ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: ఉప్పు కోసం బ్రిటిషర్ల 'మహా కంచె'

author img

By

Published : Oct 26, 2021, 7:33 AM IST

Azadi Ka Amrit Mahotsav
ఉప్పు కోసం బ్రిటిషర్ల 'మహా కంచె'

భారత్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి మనుషుల మధ్య, మతాల మధ్య... అంతరాలు సృష్టించిన ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం.. భౌగోళికంగానూ దేశం నడిబొడ్డున ఓ మహా కంచెను వేసింది. చైనా మహా కుడ్యం తరహాలో 4వేల కిలోమీటర్ల మేర ఓ మహా కంచెను నిర్మించింది.

1870 సమయంలో.. పశ్చిమ భారతంలోని ప్రజలు తూర్పుభారత్‌లోకి అడుగుపెట్టాలంటే కష్టంగా ఉండేది. కారణం- రెండింటినీ వేరు చేసే పేద్ద ముళ్లకంచె అడ్డంగా ఉండటమే. ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధు నది నుంచి మొదలెడితే ఒడిశాలోని మహానది దాకా 4వేల కిలోమీటర్ల పొడవున ఈ కంచెను నిర్మించారు. అందుకే దాన్ని చైనాలోని గ్రేట్‌ వాల్‌తో పోల్చారు.

అసలు కారణం ఉప్పు

ఈ మహా కంచెకు కారణం ఉప్పు! రకరకాల పన్నులతో భారతీయుల రక్తమాంసాలు పిండిన బ్రిటిష్‌ వలస పాలకులు ఉప్పునూ వదల్లేదు. నేరుగా తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఈ పన్ను అధికంగా ఉండేది. అప్పట్లో భారతదేశ పశ్చిమ తీరంలోని కచ్‌ ప్రాంతంలోనూ, తూర్పు తీరంలోని ఒడిశాలోనూ ఉప్పు ఉత్పత్తి అయ్యేది. ప్లాసీ యుద్ధంలో గెలిచి బెంగాల్‌ను కైవసం చేసుకున్న ఈస్టిండియా కంపెనీ ఆ రాష్ట్రంలో ఉప్పు ఉత్పత్తి అంతటినీ గుప్పిట్లోకి తీసుకుంది. అత్యధిక ధరను చెల్లించగలవారికే ఈస్టిండియా కంపెనీ ఉప్పు క్షేత్రాలను లీజుకు ఇచ్చేది. వారు ఉత్పత్తి చేసిన ఉప్పును తిరిగి కంపెనీకే అమ్మేవారు-అదీ కంపెనీ నిర్ణయించిన ధరకే. ఆపైన వారు సామాన్యులకు అందుబాటులో ఉండని ధరలకు బహిరంగ మార్కెట్‌లో అమ్మేవారు. దీంతో జనం గిడ్డంగుల నుంచి ఉప్పు దొంగిలించసాగారు. కొంతమంది చట్టవిరుద్ధంగా తయారుచేసి చాటుగా అమ్మేవారు. మరికొందరు రాజ సంస్థానాల నుంచి బ్రిటిష్‌ ఏలుబడిలోని ప్రాంతాలకు ఉప్పును దొంగతనంగా చేరవేసేవారు.

14 వేల మందితో..

దీన్ని అరికట్టడానికి తెల్లవారు.. గోడకట్టాలని యోచించారు. కానీ అది భారీ ఖర్చుతో కూడుకున్నది కావటంతో ఊరుకున్నారు. ఆ సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వంలో కస్టమ్స్‌ అధికారిగా పనిచేసిన ఏఓ హ్యూమ్‌ (ఆ తర్వాతికాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌ను ఆరంభించింది ఈయనే)కు ఓ ఆలోచన వచ్చింది. 1867-70 మధ్య ముళ్ల చెట్లు, పొదలు నాటి దట్టమైన కంచె పెంచసాగారు. ఆయన వృక్ష శాస్త్రజ్ఞుడు కావడం దీనికి ఉపకరించింది. ఈ కంచె వేయడానికి తుమ్మ వంటి ముళ్ల చెట్లు, ముళ్ల పొదలను వినియోగించారు. ఇప్పటికీ మనం పిలిచే ఇంగ్లిష్‌ తుమ్మ/సర్కారు తుమ్మ ఇదే! చవుడు నేలల్లో కూడా ముళ్ల చెట్లు పెంచడానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కంచె వెడల్పు 14 అడుగులు కూడా ఉండేది. 1869లోనే కంచె నిర్మాణానికి 20 లక్షల ఘనపుటడుగుల మట్టి తవ్వి, లక్షన్నర టన్నుల ముళ్ల కంపలు తీసుకొచ్చారు. దీని నిర్వహణకు 1872లోనే 14,000 మంది సిబ్బందిని వినియోగించారు. ఈ సుదీర్ఘ కంచెను అంతర్గత కస్టమ్స్‌ రేఖగా వ్యవహరించారు. ప్రతి నాలుగు మైళ్లకు ఒక పోలీసు చెక్‌పోస్టు. దీని గుండా రవాణా అయ్యే ఉప్పు, పొగాకు, చక్కెరల నుంచి కూడా బ్రిటిష్‌ వాళ్లకు ఆదాయం వచ్చేది.

కానీ మహా ముళ్ల కంచె లేదా దేశాంతర్గత కస్టమ్స్‌ రేఖ పాక్షికంగానే సఫలమైంది. జనం ఒంటెల ద్వారా, ఎడ్ల బళ్ల ద్వారా ముళ్ల కంచెను దాటి ఉప్పు రవాణా చేసేవారు. లేదా కంచె ఇవతల నుంచి అవతలికి ఉప్పు బస్తాలు విసిరేసేవారు. రానురానూ మహా కంచె మహా గందరగోళంగా, నిర్వహణ భారంగా తయారవడంతో బ్రిటిష్‌వారు అక్కడక్కడా కాకుండా దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధించారు. దీంతో సరకు దొంగరవాణా లాభం లేని వ్యవహారమైంది. మహా కంచె కస్టమ్స్‌లైన్‌ నిర్వీర్యమైపోయింది. ప్రజలు ఎక్కడికక్కడ.. దీన్ని తగలబెట్టారు. 1879లో మహా కంచెను ఆంగ్లేయ ప్రభుత్వం పట్టించుకోవటం మానేసింది.

ఇదీ చూడండి:- స్వాతంత్య్ర సంగ్రామంలో చిమూర్ పాత్రేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.