ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: భారత తెల్ల గూఢచారి మైఖేల్‌ జాన్‌ కారిట్​!

author img

By

Published : Sep 7, 2021, 8:41 AM IST

Updated : Sep 7, 2021, 9:06 AM IST

మానవతా దృక్పథంతో భారత్‌కు అండగా నిలిచి పింఛన్‌ కోల్పోయారు బ్రిటిష్‌ ఉన్నతాధికారి - మైఖేల్‌ జాన్‌ కారిట్‌!. భారతీయులతో మానసిక బంధం ముడిపడిన ఆయన.. తమ ప్రభుత్వం ప్రజల్ని ఎంతగా పీడిస్తుందో చూసి బాధపడేవారు. రహస్యంగా స్వాతంత్య్రోద్యమానికి సహకరించారు.

MICHEL JOHN CARIT
ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్

స్వాతంత్య్రోద్యమ సమయంలో భారత్‌కు మద్దతెవ్వరిచ్చినా సహించలేకపోయింది బ్రిటిష్‌ ప్రభుత్వం. చివరకు తమ అధికారులను కూడా శిక్షించేది. మానవతా దృక్పథంతో భారత్‌కు అండగా నిలిచి పింఛన్‌ కోల్పోయారో బ్రిటిష్‌ ఉన్నతాధికారి - మైఖేల్‌ జాన్‌ కారిట్‌! ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ (ఐసీఎస్‌) పాసైన కారిట్‌ కలెక్టర్‌గా 1930లో భారత్‌లో అడుగుపెట్టారు. వచ్చీ రావటంతోనే భారతీయులతో మానసిక బంధం ముడిపడింది. తమ ప్రభుత్వం వారినెంతగా పీడిస్తోందో చూసి బాధపడేవారు కారిట్‌! బ్రిటన్‌లో ఉన్నప్పుడే కారిట్‌పై బ్రిటిష్‌ కమ్యూనిస్టుల ప్రభావం పడింది. వారింట్లో దాదాపు అంతా కమ్యూనిస్టు పార్టీ సభ్యులే! భారత్‌లోని పరిస్థితులను, బ్రిటిష్‌ వారి దమనకాండ, దోపిడీతీరును చూశాక కారిట్‌ మరింత కదిలిపోయారు. కమ్యూనిస్టు భావజాలంతో మమేకమై, భారత్‌లో కమ్యూనిస్టు పార్టీకి దగ్గరయ్యారు. అది రహస్యంగానే! వారి ద్వారా భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతునిచ్చేవారు.

గూఢచారిగా..

బెంగాల్‌లోని మేధినీపుర్‌, అసన్‌సోల్‌ తదితర ప్రాంతాల్లో కారిట్‌ పనిచేసేప్పుడు, జిల్లా ఉన్నతాధికారిగా తనకున్న అధికారాలతో ప్రజల పక్షాన నిలవటం; తక్కువ శిక్షలతో భారతీయుల పట్ల జాలి చూపటం తోటి బ్రిటిష్‌ అధికారులకు నచ్చలేదు. దాంతో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఫలితంగా కోల్‌కతాలోని రాజకీయ కార్యకలాపాల విభాగానికి ఆయన్ను బదిలీ చేశారు. ఇదీ ఒకందుకు కారిట్‌కు, జాతీయోద్యమానికి మంచిదే అయింది. లండన్‌ నుంచి వచ్చే కీలకమైన, రహస్య సందేశాలను ఇక్కడే విశ్లేషించేవారు. వాటిని తెలుసుకునే అవకాశమున్న కారిట్‌... కమ్యూనిస్టు నేతలకు పంపించేవారు. క్రమంగా కారిట్‌ బ్రిటిష్‌ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న భారత గూఢచారిగా మారిపోయారు. మధ్యలో లండన్‌ వెళ్ళినప్పుడు సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్‌ (ఎల్‌ఏఐ)లో చేరి... భారత్‌లో కమ్యూనిస్టు సాహిత్యాన్ని పంచటం ఆరంభించారు. ఎవరికీ అనుమానం రాకుండా అప్పటి భారత కమ్యూనిస్టు నేత ఒకరిని తన బాడీగార్డుగా నియమించుకున్నారు. ఆయన ద్వారా సమాచారం బయటకు వచ్చేది. బ్రిటిష్‌ ప్రభుత్వానికి అనుమానం వస్తోందని అనిపించగానే కారిట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఏడాదికి 400 పౌండ్ల పింఛన్‌ మంజూరైంది. కానీ కారిట్‌ పనితీరుపై ఓ కన్నేసి ఉంచిన బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమానంతో ఆలస్యంగా ఆయనపై విచారణ చేపట్టింది.

పింఛన్‌ కట్‌

లండన్‌లోని ఆయన ఇంట్లో కూడా సోదాలు చేసి, కారిట్‌ భారత్‌లో పనిచేసినప్పటి అనేక విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. అరెస్టు చేస్తే లండన్‌లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆ పని చేయకుండా పింఛన్‌ పూర్తిగా రద్దు చేశారు. స్వాతంత్య్రా నంతరం కూడా భారత్‌లో అడుగు పెట్టకుండా ఆయనపై నిషేధం విధించారు.

ఇదీ చదవండి:రాజ్యాంగ విలువల పరిరక్షణే సర్వోన్నతం

Last Updated : Sep 7, 2021, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.