రోడ్లపై ఆకతాయిల బైక్ స్టంట్లు - వాహనాల సీజ్, యువకుల అరెస్ట్
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Feb 8, 2024, 7:59 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2024/640-480-20702298-thumbnail-16x9-bike-stunts.jpg)
Police Arrest Youth Held Bike Stunts : వారికి భయం లేదు, బాధ్యత లేదు. తమ ప్రాణాలతో చెలగాటమాడటమే గాకుండా ఇతరుల ప్రాణాలకు యమదూతలుగా మారుతున్నారు. చీకటి పడిందంటే చాలు, నగరంలో కొందరు ఆకతాయిలు ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తూ, వచ్చి పోయే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న రైడర్లను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి మాదాపూర్ టీ-హబ్ వద్ద రోడ్లపై కొందరు యువకులు ప్రమాదకరంగా బైక్ విన్యాసాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు. రోడ్లపై నిర్లక్ష్యంగా బైక్‌లను నడుపుతూ రచ్చ చేస్తున్నారని సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాల్లో విన్యాసాలు చేయడంతో, మొత్తం ఆరుగురు రైడర్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పట్టుబడ్డ రైడర్ల నుంచి 6 లక్షల 40 వేల రూపాయలు విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.