ETV Bharat / state

ప్రత్యర్థులు పోటీలో లేకుండా చేస్తేపోలా!- వైసీపీ కుటిల వ్యూహంపై ప్రతిపక్ష నేతల ఆందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:19 AM IST

AP_government_not_Revealing_cases_details
AP_government_not_Revealing_cases_details

YSRCP Government Not Revealing Cases Details: విపక్ష అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఎన్నికల అఫిడవిట్లలో కేసుల వివరాలు చెప్పేందుకు వీల్లేకుండా చేసేందుకు పోలీసులతో కుమ్మక్కై కుట్ర చేస్తోంది. ప్రభుత్వ అరాచకాలపై పోరాడినందుకు ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపుగా అనేక కేసులు నమోదు చేసిన జగన్‌ సర్కార్‌ వాటి వివరాలను గుట్టుగా దాచుతోంది. తద్వారా విపక్ష అభ్యర్థుల నామినేషన్లు చెల్లకుండా చేసేందుకు కుటిల వ్యూహం పన్నుతోంది.

YSRCP Government Not Revealing Cases Details: అధికారం చేపట్టింది మొదలు టీడీపీ (TDP) సహా ఇతర ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా అయిదేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమ, తప్పుడు కేసులు బనాయించిన వైసీపీ (YSRCP) ప్రభుత్వం, ఆ కేసుల వివరాల్ని వారికి తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తనపై ఎక్కడెక్కడ ఏయే కేసులున్నాయో వివరాలివ్వాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. తనపై నమోదైన కేసులు, ఎఫ్‌ఐఆర్‌ కట్టకుండా పెండింగ్‌లో ఉంచిన ఫిర్యాదుల వివరాల కోసం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి సృష్టించారు.

బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దుస్థితి లేదు. తమపై ఎక్కడెక్కడ ఏయే కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు పోరాడాల్సి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష అభ్యర్థులు వారిపైన ఉన్న కేసుల వివరాల్ని పూర్తిగా అఫిడవిట్‌లో పొందుపరిచేందుకు వీల్లేకుండా చేసేందుకు అధికార వైసీపీ, పోలీసులతో కుమ్మక్కై కుటిల వ్యూహం పన్నింది. తద్వారా వారి నామినేషన్లు ఆమోదం పొందకుండా చేసేందుకు కుట్ర చేస్తోంది.

తనపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ డీజీపీకి చంద్రబాబు లేఖ

ఎప్పుడెప్పుడో కేసులు నమోదు చేసేసి రహస్యంగా: ఎవరిపైన అయినా కేసు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తికి తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ అధికారం చేపట్టినప్పటి నుంచి జీఓలు మొదలు ప్రతి అంశంలోనూ పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చేసిన జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసుల వివరాలనూ గుట్టుగానే ఉంచుతోంది. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నందుకు కక్షపూరిత ధోరణితో గత అయిదేళ్లలో ప్రతిపక్ష పార్టీల నాయకులపైన రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లలోనే కాకుండా సీఐడీ (CID), ఏసీబీ (ACB) తదితర ప్రత్యేక విభాగాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు పెట్టారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏదైనా కేసు నమోదైన 24 గంటల్లోగా ఆ ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. సీఐడీ ఒక్కటంటే ఒక్క ఎఫ్‌ఐఆర్‌నూ జనాలకు అందుబాటులో ఉంచట్లేదు. ఎప్పుడెప్పుడో కేసులు నమోదు చేసేసి, వాటిని సీఐడీ రహస్యంగా ఉంచుతోంది. అదే విధంగా తాము కావాలనుకున్నప్పుడే బయటపెడుతోంది. వివిధ పోలీసుస్టేషన్లలో ప్రతిపక్ష నాయకులపైన నమోదైన కొన్ని ముఖ్యమైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లనూ దాచిపెట్టేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో నిందితుల జాబితాలో ‘ఇతరులు’ అని పేర్కొని కొన్నాళ్ల తర్వాత ఆ స్థానంలో ప్రతిపక్ష నేతల పేర్లు చేరుస్తున్నారు. వారిని అరెస్టు చేసినప్పుడో లేదా సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులిచ్చినప్పుడో ఈ కేసుల విషయం వెలుగులోకి వస్తోంది.

