వర్షాకాలంలో కామెర్ల ముప్పు - ఈ జాగ్రత్తలు పాటించాలట!
- మాన్సూన్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు - పలు టిప్స్ సూచిస్తోన్న నిపుణులు!

Published : June 19, 2026 at 10:40 AM IST
How to protect yourself from jaundice this monsoon : ఎండల తీవ్రత నుంచి ఉపశమనం ఇస్తూ వర్షాకాలం వచ్చేసింది. అయితే, ఇదే సమయంలో సూక్ష్మజీవులు కూడా అంతే వేగంగా విజృంభిస్తాయి. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగునీరు, ఆహారం కలుషితమవడం వంటి కారణాల వల్ల లివర్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతిపెద్ద ముప్పు కామెర్లు! ఈ క్రమంలో కామెర్ల బారిన పడకుండా, కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
సురక్షితమైన నీటిని తాగడం : మనం తాగే నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఫిల్టర్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీటి మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, ఈ కాలంలో బయట జ్యూస్ లేదా ఇతర పానీయలకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. 2016లో సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌లో మురుగునీటితో కూడిన తాగునీటిని తాగడం వల్ల కామెర్ల మహమ్మారి వ్యాపించింది. 1600 మందికి పైగా ప్రజలు దీనిబారిన పడ్డారు. వీరిలో 16 మంది వరకు మరణించినట్లు National Library of Medicine పేర్కొంది. అందుకే, సూక్ష్మజీవుల ప్రమాదాన్ని తగ్గించడానికి తాగునీటిని క్రమం తప్పకుండా శుద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీ ఆరోగ్యం గుట్టు విప్పే 'గుబిలి' - తెల్లగా, గోధుమరంగు, ఆకుపచ్చగా ఉంటే అర్థాలివే!
ఆహార పరిశుభ్రత : ఎల్లప్పుడూ ఇంట్లో వండిన తాజా, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మిగిలిపోయిన లేదా చల్లబడిన ఆహారాన్ని తినవద్దని చెబుతున్నారు. పచ్చిగా లేదా సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలను తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా చాట్, పానీపూరి, రోడ్డు పక్కన కట్ చేసి ఉంచిన పండ్లు, సలాడ్లను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. ఎందుకంటే, ఇవి కలుషితమైన నీటితో లేదా పరిశుభ్రత పాటించకుండా తయారు చేసి ఉండవచ్చట. అలాగే, ఇంట్లో కూడా పండ్లు, కూరగాయలను తినడానికి ముందు బాగా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం : ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ఇతరుల టూత్‌బ్రష్‌లు, రేజర్, నోటికి తాకే ఇతర వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మీ చుట్టు పక్కల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు.
clevelandclinic ప్రకారం, లక్షణాలు : జాండీస్ (పచ్చ కామెర్లు) సోకినప్పుడు కనిపించే లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
- ఆకలి మందగించడం
- వాంతులు కావడం
- ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం
- జ్వరం రావడం
- మూత్రం ముదురు రంగులోకి మారడం
- మలం లేత రంగులో రావడం
- కంటి తెల్లసొన, చర్మం పసుపు రంగులోకి మారడం
- కడుపులో నొప్పి
- ఫ్లూ లాంటి లక్షణాలు
- చర్మం దురద
- బరువు తగ్గడం
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తరచూ అనారోగ్యం పాలవుతున్నారా? - ఈ సమస్య ఒక్కసారి చెక్ చేయించుకోవాలంటున్న వైద్యులు!
"కాస్తైనా కదలండి" రోజూ ఐదు నిమిషాలు చాలు! - అకాల మరణాల ముప్పు తగ్గుతుంది!

