ETV Bharat / bharat

దేశంలో మరో కొవిడ్​ వేరియంట్ కలకలం.. కేంద్రం అలర్ట్

author img

By

Published : Jan 3, 2023, 7:19 PM IST

Covid XBB variant : అమెరికా, చైనా, ఇంగ్లాండ్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన సబ్‌ వేరియంట్‌ భారత్‌కు కూడా వచ్చేసింది. భారత్​లో ఇప్పటి వరకు 5 కేసులు వెలుగుచూశాయి.

xbb variant covid
కొవిడ్ ఉద్ధృతి

Covid XBB variant : అమెరికా, ఇంగ్లాండ్‌లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమైన కరోనా వైరస్‌ ఉప రకం ఎక్స్​బీబీ 1.5.. భారత్‌లోనూ వెలుగుచూసింది. దేళంలో ఇప్పటివరకు 5 కేసులు బయటపడ్డాయని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్‌) తెలిపింది. గుజరాత్​లో మూడు, కర్ణాటక, రాజస్థాన్​లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

ఒమిక్రాన్‌కు చెందిన సబ్​వేరియంట్ ఎక్స్​బీబీ 1.5 అమెరికాలో 40.5 శాతం కేసులు పెరగడానికి కారణమైంది. ఇంగ్లాండ్‌, న్యూయార్క్‌లో ఏకంగా 75 శాతం కేసులు పెరగడానికి ఈ వైరస్‌ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీఏ.2 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ నుంచి ఎక్స్​బీబీ పుట్టుకొచ్చినట్లు వివరిస్తున్నారు.

తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఎక్స్​బీబీ సబ్‌ వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్స్​బీబీ 1.5 ఉపరకం కారణంగా పలు దేశాల్లో కేసులు పెరిగినప్పటికీ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. మన దేశంలో ఇప్పటికే.. 80 శాతానికిపైగా ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకున్నారని గుర్తుచేస్తున్నారు. ఎక్స్​బీబీ, ఎక్స్​బీబీ 1.5 సబ్‌ వేరియంట్లను మొదట భారత్‌లోనే గుర్తించినట్లు చెబుతున్నారు.

ఈ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. చాలాచోట్ల వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొన్నిచోట్ల 5 నుంచి 7 రెట్లు, మరికొన్నిచోట్ల 18 రెట్లు వ్యాప్తి చెందుతున్నాయి. కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 150 రెట్లు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో ఇదే పరిస్థితి ఉంటుందని భావించలేం. కారణం ఏమంటే ఇక్కడ 80 శాతానికి పైగా ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మెరుగైన రోగ నిరోధక శక్తి సాధించాం. 40 శాతానికిపైగా బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకున్నారు. అందువల్ల చైనా, అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఈ వేరియంట్‌ తీవ్రత తక్కువగానే ఉంటుంది.

--డాక్టర్‌ ఎం.వాలి, సర్ ​గంగారామ్‌ ఆసుపత్రి

చైనాలో కరోనా కేసులు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. నియంత్రణ, ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు కూడా ఆస్పత్రుల సన్నద్ధత, ఆక్సిజన్‌, ఇతర ఏర్పాట్లపై ఇప్పటికే
సమీక్షలు నిర్వహించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.