ETV Bharat / bharat

'ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బదిలీ - టీడీపీ విజయానికిదే నిదర్శనం'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 3:01 PM IST

Updated : Jan 10, 2024, 4:09 PM IST

TDP Chandrababu Raa Kadali Raa Public Meeting: పేదల బలహీనతను ఆసరా చేసుకుని వైఎస్సార్సీపీ సర్కార్ రాష్ట్రాన్ని దోచుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పేదల నడ్డివిరిచే జగన్ సర్కారు నుంచి కలిసికట్టుగా పనిచేసి ఏపీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

Chandrababu_Raa_Kadali_Raa_Public_Meeting
Chandrababu_Raa_Kadali_Raa_Public_Meeting

'ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బదిలీ - టీడీపీ విజయానికిదే నిదర్శనం'

TDP Chandrababu Raa Kadali Raa Public Meeting: విజయనగరం తెలుగు సంస్కృతి, సంప్రదాయాల నిలయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జిల్లాలోని బొబ్బిలిలో నిర్వహించిన "రా కదలిరా" బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలు సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

భోగాపురం విమానాశ్రయం: జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్న చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం నేటికీ పూర్తిచేయని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మన రాజధాని అమరావతి అని, దానికి ప్రజలంతా ఆమోదం తెలిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన జగన్ అమరావతిపై బురద చల్లారని మండిపడ్డారు. 'సైకో ప్రభుత్వం పోవాలి - రాష్ట్రం బాగుపడాలి' అని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చేందుకు తనతో పాటు నడవాలని పిలుపునిచ్చారు.

ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీలో మార్పులు చేర్పులు: ఓడిపోతారనే భయంతోనే వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాజాం ఎమ్మెల్యేను పాయకరావుపేటకు బదిలీ చేశారన్న ఆయన అగ్రకులాల వారిని బదిలీ చేసే ధైర్యం జగన్‌కు లేదని అన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేసే పరిస్థితి వచ్చిందంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓటరు జాబితాలో దొంగ ఓట్లు: వైఎస్సార్సీపీ ఓటమి భయంతో ఓటరు జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దొంగ ఓట్ల విషయాన్ని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​తో కలిసి సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల అధికారులే ఆశ్చర్యపోయారని చెప్పారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేసుకుందామన్న చంద్రబాబు, ఏపీని బాగుచేసే బాధ్యత టీడీపీ - జనసేన తీసుకుంటుందన్నారు.

ఎన్నికల తంతు అంతా సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పినట్టే : చంద్రబాబు

నిరుద్యోగ భృతి: పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు.

పేదలు సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి: నూతన సంవత్సరం రాష్ట్ర స్వర్ణయుగానికి సంకల్పం తీసుకున్నానన్న చంద్రబాబు తెలుగువారికి ఎంతో ముఖ్యమైన సంక్రాతి పండుగను కూడా చేసుకోలేని పరిస్థితిలో పేదలు ఉన్నారన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పండుగకు ఉచితంగా సరుకులిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతోపాటు ఆనాడు పేదల కోసం 'అన్నా క్యాంటీన్' తీసుకొచ్చి ఐదు రూపాయలకే పేదల కడుపు నింపామన్నారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు.

పేదల నడ్డివిరిచే జగన్ ప్రభుత్వం: రాష్ట్రంలో కరెంట్ రాకపోయినా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వమిదని జగన్ సర్కారుపై మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి సౌర, పవన్ విద్యుత్​ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో వినూత్న ఆలోచనలు, పద్ధతులతో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నాతో కలిసి నడవండి: చంద్రబాబు

విజయనగరం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం విజయనగరమని చంద్రబాబు పేర్కొన్నారు. గురజాడ అప్పారావు ఈ నేలపైనే పుట్టారన్న ఆయన తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా తీసుకుని సైకో జగన్‌పై పోరాడాలని అన్నారు. బొబ్బిలి సభలో జనసందోహాన్ని చూసిన ఆయన ఇంతటి భారీ జన ప్రభంజనాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ఈ జనవాహినిని చూసి తాడేపల్లి తలుపులు బద్ధలు కావాలన్న చంద్రబాబు అధోగతి పాలైన రాష్ట్ర ప్రజల కోసమే పవన్, తన పోరాటమని అన్నారు.

'భూరక్షణ కాదు భూ భక్షణ పథకం': ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ జగన్ కన్ను పడుతుందని ఆయన అన్నారు. భూములివ్వకపోతే మెడలు వంచి బలవంతంగా లాక్కుంటారన్నారు. వైఎస్సార్సీపీ తీసుకొచ్చింది 'భూరక్షణ కాదు భూ భక్షణ పథకం' అని పేర్కొన్నారు. దీంతోపాటు మన భూమి పట్టాపై ఆయన ఫొటో వేసుకున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణ లేని చట్టం మనకు అక్కర్లేదన్న ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే భూ రక్షణ చట్టం రద్దు చేస్తామన్నారు.

ఉత్తరాంధ్రలో బీసీ రాజ్యం: ఉత్తరాంధ్రలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఆధిపత్యం చలాయిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తమ హయాంలో బీసీ నేతలకు ప్రాధ్యాన్యత నిచ్చామని గుర్తు చేసిన ఆయన టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ బీసీ రాజ్యం వస్తుందన్నారు.

జగన్ చెప్పేవన్నీ అసత్యాలే: సీఎం జగన్‌ అన్ని రంగాలను రివర్స్‌ గేరులో పెట్టారన్న చంద్రబాబు, మళ్లీ ఓటేస్తే అందరినీ బానిసలుగా మారుస్తారన్నారు. దీంతోపాటు పింఛన్‌ రూ.3 వేలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్, అధికారంలోకి రాగానే విడతల వారీగా ఇస్తానని మాట మార్చారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3వేలు ఇచ్చేవాళ్లమని అన్నారు. రాష్టాన్ని అప్పుల్లోకి నెట్టేసిన అప్పుల అప్పారావు జగన్‌ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని ధ్వజమెత్తారు.

మద్యపాన నిషేధం: అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధమని చెప్పిన జగన్‌ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని చంద్రబాబు అన్నారు. దీంతోపాటు మద్యపానం నిషేధం చేయలేకపోతే ఓట్లు అడగనన్న జగన్ ఇప్పుడు అనేక రకాల మద్యం తీసుకొచ్చి పేదలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో గంజాయిపై ఒక్క రోజైనా అధికారులతో సీఎం సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు.

కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది - వచ్చే ఎన్నికల్లో పాండవులదే గెలుపు

Last Updated : Jan 10, 2024, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.