"సీజనల్ ఫ్రూట్స్" షుగర్ లెవల్స్ పెంచుతాయా? - నిపుణులు ఏమంటున్నారు?
- గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట! - ఇవి ఎక్కువగా ఉండే పండ్లు ఏంటో మీకు తెలుసా?

Published : April 30, 2026 at 4:02 PM IST
Best Fruits for Diabetes : రోజూ పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తుంటారు. సీజనల్ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తుంటారు. కానీ, డయాబెటిస్ బాధితులు పండ్లు తినడానికి భయపడుతుంటారు. పండ్లలో చక్కెరస్థాయి ఎక్కువగా ఉంటుందని, వాటిని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని భయపడుతుంటారు. వాస్తవానికి కొన్ని సీజనల్ ఫ్రూట్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచితే, మరికొన్ని నియంత్రిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
గ్లైసెమిక్ ఇండెక్స్ : ఆహారంలో కార్బోహైడ్రేట్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతుంటాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయి ఎంత మేర పెరుగుతుందో తెలిపే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అని పిలుస్తారు. ఆహారంలో గ్లూకోజ్ స్థాయి 55కు మించకుండా ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 56-59 మధ్య ఉంటే మధ్యస్థ, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌గా విభజిస్తుంటారు. అయితే, డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను మితంగా తింటే మంచిదని సలహా ఇస్తున్నారు. సాధారణంగా పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 56 నుంచి 103 యూనిట్ల వరకు ఉంటుందని National Library of Medicine పేర్కొంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకోవడం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపు చేయడంలో గొప్ప ప్రయోజనం ఉంటుందని తెలిపింది.
నేరేడు పండ్లు : మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం అని నిపుణులు చెప్తున్నారు. నేరేడుపండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో గ్లూకోజ్ లెవల్‌ను నియంత్రించడానికి దోహదపడుతుందట. పండ్ల విత్తనాలలో ఉండే జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయని, నేరేడు పండ్లలోని ఆంథోసైనిన్‌లు, ఎలాజిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు స్టార్చ్‌ను చక్కెరగా మారకుండా నిరోధించే సామర్థ్యం ఉంటుందని చెప్తున్నారు. నేరేడుపండ్లు యాంటీ డయాబెటిక్ లక్షణాన్ని కలిగి ఉన్నాయని National Library of Medicine పేర్కొంది.

సీతాఫలం : ఫైబర్ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ శోషణ నెమ్మదిగా జరుగుతుందంటున్నారు నిపుణులు. తద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందట. సీతాఫలంలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుందని, ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుందని International Journal of Current Microbiology and Applied Sciences ప్రచురించింది. అలాగని మరీ ఎక్కువ మొత్తంలో కాకుండా మితంగా తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

బ్లూ బెర్రీస్ : డయాబెటిస్ ఉన్నవారు తినడానికి అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో ఇవీ ముందున్నాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆంథోసైనిన్స్ సమ్మేళనాలు శరీరం గ్లూకోజ్ స్థాయిలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తాయట.
పుచ్చకాయ : పుచ్చకాయలో నీరు అధికంగా ఉంటుంది. పోషకాలు కూడా అధికమే. ఇందులో 72-80 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే, ఇది తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ త్వరగా విడుదలవుతుంది. అందుకే, దీనిని వీలైనంత తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు అరటిపండ్లు, మామిడి పండ్లు, అనాస పండు, ఎండు ద్రాక్ష, పుచ్చకాయ లాంటివి తినకూడదని clevelandclinic పేర్కొంది.

మామిడికాయ : వేసవిలో మాత్రమే లభించే మామిడికాయ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. కానీ, ఇందులో 51-60 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాగే, ఫ్రక్టోజ్, సుక్రోజ్ శాతం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే దీనిని తక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ప్రశాంతమైన నిద్ర కావాలా? - ఈ అపోహలు వీడాలంటున్న నిపుణులు!
ఉదయాన్నే కీళ్లు పట్టేసినట్లు అనిపిస్తుందా? - "యూరిక్ యాసిడ్" సమస్య కావొచ్చట!

