ETV Bharat / bharat

'సినిమా హాల్​లోకి బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చా?'.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

author img

By

Published : Jan 3, 2023, 5:43 PM IST

సినిమా హాళ్లలోకి బయట నుంచి ఆహారం, పానీయాల అనుమతిపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సినిమా హాళ్లు యజమానుల ప్రైవేట్ ఆస్తులని.. కాబట్టి ప్రేక్షకులు ఆహారం, పానీయాలు లోపలకు తీసుకువెళితే వాటిని నియంత్రించే హక్కు వారికి ఉందని స్పష్టం చేసింది.

cinema hall food allowed
సినిమా హాళ్లు

సినిమా థియేటర్లకు బయట నుంచి ఆహారం, పానీయాలు తీసుకురాకుండా ఆపే హక్కు హాల్​​ యజమానికి ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సినిమా హాల్​.. యజమాని ప్రైవేట్ ఆస్తి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​, జస్టిస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే హాళ్ల యజమాన్యం ప్రేక్షకుడికి మంచినీటిని అందించాలని తెలిపింది.

"ప్రేక్షకులు బయట నుంచి ఆహారం, పానీయాలు థియేటర్లోకి తీసుకురాకుండా నియంత్రించే హక్కు సినిమా హాల్​ యజమానికి ఉంది. అందుబాటులో ఉన్న స్నాక్స్​, కూల్​ డ్రింక్స్ కొనుగోలు చేయాలా? వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం. హాల్​లో కచ్చితంగా తినుబండారాలు కొనాలన్న నిబంధనేమీ లేదు. కాబట్టి ప్రేక్షకులు అవసరమైతేనే స్నాక్స్ కొనుగోలు చేస్తారు. అది వారి ఇష్టం."

-సుప్రీంకోర్టు

ప్రేక్షకులు సినిమా థియేటర్​లోకి ఆహారం, పానీయాలు తీసుకెళ్లడాన్ని నిరోధించవద్దని మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లను జమ్ముకశ్మీర్ హైకోర్టు 2018లో ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన అపీల్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మంగళవారం ఈ తీర్పును వెలువరించింది.

సినిమా హాళ్ల యజమానుల తరఫున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ అత్యున్నత ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ' సినిమా థియేటర్లలో తప్పనిసరిగా ఆహారం కొనుగోలు చేయాలనే నిబంధనేమీ లేదు. అన్ని థియేటర్లలో స్వచ్ఛమైన తాగు నీరు అందేలా చూస్తాం.' అని ఆయన తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.