ETV Bharat / bharat

సరిహద్దులో భారత్ వ్యూహాత్మక అడుగులు.. అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌!

author img

By

Published : Sep 10, 2022, 7:02 AM IST

Indian Airforce Base Ladakh: వాస్తవాధీన రేఖ సమీపంలో రక్షణపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంలో భారత్ దూసుకెళ్తోంది. అందులో భాగంగా లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపాన చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించనుంది. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

indian airforce base ladakh
సరిహద్దులో భారత్ వ్యూహాత్మక అడుగులు

Indian Airforce Base Ladakh: లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపాన చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించే ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్‌బీడబ్ల్యూఎల్‌) స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దీనికి తోడు మరో తొమ్మిది వ్యూహాత్మక ప్రాజెక్టులకు కూడా ఈ మండలి పచ్చజెండా ఊపింది.

చాంగ్‌థాంగ్‌, కారాకోరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిధిలోకి ఇవి వస్తాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో రక్షణపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ చర్యలు తీసుకొంటున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 1,259.25 హెక్టార్ల భూమిని మాహే ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజి రీ నోటిఫికేషనుకు మళ్లించే ప్రతిపాదనకు సైతం స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు ఇది 40 - 50 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ రీ నోటిఫికేషను 2014 నుంచీ పెండింగులో ఉంది. మూడు కీలకమైన రహదారుల విస్తరణ కూడా కమిటీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఉంది.

సరస్వతి హాన్లే పర్వతం మీద ఉన్న నేత్ర ఆప్టికల్‌ టెలిస్కోపునకు ఇస్రో లింకురోడ్డు నిర్మాణానికిగాను చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 1.5 హెక్టార్ల భూమి వినియోగ ప్రతిపాదనకూ ఆమోదం లభించింది. పై రెండు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటుకూ అనుమతి మంజూరు చేశారు.

అరుణాచల్‌ సరిహద్దుల్లో హెలీప్యాడ్లు..
అరుణాచల్‌ ప్రదేశ్‌లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆర్మీలోని సీనియర్‌ అధికారులు శుక్రవారం తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనపుడు సైనిక దళాలను, చినూక్‌ హెలిక్యాప్టర్ల వంటి వాటిని సత్వరం తరలించవచ్చన్నారు. అన్ని స్థావరాలను ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్కుతో అనుసంధానం చేస్తామని, వీటన్నింటికీ ప్రత్యేక ఉపగ్రహ టెర్మినళ్లు ఉంటాయని తెలిపారు. ఈ చర్యలు ఎల్‌ఏసీ వెంట నిఘాను బలోపేతం చేస్తాయన్నారు. 'తూర్పు సెక్టారులోని ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేము పెద్దపీట వేస్తున్నాం' అని బ్రిగేడియర్‌ టి.ఎం.సిన్హా సరిహద్దు పర్యటనకు వచ్చిన మీడియా బృందానికి తెలిపారు.

ఇవీ చదవండి: 'అరవై ఏళ్లుగా దిగుమతి చేసుకుంటున్నాం.. ఇకపై భారత్​లోనే తయారీ'

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.