ETV Bharat / bharat

'నాకేటి సిగ్గు నవ్విపోదురుగాక' అన్న రీతిలో సీఎం జగన్​ తీరు

author img

By

Published : Jul 24, 2023, 4:22 PM IST

Updated : Jul 24, 2023, 9:16 PM IST

CM Jagan Helicopter Journey: సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రిగా గెలిచాక.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటనలు సాగిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి అందుకు విరుద్ధం. నాలుగు సంవత్సరాల నుంచి ఆయన తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా లెక్క చేయడం లేదు. అబ్బే నన్ను కాదులే అని దులుపేసుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా నా రూటే సపరేటు అంటున్నారు జగన్​.. మరి అసలు ఆయన రూటేంటి.. ఆయనపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో మీరే చదవండి..

cm helicopter tour
cm helicopter tour

'నాకేటి సిగ్గు నవ్విపోదురుగాక' అన్న రీతిలో సీఎం జగన్​ తీరు

CM Jagan Helicopter Journey: ముఖ్యమంత్రి జగన్​ ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాఫ్టర్​లోనే ప్రయాణిస్తారు. అది కూతవేటు దూరంలో ఉన్నా సరే.. మరెక్కడైనా కానీ.. ఆయన హెలికాఫ్టర్​ లేనిదే ప్రయాణం చేయరు. ఓ సినిమాలో నాకు ఆ కోకాకోలానే కావాలి అన్నట్లు.. నేను ఆ హెలికాఫ్టర్​లోనే వెళ్తాను అన్నట్లు ఉంటుంది ముఖ్యమంత్రి తీరు. అదేమన్నా అంటే.. భద్రత కోసం అంటారు. రోడ్డు మీద ప్రయాణం చేస్తేనే భద్రతకు ముప్పా.. గాల్లో ప్రయాణం చేస్తే భద్రతకు ముప్పు రాదా అని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఉద్యోగులకు సకాలంలో జీతాల ఇవ్వలేరు కానీ.. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కూతవేటు దూరానికి కూడా హెలికాఫ్టర్లే వాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే జగన్​ తీరు మారడం లేదు.

ఇక మన ముఖ్యమంత్రి హెలికాఫ్టర్​లోనే రావడానికి కారణాలు అంటే బోలేడు చెప్తున్నారు ప్రజలు, ప్రతిపక్ష నాయకులు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా కూడా రోడ్లను బాగు చేయలేదు కాబట్టి.. రోడ్డు మార్గం ద్వారా వస్తే ఎక్కడ నడుములు పట్టేస్తాయో అని రావడం లేదని.. అలాగే గుంతల రోడ్లను చూసి ప్రజలు ఎక్కడ అడ్డుకుంటారోననే భయంతో ముఖం చూపించలేక గాల్లోనే ప్రయాణిస్తున్నారని విమర్శిస్తున్నారు. సపోజ్​.. ఫర్​ సపోజ్​.. ఒకవేళ ఎప్పుడైనా ముఖ్యమంత్రి జగన్​ రోడ్డు మీద వెళ్లారే అనుకోండి.. రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టేస్తారు. అంటే ఆయన రోడ్డు మీద వెళ్లాలంటే ముందుగా హెలికాఫ్టర్​లో వచ్చి.. ఏదో అలా ఓ కిలోమీటర్​ దూరం ఉంటే అలా కారులో వెళ్తారు. గాల్లో ప్రయాణం చేస్తే ప్రజలు ఎలాగూ కనపడరు.. మరి కనీసం రోడ్డు మీద వెళ్లినప్పుడైనా ప్రజలకు కనపడే విధంగా వెళ్లాలి కదా అంటే అదీ లేదు.. ఆయన ప్రజలకు కనపడకుండా.. ప్రజలు ఆయనకు కనిపించకుండా అధికారులు రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టేస్తారు.

ఇక ఇంకో విషయం ఏంటంటే.. మన ముఖ్యమంత్రి గారూ హెలికాఫ్టర్లో వెళ్లినా.. కింద రోడ్డు మీద ట్రాఫిక్​ ఆంక్షలు అమలు అవ్వాల్సిందే. మీరు కితకితలు సినిమా చూశారా.. ? ఆ సినిమాలో ఓ సన్నివేశంలో ప్రయాణికులను ట్రాఫిక్​ సిబ్బంది ఆపుతారు. ఎందుకని అడిగితే.. సీఎం గారూ ఈ రూట్లో వస్తున్నారు అని ఆ పోలీసులు బదులిస్తారు. తీరా చూస్తే ముఖ్యమంత్రి గాల్లో ప్రయాణిస్తారు. సేమ్​ టు సేమ్​ ఆంధ్రప్రదేశ్​లో కూడా అలాంటి విధానమే అమలవుతోంది. ముఖ్యమంత్రి గాల్లో ప్రయాణిస్తే.. అదేదో రోడ్డు మీద వస్తున్నట్లు పోలీసులు ప్రవర్తిస్తారు.

అలాగే సోషల్​ మీడియాలో కూడా సీఎం జగన్​ పర్యటన మీద రకరకాల ట్రోల్స్​, మీమ్స్​ వస్తుంటాయి. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముద్దులు పెట్టి.. ముఖ్యమంత్రి అయ్యాక ముఖం కూడా చూపించడం లేదు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు లేని భద్రతా చర్యలు.. ఇప్పుడు ఎందుకని నిలదీస్తున్నారు. అయితే అసలు ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి పర్యటన గురించి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..

ఈరోజు రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్​ ప్రారంభించారు కదా. అయితే ఆయన ప్రయాణించే దూరం పట్టుమని పది కిలోమీటర్లు కూడా ఉండదు. అక్కడికి మన సీఎం గారూ.. హెలికాఫ్టర్లోనే ప్రయాణించారు. ఆయన పర్యటన కోసం అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. హెలికాఫ్టర్​ దిగడానికి రెండు హెలిప్యాడ్​లను సిద్ధం చేశారు. ముందుగా తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం చేరుకుని అక్కడ భూమి పూజ చేశారు. అయితే తాడేపల్లి నుంచి అక్కడికి దూరం 8కిలో మీటర్లు మాత్రమే. ఇక కృష్ణాయపాలెం నుంచి వెంకటపాలెం వెళ్లారు. అక్కడి నుంచి దూరం ఆరు కిలోమీటర్లు మాత్రమే. అక్కడ బహిరంగ సభ ముగించుకున్న తర్వాత సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉండే తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. దాదాపు అంతా కలిపితే 30 కిలోమీటర్లు కూడా రానీ.. ఈ ప్రయాణానికి ముఖ్యమంత్రి హెలికాప్టర్​ వాడటం.. దానికి హెలిప్యాడ్​లు సిద్ధం చేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Last Updated : Jul 24, 2023, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.