ETV Bharat / bharat

'మన ఎన్నికల్లో ఇజ్రాయెల్ హ్యాకర్ల జోక్యం.. బీజేపీ ఫేక్​న్యూస్ గ్యాంగ్ అదే!'

author img

By

Published : Feb 16, 2023, 5:44 PM IST

విదేశీ హ్యాకర్ల సాయంతో దేశంలో జరిగే ఎన్నికలను బీజేపీ ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అంతర్జాతీయ కథనాలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించింది.

israeli-firm-influenced-indian-polls
israeli-firm-influenced-indian-polls

భారత్​లో జరిగే ఎన్నికల్లో విదేశీ కంపెనీలు చొరబడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఇజ్రాయెల్​కు చెందిన ఓ సంస్థ జోక్యం చేసుకుందని అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. భారతీయ జనతా పార్టీ ఇలాంటి సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపణలు గుప్పించింది. అనేక ఎన్నికల్లో అధికార పార్టీ ఇలా అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ మీడియా హెడ్ పవన్ ఖేడా, సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనతే పేర్కొన్నారు. కాంట్రాక్టు తీసుకొని హ్యాకింగ్ చేసే వ్యక్తులతో చేతులు కలిపి బీజేపీ ఎన్నికలను ప్రభావితం చేస్తోందని మండిపడ్డారు. 'పోస్ట్​కార్డ్ న్యూస్' అనే పోర్టల్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, దాని యజమాని మహేశ్ విక్రమ్ హెగ్డే.. బీజేపీ అతివాద వర్గానికి సన్నిహితుడని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గౌరీ లంకేశ్, ఎంఎం కలబురగి, గోవింద్ పన్​సారే, డాక్టర్ నరేంద్ర దభోల్కర్ వంటి సామాజిక కార్యకర్తల హంతకులకు ఆయన దగ్గరి వ్యక్తి అని పేర్కొన్నారు.

"గతంలో కేంబ్రిడ్జ్ అనలిటికా, ఆ తర్వాత పెగాసస్, ఇప్పుడు ఇది. టీమ్ జార్జ్ అని పేరు పెట్టుకున్న ఇజ్రాయెల్ హ్యాకర్ల బృందం భారత ఎన్నికలు, రాజకీయ వ్యవస్థలో తలదూర్చాయి. హ్యాకింగ్, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా ఎన్నికలను ప్రభావితం చేశామని ఆ ఇజ్రాయెలీ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. డిజిటల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకునేలా ఇజ్రాయెల్​ కాంట్రాక్ట్ హ్యాకర్లతో కలిసి మోదీ ప్రభుత్వం పనిచేస్తోందా? ఫేక్ న్యూస్ పోర్టల్ 'పోస్ట్​కార్డ్ న్యూస్​'తో టీమ్ జార్జ్​కు సంబంధం ఏంటి? ఈ కుంభకోణంపై మోదీ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందా?"
-పవన్ ఖేడా, సుప్రియా శ్రీనతే

అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇజ్రాయెల్ కంపెనీ రూపొందించే తప్పుడు వార్తలను బీజేపీ ఐటీ సెల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తోందని అన్నారు. ఈ విదేశీ శక్తులు భారత రాజకీయాలపై పెను ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసేలా పార్టీ నేతలు సైతం ఆ ఫేక్ న్యూస్​కు ఆజ్యం పోస్తున్నారు.

"ఇజ్రాయెల్ హ్యాకర్లు రాసే తప్పుడు రాతలు, ప్రచారాలకు.. బీజేపీ వ్యాప్తి చేసే ప్రచారాలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ముందుగా అనామక సోషల్ మీడియా అకౌంట్ నుంచి తప్పుడు వార్త బయటకు వస్తుంది. ఆ వార్తను రైట్ వింగ్ (మితవాదులు) ఎకోసిస్టమ్ వ్యాప్తి చేస్తుంది. బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీస్​బేరర్లు ఈ వార్తలను ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు వాటినే నిజాలు అంటూ ప్రచారం చేస్తాయి. వీటిపై టీవీల్లో తీవ్రంగా చర్చలు జరుగుతాయి. న్యూస్​పేపర్లలో స్టోరీలు వస్తాయి. ఓ నరేటివ్ తయారవుతుంది. తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తారు. ఇవన్నీ సాధారణ ఓటర్​ను ప్రభావితం చేసేలా ఉంటాయి. ఈ అబద్ధాలను ప్రశ్నిస్తే.. దుష్ప్రచారం చేసే ఆ ఎకోసిస్టమ్ నుంచి ఎలాంటి వివరణా ఉండదు. ఎందుకంటే వారి పని ఓటర్ల మదిలో అనుమానాలు రేకెత్తించడమే. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించడం, ఇతరుల ప్రతిష్ఠను తగ్గించేలా చేయడమే వారి లక్ష్యం."
-సుప్రియా శ్రీనతే, కాంగ్రెస్ నేత

2014లోనూ బీజేపీ ఇలాంటి అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సోషల్ మీడియా వేదికల్లో దుష్ప్రచారం చేసి 2014 లోక్​సభ ఎన్నికలను ప్రభావితం చేశారని అన్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్​కే చెందిన పెగాసస్ సాఫ్ట్​వేర్​ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. ఆ సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి రాహుల్​ గాంధీ వంటి విపక్ష నేతలనే కాకుండా.. తమ సొంత మంత్రులైన అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లద్ పటేల్​పైనా నిఘా పెట్టిందని ఆరోపించారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజె, స్మృతి ఇరానీ వంటి నేతలపైనా మోదీ సర్కారు గూఢచర్యం చేసిందని అన్నారు.

పెగాసస్​పై అబద్ధాలు..
పెగాసస్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. దర్యాప్తు కమిటీ నివేదికను ఇప్పటివరకు ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. 'సుప్రీంకోర్టులో పెగాసస్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న కమిటీకి కూడా మోదీ ప్రభుత్వం సూటిగా సమాధానాలు చెప్పకుండా తప్పించుకుందనేది వాస్తవం కాదా? పెగాసస్ సాఫ్ట్‌వేర్ ద్వారా బ్యూరోక్రాట్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ వ్యూహకర్తలు, ఈసీ, సీబీఐ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారనేది నిజం కాదా? దర్యాప్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఏకంగా ప్రధాన న్యాయమూర్తే అప్పుడు స్పష్టం చేశారు. పెగాసస్​పై దర్యాప్తు చేసిన కమిటీ తన నివేదికను ధర్మాసనానికి ఏనాడో సమర్పించింది. ఆ నివేదికను మాత్రం ఇప్పటికీ సీల్ వేసే ఉంచారు' అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.