ETV Bharat / state

'ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా' - గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 11:21 AM IST

Updated : Mar 18, 2024, 4:49 PM IST

Telangana Governor Resigns : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ పదవులకు రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్​సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ చేయనున్నట్లు సమాచారం.

Tamalisai Soundara Rajan
Tamalisai Soundara Rajan

Telangana Governor Resigns : గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ పదవితో పాటు అదనపు బాధ్యతల్లో ఉన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికీ రాజీనామా చేశారు. రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు వీలుగా తమిళిసై రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ ఉదయం గవర్నర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తన రాజీనామాపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని వెల్లడించారు. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె, తాను ఎప్పటికీ తెలంగాణ సోదరినే అని వ్యాఖ్యానించారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై

Governor Tamalisai Soundara Rajan Resign : తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్, 2019 సెప్టెంబర్ 8న రాష్ట్రానికి గవర్నర్​గా వచ్చారు. ఉదయం 11 గంటలకు అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్​ చౌహాన్​ ఆమెతో రాష్ట్ర గవర్నర్​గా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండో గవర్నర్​గా తమిళిసై బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి సీఎం కేసీఆర్​, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్రానికి చెందిన అప్పటి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ ​సెల్వం కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై, 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి లోక్​సభకు పోటీ చేసిన కరుణానిధి కుమార్తె కణిమొళిపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్​గా భారత రాష్ట్రపతి నియమించారు.

రానున్న లోక్​సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పోటీ చేస్తారని ఎప్పట్నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఇవాళ ఉదయం గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్​సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు తమిళిసై చెన్నై వెళ్లారు.

వరుసగా మూడోసారి వన దేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్​లో ఉత్సాహంగా 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' - జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

Last Updated : Mar 18, 2024, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.