ఎన్నికల వేళ టీడీపీ నేతలపై అక్రమ కేసులు- 'జగన్​ కక్ష సాధింపు చర్యలు'

నామినేషన్‌ చెల్లనివ్వకుండా చేసేందుకేనా: మరో నాలుగైదు రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు వారిపైన ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను తమ అఫిడవిట్‌లో తెలపాలి. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీచేయనున్న అభ్యర్థులకు వారిపై ఎక్కడెక్కడ ఏయే కేసులున్నాయనేది పోలీసులు సమాచారమివ్వకపోతే వారు అఫిడవిట్‌లో ఆ వివరాలు పొందుపరచటం సాధ్యం కాదు.

ఓవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తుంటే ఇప్పటికీ ఎవరెవరిపై ఏయే కేసులున్నాయో వారికి పోలీసులు సమాచారమివ్వకపోవటం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఫలానా అభ్యర్థిపైన ఫలానా స్టేషన్‌లో కేసులున్నాయని, ఆ వివరాల్ని అఫిడవిట్‌లో పొందుపరచలేదని, అందుకే ఆ నామినేషన్‌ చెల్లనిదిగా ప్రకటించాలంటూ వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే కుటిల వ్యూహం దీనిలో దాగి ఉంది.

ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు - టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు సమాచారంతో అఫిడవిట్‌ సమర్పిస్తే వారి నామినేషన్‌ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125-ఏ ప్రకారం తప్పుడు అఫిడవిట్‌ సమర్పిస్తే ఆరు నెలల వరకూ శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8ఏ ప్రకారం వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయవచ్చు. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైన వై.శ్రీనివాసులురెడ్డి 2011లో ఆయనపై నమోదైన ఓ క్రిమినల్‌ కేసు విషయాన్ని అఫిడవిట్‌లో పేర్కొనలేదు.

దీనిపై ఆయన ప్రత్యర్థి పిటిషన్‌ దాఖలు చేయగా, శ్రీనివాసరెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన నామినేషన్‌ ఆమోదించటం చట్టవిరుద్ధమని హైకోర్టు కొన్నాళ్ల కిందట తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను గోప్యంగా ఉంచటం వల్ల వారు తమకు తెలియకుండానే ఎన్నికల అధికారులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించాల్సిన పరిస్థితులను జగన్‌ ప్రభుత్వం, పోలీసులు కల్పిస్తున్నారు.

టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు - గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

కేసుల వివరాలివ్వాలని కోరుతూ లేఖలు: 2019 తర్వాత రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లు, సీబీఐ, ఏసీబీ తదితర ప్రత్యేక విభాగాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డికి ఈ నెల 2న లేఖ రాశారు. ఇప్పటి వరకూ దానికి సమాధానం లేదు. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసులు పెట్టారు. వాటిలో చాలా కేసులు గుట్టుగా ఉంచారు. దీంతో ఆయన ‘తనపై ఇప్పటివరకూ నమోదైన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు కాకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలు అందజేసేలా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కొన్నాళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు.

ప్రత్యర్థులు పోటీలో లేకుండా చేస్తేపోలా!- వైసీపీ కుటిల వ్యూహంపై ప్రతిపక్ష నేతల ఆందోళన

హైకోర్టు ఆదేశాలిస్తే తప్ప ఆయనపై ఉన్న కేసుల వివరాలను పోలీసులు తెలియజేయలేదు. తనపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇచ్చేలా సీఐడీని ఆదేశించాలంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ కొన్నాళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. చివరికి న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ ఆ కేసుల వివరాలను సమర్పించింది. టీడీపీ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత తదితరులు కూడా తమపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశారు.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వైసీపీ ప్రలోభాలు - చిల్లర తాయిలాలతో కుల, మత సంఘాలకు ఎర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.