ETV Bharat / bharat

పక్కా ప్లాన్​తోనే ట్రైన్​లో ప్రయాణికుడికి నిప్పు! ఉగ్రవాది పనేనా? అతడి కోసం పోలీసుల వేట

author img

By

Published : Apr 3, 2023, 4:21 PM IST

కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే ఘటనలో ఏడాది చిన్నారి సహా ముగ్గురు పట్టాలపై పడి చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఉగ్రకుట్ర ఉందన్న అనుమానంతో పోలీసులు.. ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

కేరళలో కదులుతున్న​ రైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటన ఉగ్రవాద చర్య అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు కావాలనే తోటి ప్రయాణికుడికి నిప్పంటించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన ప్రయాణికులు భయాందోళనతో చైన్ ​లాగి ట్రైన్​ ఆపిన వెంటనే.. నిందితుడు పక్కా ప్లాన్​తో అక్కడ నుంచి బైక్​పై పరారైనట్లు వెల్లడించారు. దీంతో ఈ కేసును ప్రత్యేక బృందాల సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన పోలికల ఆధారంగా పోలీసులు నిందితుడికి సంబంధిన స్కెచ్​ను కూడా గీయించారు. దీంతో పాటుగా పోలీసులకు ట్రాక్​పై మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ఎన్​ఐఏ కూడా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..
ఆదివారం రాత్రి 10 గంటలకు అలప్పుజ- కన్నూర్‌ రైలు కోరపుళ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే డీ1 కంపార్ట్​మెంట్​లో ఉన్న ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడితో ఘర్షణకు దిగాడు. అనంతరం అతనిపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. దీంతో డీ1, డీ2 కంపార్ట్​మెంట్​ల్లో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మంటలు ఇతర ప్రయాణికులకు అంటుకోగా.. 9 మంది గాయపడ్డారు. అప్రమత్తమైన మిగితా ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్‌ లాగి.. రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు.

కాలిన గాయాలైన 9 మంది ప్రయాణికులను రైల్వే పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత రైల్లో నుంచి ముగ్గురు ప్రయాణికులు కన్పించలేదని గుర్తించిన మిగతా ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులుకు సుమారు 100 మీటర్ల దూరంలోని పట్టాలపై 3 మృతదేహాలు కనిపించాయి. వారిలో ఏడాది చిన్నారి సహా ఓ మహిళ, ఓ వ్యక్తి మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటన సమయంలో వీరు రైలు నుంచి జారిపడటం లేదా కిందకు దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఘటనతో వీరికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

kerala train fire incident
ఘటనాస్థలంలో లభ్యమైన పెట్రోల్​ బాటిల్​

ఎర్రచొక్కా, టోపీ ధరించిన నిందితుడు!
ఘటన తర్వాత ఎమర్జెన్సీ చైన్‌ లాగడం వల్ల.. నిందితుడు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఓ వ్యక్తి బైక్‌పై అక్కడ వేచి ఉండటం చూసినట్లు తెలిపారు. డీ1 కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి ఎర్రచొక్కా, క్యాప్ ధరించి దాడికి పాల్పడ్డాడు. పెట్రోల్‌ దాడికి ముందు నిందితుడు బాధితుడితో కావాలనే వాగ్వాదానికి దిగినట్లు చెప్పారు. దీంతో ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఓ అనుమానాస్పద బ్యాగులో మరో పెట్రోల్ బాటిల్‌, 2 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంలు, ఫోరెన్సిక్ బృందాలు ముమ్మర శోధన చేపట్టాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ బాధాకరం, దిగ్భ్రాంతికరం అని అన్నారు.

kerala train fire incident
పోలీసులు గీయించిన నిందితుడి స్కెచ్​

స్కెచ్ గీయించిన పోలీసులు..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు నిందితుడికి సంబంధించి స్కెచ్​ గీయించారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు అతడికి సంబంధించి ఓ సీసీటీవీ ఫుటేజ్​ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు తమకు లభించిన ఆధారాల మేరకు.. నిందితుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 25 ఏళ్ల యువకుడిగా అనుమానిస్తున్నారు. 2002 బిల్కిన్​ బానో కేసుకు సంబంధించి నిందితులకు గుజరాత్​ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే ఈ ఘటనకు బిల్కిన్​ బానో కేసుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పక్కా ప్లాన్​తోనే దాడి..!
నిందితుడు ట్రైన్​లో దాడి చేసేందుకు కోరాపుజ వంతెననే ఎంచుకున్న పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వంతెనపై ప్రమాదం జరిగితే.. అందులోని ప్రయాణికులు నదిలో దూకి చనిపోయే అవకాశం ఉన్నందున.. నిందితుడు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసుల భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన అదే ట్రాక్​ పైన.. ఓ బ్యాగ్​ను దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఇది నిందితుడికి చెందిన బ్యాగ్​గా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాగ్‌లో ఇంగ్లిష్, హిందీలో రాసిన పాకెట్ డైరీ, నోట్‌బుక్​ లభ్యమయ్యాయి. పాకెట్​ డైరీలో కోవలం, కన్యాకుమారి, చిరైన్​కీజు, కులాచల్​ ప్రాంతాల గురించి ఉంది. ఇవే కాకుండా ఆ బ్యాగ్​లో ఉన్న మొబైల్​ ఫోన్​, లీటర్ పెట్రోల్​ బాటిల్, బట్టలు, ఇయర్​ఫోన్స్​, పెన్నులు, అద్దాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని డీజీపీ అనీల్​ కాంత్​ తెలిపారు.

kerala train fire incident
క్లూస్​ సేకరిస్తున్న పోలీసులు
kerala train fire incident
ట్రైన్​లో కాలిపోయిన సీట్లు
kerala train fire incident
క్లూస్​ సేకరిస్తున్న ఫోరెన్సిక్​ బృందం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.