ETV Bharat / bharat

sahiti Pharma: అచ్యుతాపురం సెజ్‌ పేలుడులో ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Jun 30, 2023, 12:47 PM IST

Updated : Jun 30, 2023, 9:33 PM IST

పరిశ్రమలో పేలుడు
పరిశ్రమలో పేలుడు

12:43 June 30

సాహితీ ఫార్మాలో ఎగిసిపడుతున్న మంటలు

అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Pharma Industry: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సాహితీ ఫార్మా సంస్థలో రియాక్టర్‌ పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆకాశాన్నంటేంతగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విని.. ఫార్మా సంస్థలో పనిచేస్తున్న కార్మికులు మొత్తం.. బయటకు పరుగులు తీశారు. ఏడుగురు కార్మికులకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఇద్దరు విశాఖ కేజీహెచ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ప్రమాదం జరిగిన సమయంలో సాహితీ ఫార్మాసంస్థలో మొత్తం 35 మంది కార్మికులు విధుల్లో ఉండగా.. మంటలను చూసి అందరూ పరుగులు తీశారు. 28 మంది కార్మికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదం జరిగిన రియాక్టర్‌కు సమీపంలో ఉన్న ఏడుగురు కార్మికులకు మంటలు అంటుకున్నాయి. వీరిలో రమేశ్‌, సత్తిబాబు, నూకినాయుడు, తిరుపతి అనే నలుగురి కార్మికులకు తీవ్ర గాయలయ్యాయి. వీరిని విశాఖలోని కేజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తుండగా.. పైలా సత్తిబాబు, ఉప్పాడ తిరుపతి మృతి చెందారు. ఆస్పత్రిలో మరో ఐదుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను మంత్రి అమర్‌నాథ్‌ పరామర్శించారు. మంటలు అదపు చేసేందుకు వచ్చిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది సైతం గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో సాహితీ ఫార్మా కంపెనీలో మొత్తం 35 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. మంటలు రాగానే 28 మంది బయటికి రాగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలార్పుతున్న ముగ్గురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన ఏడుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రమేష్‌(45), రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు(35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం వాసి నూకి నాయుడు(40, విజయనగరానికి చెందిన తిరుపతి(40), నక్కపల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు(43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పైలా సత్తిబాబు, ఉప్పాడ తిరుపతి మృతి చెందారు. -మురళీ కృష్ణ , ఎస్పీ

సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే.. అగ్నిప్రమాదం చోటు చేసుకుందని... ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు మండిపడ్డారు. అధికారులు సైతం ఫార్మాసంస్థల్లో తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సెజ్‌లోని మిగిలిన సంస్థలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కష్టపడి అదుపు చేశారు. విశాఖ నుంచి అత్యాదునిక ఫైర్‌ ఇంజిన్లు తెప్పించారు. నిపుణులైన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

విచారం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత: విశాఖ ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని.. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్​ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: విశాఖలోని సాహితీ ఫార్మా అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని మంత్రి అమర్‌నాథ్‌ పరిశీలించారు. సాహితీ ఫార్మా సంస్థ భద్రతా చర్యలు పాటించిందా లేదా అనేది పూర్తిస్థాయి విచారణలో తేలుతుందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామి ఇచ్చారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

Last Updated : Jun 30, 2023, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.