉచిత డిష్ వినియోగదారులు రెట్టింపు అయ్యారని ఓ నివేదిక పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.