ETV Bharat / bharat

ప్రధాని మోదీ వందో 'మన్ ​కీ బాత్​'.. గల్లీ నుంచి దిల్లీ వరకు ప్రసారానికి బీజేపీ ఏర్పాట్లు

author img

By

Published : Apr 29, 2023, 3:33 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ మనసులో మాట అయిన.. మన్‌కీబాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు ఆలకించేలా బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో.. ప్రజలు వీక్షించేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి.. పోలింగ్ కేంద్రం స్థాయి నాయకుల వరకు అంతా పాల్గొనేలా పెద్దఎత్తున సమాయత్తం చేసింది.

mann ki baat 100th episode
mann ki baat 100th episode

Mann Ki Baat 100 : ప్రధానమంత్రిగా 2014లో అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని మాటలను నేరుగా పంచుకునేందుకు మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతినెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆల్​ఇండియా రేడియోలో ప్రసారం అవుతోంది. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలు సహా అనేక విషయాలను ప్రధాని మోదీ ప్రజలతో పంచుకుంటూ వచ్చారు.

ఈ కార్యక్రమం ఇప్పటికే 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ఈనెల 30న వందో ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలు ఆలకించేలా.. అధికార భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సరాసరిన వంద చోట్ల.. ప్రజలు ఆలకించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం దేశవ్యాప్తంగా.. సుమారు 4 లక్షల వేదికలు ఏర్పాటు చేసి.. ప్రధాని ప్రసంగాన్ని వినిపిస్తామని బీజేపీ నేతలు తెలిపారు.

ఆయా ప్రాంతాలకు.. పెద్దఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలను తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మన్​కీ బాత్ వందో ఎపిసోడ్​ను.. చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా మన్ కీ బాత్ వినేలా ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ వివరించింది. బీజేపీ విదేశీ విభాగాలు, రాజకీయేతర సంస్థలు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి దుష్యంత్ గౌతమ్ తెలిపారు.

గవర్నర్ల అధికారిక నివాసమైన అన్నిరాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్‌ను వినిపించనున్నట్లు బీజేపీ పేర్కొంది. రాజ్ భవన్లకు ఆయా రాష్ట్రాల్లో పద్మ అవార్డులు అందుకున్న వారిని ఆహ్వానించనునట్లు వెల్లడించింది. పౌర సమాజం, సామాజిక కార్యకర్తలు, ఇతర సంస్థలు కూడా.. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకొస్తున్నారని దుష్యంత్‌ తెలిపారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే మన్‌కీబాత్‌ ప్రసార కార్యక్రమాలకు హాజరువుతారని చెప్పారు. అత్యంత ప్రజాదరణ కలిగిన కార్యక్రమంగా మన్‌కీబాత్‌ మారిందన్న ఆయన.. ప్రజలతో ప్రధాని మోదీ ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. అందుకే మోదీకి ప్రజల్లో రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని తెలిపారు.

మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలు మన్‌కీబాత్ వందో ఎపిసోడ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు.. ప్రశంసలు కురిపించారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మహిళా సాధికారత, సమ్మిళిత అభివృద్ధి వంటి విషయాల్లో మన్‌కీబాత్‌ కార్యక్రమం సమాజాన్ని, ప్రజలను కార్యోన్ముఖులను చేసిందని మైక్రోసాఫ్ట్ వస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వందో ఎపిసోడ్ ప్రసారమవుతున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

ఐరాసలో మన్​కీబాత్​ ప్రసారం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్​ 30న భారత కాలమానం ప్రకారం.. ఉదయం 11 గంటలకు.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ మేరకు "ప్రధానమంత్రి మోదీ "మన్ కీ బాత్" 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ఐరాస ప్రధాన కార్యాలయంలోని ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆ చారిత్రక ఘట్టం కోసం సిద్ధంగా ఉండండి!" ఐక్యరాజ్యసమితికి చెందిన భారత శాశ్వత రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.