కంట్రోల్ తప్పిన హెలికాప్టర్- భక్తులు హడల్- హెలిప్యాడ్​కు దూరంగా ల్యాండింగ్ - Helicopter Spins While Landing

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 5:14 PM IST

thumbnail
Helicopter Spins While Landing (Source : Disaster Management Department)

Helicopter Spins While Landing : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ఓ హెలికాప్టర్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. భక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తి గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, పైలట్‌ అప్రమత్తత వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఇదీ జరిగింది
కేస్ట్రల్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరింది. అందులో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్‌కు సుమారు 100 మీటర్ల దూరంలో గడ్డి నేలపై అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఘటనలో  హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన సమయంలో హెలికాప్టర్ వెనక భాగం నియంత్రణ కోల్పోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.

గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌తో కూడిన చార్​ధామ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైంది. హిందువులకు ఈ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఇది యమునోత్రి నుంచి మొదలై, గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా సాగి, చివరకు బద్రీనాథ్‌లో ముగుస్తుంది. ఈ ఏడాది యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తులు అందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.